ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేరు.. బీజేపీపై డీఎంకే ఎంపీ ఫైర్
వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహరం లోక్ సభలో మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ విషయంలోనే అధికార, విపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఈ బిల్లును ఆమోదించడానికి ఎన్డీఏ ప్రవేశపెట్టగా.. ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే ఎంపీ ఎ.రాజా బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒక్క ముస్లిం ఎంపీ కూడా లేని పార్టీ మైనారిటీల హక్కులను కాపాడేందుకు బిల్లును తీసుకురావడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
అంతే కాకుండా ప్రవేశపెట్టిన బిల్లును సమర్థించడానికి ముస్లిం ఎంపీ ఒక్కరు కూడా బీజేపీలో లేరన్నారు. కానీ బీజేపీ మాత్రం మనకు లౌకికవాదాన్ని బోధిస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి ప్రసంగ పాఠాన్ని జేపీసీ నివేదికతో పోల్చి చూడాలని సవాల్ చేశారు. అది సరిపోలితే తాను ఈ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానన్నారు. వక్ఫ్ బిల్లును రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని ఎంపీ రాజా గుర్తు చేశారు.

ఎన్డీయే ప్రభుత్వం దేశం మొత్తంపై రాజకీయ బిల్లును రుద్దేందుకు యత్నిస్తుందని ఫైర్ అయ్యారు. తమిళనాడు ఆమోదించిన తీర్మానాన్ని విస్మరిస్తే అది దేశ ఐక్యతకు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. వక్ఫ్ చట్టంలో సవరణ అంశం కూడా జేపీసీకి వెళ్లిందని ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ అన్నారని గుర్తు చేశారు. జేపీసీ దాఖలు చేసిన నివేదికను వ్యతిరేకంగా 5 కోట్ల ఈ-మెయిల్స్ వచ్చాయని చెప్పారన్నారు. వక్ఫ్ నిర్వహణ ఇప్పుడు ముస్లింల చేతులు వీడుతుందన్నారు. జేపీసీ కేవలం మోసం అని రాజా అభిప్రాయపడ్డారు. ఈ బిల్లును ఉపసంహరించుకునే వరకు తాము శాంతియుతంగా నిరసన తెలుపుతామన్నారు.
మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ముస్లింల మతపరమైన వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆయన స్పష్టం చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు చోటు లేదని, ముస్లింల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందనే వాదనల్లో నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు.












Click it and Unblock the Notifications