వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సముద్రంలో చేపల వేటకు వెళ్లి తప్పిపోయారు, ఒక దీవిలో చిక్కుకున్నారు.. తరువాత ఏమైంది?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

ఎడిసన్ డేవిస్, అగస్టీన్ నెమస్ నవంబర్ 27న దక్షిణ తీరాన అరేబియా సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్లారు. క్రిస్మస్ కల్లా ఇంటికి వచ్చేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు.

ఆ తరువాత కొన్ని వారాల పాటు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు.

అరేబియా సముద్రం లోపలికెళ్లి చేపలు పట్టడానికి 15 మంది మత్స్యకారులు బయలుదేరారు. వారిలో ఎడిసన్, అగస్టీన్ కూడా ఉన్నారు. వాళ్లు తిరిగి రావడానికి సుమారు మూడు వారాలు పడుతుందని అంచనా వేశారు.

అనుకున్న సమయనికి మత్స్యకారులు ఇంటికి రాలేదు. జాలర్లకు ఇది మామూలే. సముద్రంలోకి వెళితే, వెనక్కి రావడం కొన్ని రోజులు ఆలస్యం కావచ్చు. అందుకే, కుటుంబ సభ్యులు మొదట కంగారుపడలేదు.

కానీ, క్రిస్మస్ కూడా దాటిపోయింది. మత్స్యకారులు ఇంటికి రాలేదు. దాంతో, కుటుంబ సభ్యులు భయపడ్డారు.

2017లో సైక్లోన్ ఓఖి మిగిల్చిన దుఃఖాన్ని వాళ్లింకా మర్చిపోలేదు. ఆ తుపాను తాకిడికి పదుల సంఖ్యలో మత్స్యకారులు ప్రాణాలు కోల్పోయారు.

మళ్లీ అలాంటిదేమైనా జరిగి ఉండవచ్చని కుటుంబ సభ్యులు కీడు శంకించారు.

కానీ, జనవరి 2న మత్స్యకారులు వెనక్కి తిరిగివచ్చారు.

వాళ్లు వెళ్లిన బోటు ఇంజిన్ పాడయింది. దాంతో, వాళ్లంతా బ్రిటిష్ హిందూ మహాసముద్రంలో భాగమైన ఒక మారుమూల దీవిలో చిక్కుకుపోయారు. కొన్ని రోజుల తరువాత అటుగా వెళ్తున్న ఒక బ్రిటిష్ నౌక వారిని కాపాడింది.

అప్పటివరకు వాళ్లు ఆ దీవిలోనే గడిపారు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కొత్త కొత్త మార్గాలు అన్వేషించారు. దీవిలో దొరికే కొబ్బరి నీళ్లు తాగి దాహం తీర్చుకున్నారు.

ఎలా తప్పిపోయారు?

తమిళనాడులోని తేంగాపట్టణం ఓడరేవు నుంచి 'క్రిషా మోల్' అనే చెక్క పడవలో మత్స్యకారులు బయలుదేరారు.

సముద్రంలోకి వెళ్లిన ఏడవ రోజు పడవ ఇంజిన్ చెడిపోయింది. దాంతో, పడవ సముద్రంలో కొట్టుకుపోవడం ప్రారంభించింది. అలా అయిదు రోజులు సాగింది. ఆ తరువాత వాళ్లకి ఒక శ్రీలంక బోటు కనిపించింది.

"శ్రీలంక బోటులో సిబ్బంది మా పడవను లాక్కుని వెళ్లారు. 8 మీటర్ల (26 అడుగుల) లోతు ఉన్న ఒక ప్రాంతంలో ఆపారు. అక్కడ మాకింకేం భయం లేదని, లంగరు దించేశాం" అని అగస్టీన్ బీబీసీతో చెప్పారు.

శ్రీలంక పడవలకు భారత జలాల్లోకి ప్రవేశించే అనుమతి లేదు. అందుకే, సహాయం కోరుతూ భారతీయ పడవలకు వైర్‌లెస్ సమాచారం పంపమని ఆ పడవ సిబ్బంది సలహా ఇచ్చారు.

మత్స్యకారులు సమాచారం పంపించారు. మూడు రోజుల తరువాత ఒక భారతీయ పడవ నుంచి స్పందన వచ్చింది.

కానీ, ఆ పడవ ఇంజిన్‌కు క్రిషా మోల్‌ను లాగే సామర్థ్యం లేదు. క్రిషా మోల్ యజమాని కూడా మత్స్యకారుల గుంపులో ఉన్నారు. క్రిషా మోల్ గేర్‌బాక్స్ తీసి భారతీయ పడవలో పెట్టి, ఒడ్డుకు చేరుకున్నాక రిపైర్ చేయించమని చెప్పారు.

భారతీయ పడవ సిబ్బంది తమ లంగరును క్రిషా మోల్‌కు ఇచ్చారు. వారికి ఆధారం దొరికేవరకు సముద్రంలో కొట్టుకుపోకుండా ఈ లంగరు కాపాడగలదని భావించారు.

లంగరు తాడు తెగిపోయింది..

డిసెంబర్ 19న అకస్మాత్తుగా గాలి ఎక్కువైంది. దాంతో, క్రిషా మోల్ లంగర్లలో ఒకదాని తాడు తెగిపోయింది. మూడు రోజుల తరువాత రెండో లంగరు తాడు కూడా తెగిపోయింది. మళ్లీ పడవ కొట్టుకుపోవడం ప్రారంభించింది.

"సముద్రం మధ్యలో చిక్కుకుపోయాం. కాపాడమని దేవుడిని ప్రార్థించడం తప్ప మరో మార్గం లేదు. పడవ ఎటు పోతోందో మాకు తెలియలేదు. ఇంటి దగ్గర భార్యా బిడ్డలు గుర్తొచ్చారు" అని అగస్టీన్ వివరించారు.

"పడవలోని నావిగేషన్ బోర్డ్ చెక్ చేశాం. 29 నాటికల్ మైళ్ల దూరంలో ఒక దీవి ఉందని జీపీఎస్ చూపించింది" అని ఎడిసన్ చెప్పారు.

ఆ దీవి బ్రిటిష్ హిందూ మహాసముద్రంలోని సాలమన్ దీవులలో ఉంది.

క్రిషా మోల్‌తో పాటు మత్స్యకారులు ఒక డింగీని తీసుకెళ్లారు. డింగీ అంటే చిన్న పడవ.

జీపీఎస్‌లో దీవి కనిపించగానే, తమతో పాటు తెచ్చుకున్న బియ్యం, ఇతర సరుకులను డింగీలో వేసి తొమ్మిదిమంది మత్స్యకారులు ఆ దీవి వైపు ప్రయాణం సాగించారని ఎడిసన్ చెప్పారు.

డింగీలో సరుకులను దీవిలో దింపి ఇద్దరు మళ్లీ వెనక్కి వచ్చారు. క్రిషా మోల్‌లో వేచి చూస్తున్న మిగతా అయిదుగురిని తీసుకెళ్లడానికి వస్తుండగా, క్రిషా మోల్ ఇంకా దూరం కొట్టుకుపోయింది.

"గంట సేపు వెతికితే క్రిషా మోల్ కనిపించింది" అని ఎడిసన్ చెప్పారు.

మొత్తం అందరూ కలిసి ఎలాగోలా ఆ దీవికి చేరుకున్నారు. అక్కడికి చేరడానికి వాళ్లకు సుమారు అయిదు గంటలు పట్టింది.

మనుషులు లేని దీవి

ఆ దీవి నిర్జనంగా ఉంది. మనుషులు లేరు. వాళ్ల దగ్గర సరకులు కొద్దిగా మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్కడి నుంచి బయటపడే మార్గం దొరికేవరకు వాళ్లు ఆ దీవిలో ఎలగోలా బతకాలి. ఇదీ అప్పుడు వాళ్ల ముందున్న సమస్య.

సరుకులు సుమారు 10 రోజులకు వస్తాయి. కానీ, తాగడానికి మంచి నీళ్లు లేవు.

సముద్రపు నీళ్లతో వంట చేసుకున్నారు. దాహం వేస్తే కొబ్బరి బోండాలు కొట్టి నీళ్లు తాగారు. వర్షం పడినప్పుడు, తమ వద్దనున్న ప్లాస్టిక్ షీట్లను నేలపై పరిచి వర్షపు నీళ్లు సేకరించారు.

"చావు మాకు ఎదురుగా ఉందనిపించింది. నిద్రపోలేదు. ఉన్నదేదో వండుకుని కొంచం కొంచం తినేవాళ్లం. మా దగ్గరున్న సరుకులు అయిపోతున్నాయి. మేం ఎక్కడున్నామో మాకు తెలీదు. అక్కడ ఎన్నాళ్లు ఉండాలో, ఎవరొచ్చి మమ్మల్ని కాపాడతారో తెలీదు" అని అగస్టీన్ చెప్పారు.

అలా అయిదు రోజులు గడిచాయి. డిసెంబర్ 27న, దూరంలో ఒక బ్రిటిష్ నౌక కనిపించింది. ఒక ఎర్రటి బట్టని చెట్టుకి కట్టి ఊపుతూ బ్రిటిష్ ఓడకి సంకేతాలు ఇచ్చారు.

"ఆ ఓడకు మేం కనిపించాలని అన్ని ప్రయత్నాలూ చేశాం. రెండు గంటల తరువాత నలుగురు సిబ్బంది మా వద్దకు వచ్చారు. ఒక బుట్ట నించా పండ్లు, మంచినీళ్లు తెచ్చారు. మేమెలా ఉన్నామో కనుక్కున్నారు" అని ఎడిసన్ చెప్పారు.

తరువాత మత్స్యకారులను డింగీలో బ్రిటిష్ ఓడ వద్దకు తీసుకెళ్లారు.

ఓడ ఎక్కాక, మత్స్యకారులు చాలారోజుల తరువాత స్నానం చేశారు. బ్రిటిష్ ఓడ సిబ్బంది మత్స్యకారుల ఆరోగ్యం పరీక్షించారు. వాళ్లకు భోజనం పెట్టి కొత్త బట్టలిచ్చారు.

తమిళనాడులోని ఒక ఓడరేవు

ఎట్టకేలకు భారత తీరానికి..

జనవరి 2న బ్రిటిష్ ఓడలోని సిబ్బంది మత్స్యకారులను త్రివేండ్రం దగ్గర విళింజం పోర్ట్‌లో భారత రక్షక దళాలకు అప్పగించింది.

వాళ్ల గుర్తింపును ధృవీకరించి, ఇతర ఫార్మాలిటీలను పూర్తి చేయడానికి ఒక రోజు పట్టింది. ఆ తరువాత వాళ్లు తమ కుటుంబాలను కలుసుకున్నారు.

"ఇంటికి వెళ్లగానే నా పిల్లలు నన్ను చుట్టేశారు. ఏమైందని అడిగారు. వాళ్లకు చెప్పడానికి నా దగ్గర మంచి కథ ఉంది. మా సాహస యాత్ర గురించి చెప్పాను. ఆ కథ ఎన్నిసార్లు చెప్పానో లెక్కలేదు. ఆ దీవిలో మేం చిక్కుకుపోయినప్పుడు, మళ్లీ ఇంటికి వస్తామని అనుకోలేదు" అన్నారు అగస్టీన్.

ఆ భయంకర అనుభవాన్ని తాను మర్చిపోలేనని, ఇకపై తీరానికి సమీపంలోనే చేపలు పట్టడానికి వెళతానని అగస్టీన్ చెప్పారు.

అయితే, ఎడిసన్ అలా అనుకోవట్లేదు.

"ఇది నా పని, ఇది నా విధి" అన్నారాయన.

ఇవి కూడా చదవండి:

English summary
They went fishing in the sea and got lost, stranded on an island.. what happened next?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X