CJI NV Ramana: థర్డ్ డిగ్రీ ట్రీట్‌మెంట్: పోలీస్ స్టేషన్లు, జైళ్ల వద్ద అలాంటి హోర్డింగులు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత కొనసాగుతోందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. మానవ హక్కుల ఉల్లంఘన పోలీస్ స్టేషన్లలో అధికంగా నమోదవుతోందని, సమాజానికి ఇది శ్రేయస్కరం కాదని అన్నారు. సమాజంలో ఇప్పటికీ కస్టోడియల్ హింస, పోలీసుల దాడులు కొనసాగుతోండటాన్ని ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంరక్షణ ఉన్నప్పటికీ.. కస్టోడియల్ హింస తీవ్రం కావడం సరికాదని పేర్కొన్నారు. దీనికి ప్రధాన కారణం- పోలీస్ స్టేషన్లలో న్యాయపరమైన ప్రతినిధిత్వం లేకపోవడమేనని చెప్పారు.

మొబైల్ యాప్ లాంచ్..
జాతీయ న్యాయసేవల అథారిటీ రూపొందించిన మొబైల్ యాప్‌ను ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. విజన్ అడ్ మిషన్ స్టేట్‌మెంట్‌ను విడుదల చేశారు. అనంతరం ప్రసంగించారు. ఉచిత న్యాయ సేవలు తమకు అందుబాటులో ఉన్నాయనే అవగాహనను ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎన్వీ రమణ అనే్నారు. ఉచితంగా న్యాయసేవలను పొందడం అనేది రాజ్యంగం కల్పించిన హక్కుగా అభివర్ణించారు. దీనిపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి అవసరమైన చర్యలనే చేపట్టాలని సూచించారు.

ఉచిత న్యాయసేవపై ప్రచారం..
ఈ దిశగా ప్రతి పోలీస్ స్టేషన్, కారాగారాల వద్ద హోర్డింగులను నెలకొల్పాలని సూచించారు. దీనిపై జాతీయ న్యాయసేవ అథారిటీ దేశవ్యాప్తంగా ఓ ప్రచార ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని ఎన్వీ రమణ అకాంక్షించారు. ఏడాదిన్నర కాలంగా దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ జాతీయ న్యాయసేవ అథారిటీ.. తన సర్వీసులను కొనసాగించడం హర్షణీయమని అన్నారు. గ్రామాలు, మారుమూల ప్రాంతాలకు సైతం తమ ఉచిత న్యాయసేవలను తీసుకెళ్లేలా చర్యలను చేపట్టాలని సూచించారు. పేదలకు న్యాయం దూరం కాకూడదని జాతిపిత మహాత్మాగాంధీ కోరుకునే వారని గుర్తు చేఃశారు.

పోస్టల్ సేవలను వినియోగించుకోవాలి..
గ్రామీణ స్థాయిలో ప్రజలు న్యాయ సేవలను అందుకోవడంలో అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగించాలని అన్నారు. ఈ విషయంలో పోస్టల్ డిపార్ట్‌మెంట్ సహాయ, సహకారాలను తీసుకోవాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. క్షేత్రస్థాయిలో కనెక్టివిటీ ఉన్నందు వల్ల ఆ డిపార్ట్‌మెంట్ సహాయ, సహకారాలు ఉపకరిస్తాయని పేర్కొన్నారు. దేశంలో పల్లెల సంఖ్య అధికంగా ఉంటోందని, కోట్లాదిమంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తోన్నారని, వారందరికీ ఉచితంగా న్యాయసేవలను అందజేసే విషయంలో పోస్టల్ శాఖ అధికారులు సహాయ, సహకారాలను తీసుకోవడం విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని చెప్పారు. ఈ విషయంలో పోస్ట్‌మేన్ ఒక వారధిగా ఉపయోగపడతారని ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.

కొంత సమయం కేటాయించండి..
పేదలకు న్యాయసేవలను ఉచితంగా అందజేయడంపై న్యాయవాదులు తమ దృష్టిని కేంద్రీకరించాల్సి ఉందని ఎన్వీ రమణ సూచించారు. ప్రత్యేకించి- సీనియర్ అడ్వొకెట్లు.. తమ రోజువారీ కార్యక్రమాల్లో కొంత సమయాన్ని ఉచిత న్యాయసేవల కోసం కేటాయించాలని అన్నారు. ఉచిత న్యాయసేవలపై ప్రజల్లో అవగాహనను కల్పించే విషయంలో మీడియా పాత్రను కూడా ఎంత మాత్రం విస్మరించడానికి వీల్లేదని చెప్పారు. మీడియా తన వంతు సహకారాన్ని అందజేయాలని సీజేఐ ఎన్వీ రమణ అప్పీల్ చేశారు. ప్రజలకు అత్యవసరమైన ఈ మిషన్‌లో మీడియా సంస్థలు, ప్రతినిధులు కూడా భాగస్వామ్యం కావాలని సూచించారు. పేదలకు సత్వర న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications