ఎన్నికల ట్రైనింగ్‌కు డుమ్మా కొట్టిన టీచర్.. పెళ్లి చేయండంటూ అధికారులకు లేఖ...
ప్రస్తుతం ఐదురాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎలక్షన్స్ అనగానే ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే, ప్రభుత్వ ఉపాధ్యాయులపై అదనపు పని భారం పడుతుంది. ముందుగానే ఎలక్షన్ డ్యూటికి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఎన్నికల డ్యూటీ కోసం ప్రత్యేకంగా ముందుగా శిక్షణ కూడా ఇస్తారు. శిక్షణ అనంతరం పోలింగ్ డ్యూటి కూడా వేస్తారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే పోలింగ్ డ్యూటీల ట్రైనింగ్‌లు ప్రారంభమయ్యాయి. అయితే, తాజాగా ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు పోలింగ్ డ్యూటీ ట్రైనింగ్‌కు డుమ్మా కొట్టాడు. అయితే, దానికి బదులుగా ప్రభుత్వం ఆయనకు షోకాజ్ నోటీసులు పంపించింది. దానికి ఆ ఉపాధ్యాయుడు సమాధానంగా ముందు పెళ్లి చేయండి సార్ అంటూ ప్రభుత్వానికి ఓ లేఖ రాశాడు.
ఎన్నికల డ్యూటీకి గుడ్‌బై చెప్పాడు: అక్టోబర్ 16, 17వ తేదీల్లో పోలింగ్ డ్యూటీ కోసం శిక్షణ ఉంటుందని, అందుకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు హాజరు కావాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఓ ఉపాధ్యాయుడు మాత్రం ఆ నోటిఫికేషన్‌ను బేఖాతరు చేసి ట్రైనింగ్ సెషన్‌కు డుమ్మా కొట్టాడు. ఎన్నికల డ్యూటీకి గుడ్‌బై చెప్పాడు. ఆ ఉపాధ్యాయుడు చేసిన పనికి ప్రభుత్వానికి కోపం వచ్చింది. దాంతో వెంటనే నిన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదని షోకాజ్ నోటీసులు ఆయనకు పంపించింది. ఆ నోటీసులకు ఆ ఉపాధ్యాయుడు పంపిన సమాధానం ఆ ప్రాంతంలో చర్చనీయాంశమైంది.

సంస్కృత ఉపాధ్యాయుడు: మధ్యప్రదేశ్‌కు చెందిన అఖలేశ్ కుమార్ సత్నా జిల్లా అమర్‌పటన్‌లో మహుదార్ హైయర్ సెకడరీ స్కూల్‌లో సంస్కృతం ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతర ఉపాధ్యాయుల్లాగే ఆయనకూ పోల్ డ్యూటీకి హాజరవ్వాలని ప్రభుత్వ ఆదేశం వచ్చింది. అక్టోబర్ 16, 17వ తేదీన శిక్షణకు సంబంధించిన సెషన్ నిర్వహించారు. అయితే, అఖిలేష్ కుమార్ ఆ సెషన్‌కు డుమ్మా కొట్టారు. అక్టోబర్ 27వ తేదీన ఆ ఉపాధ్యాయుడికి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు పంపింది. ఆ నోటీసులకు ఆ ఉపాధ్యాయడు వినూత్న పద్ధతిలో 'పాయింట్ టు పాయింట్' అని టైటిల్ పెట్టి తన సమాధానాన్ని వ్యక్తపరిచారు.
రూ. 3.5 లక్షలు వరకట్నం ఇప్పించండి: అయితే ఆ ఉపాధ్యాయుడు రాసిన లేఖలో ఈ విధంగా ఉంది. 'నా జీవితం అంతా భార్య లేకుండానే రాత్రులు గడపాల్సి వస్తోంది. నా రాత్రులన్నీ వృథా అయిపోతున్నాయి. ముందుగా నాకు పెళ్లి జరిపించండి అంటూ మొరపెట్టుకున్నాడు. ఇంకా రూ. 3.5 లక్షలు వరకట్నంగా కావాలని, అవి క్యాష్ ఇచ్చినా పర్లేదని, లేకపోతే అకౌంట్లో వేసినా పర్లేదని పేర్కొన్నారు. అలాగే, సింగ్రౌలి టవర్ లేదా రేవా జిల్లాలోని సమదరియాలో ఫ్లాట్ కోసం లోన్ ఇప్పించేలా చేయాలని తెలిపారు. 'ఇలాంటి పరిస్థితిలో నేను ఏం చేయగలను? నాకు నోటి నుంచి మాటే రావడం లేదు. నేను ఏం చేయాలి? మీరే చెప్పండి. మీరు సముద్రమంతా జ్ఞానం కలవాళ్లు' అని ఆ ఉపాధ్యాయుడు వివరించాడు. అయితే, అఖిలేశ్ కొలీగ్స్ దీనిపై స్పందించారు. ఆయన చానాళ్లుగా పెళ్లి కోసం ఆలోచిస్తున్నారని, పెళ్లి కాకపోవడంతో తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారని వారు చెప్పారు.












Click it and Unblock the Notifications