‘సుష్మాజీ! మీ భర్తను ఫాలోకారెందుకు?’: మార్చలేమని భర్త రీట్వీట్
న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ మంత్రి ఎప్పుడు సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారనే విషయం తెలిసిందే. విదేశాల్లోని భారతీయులెవరైనా తమ సమస్యను వివరించిన క్షణాల్లోనే వారికి పరిష్కారం దిశగా చర్యలు మొదలు పెడతారు.
కాగా, పలువురు తమ సమస్యను తెలిపేందుకు సోషల్ మీడియాలో సుష్మాను సంప్రదిస్తుంటే.. మరికొంత మంది మాత్రం సరదా కోసం పలు ప్రశ్నలు వేస్తున్నారు. వారికి కూడా సుష్మా ఓపికతో సమాధానం చెబుతుండటం గమనార్హం.
తాజాగా సుష్మాస్వరాజ్‌కి అలాంటి భిన్నమైన ప్రశ్నను ట్విట్టర్ వేదికగా సంధించాడో యువకుడు. అయితే ఈ సారి మాత్రం సుష్మ కన్నా ముందు ఆ ట్వీట్‌కు ఆమె భర్త సమాధానమివ్వడం విశేషం. ఎందుకంటే అది ఆయనకు సంబంధించినదే మరి.

అసలు విషయంలోకి వెళితే.. 'సుష్మాజీ.. మీ భర్త(కౌశల్ స్వరాజ్@ ట్విట్టర్లో మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మీరు మాత్రం ఆయనను ఫాలో అవడం లేదు. ఎందుకో తెలుసుకోవచ్చా' అంటూ శిశిర్ నాయక్ అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా నుంచి ఓ ట్వీట్ చేశాడు. అయితే ఈ ట్వీట్‌కు సుష్మ భర్త కౌశల్ వెంటనే స్పందించారు. 'నేను ఆమెను 45ఏళ్లుగా ఫాలో అవుతున్నాను. ఇప్పుడేమీ మార్చలేం' అంటూ కౌశల్ చమత్కారపు రీట్వీట్ చేశారు.
Hi mam @SushmaSwaraj ji, @governorswaraj is following you on Twitter but you don't follow him, Can I ask why with all respect?
— Shishir Nayak (@TheShishirNayak) 4 September 2016
I have followed her for 45 years - Can't change things now. https://t.co/10deLIMV3b
— Governor Swaraj (@governorswaraj) 5 September 2016
గతంలోనూ సుష్మాస్వరాజ్‌కు ఇలాంటి ఓ ప్రశ్నే ఎదురైంది. ఇటీవల పార్లమెంట్‌లో భర్తతో కలిసి దిగిన ఓ ఫొటోను సుష్మ ట్వీట్ చేశారు. 'చాలా కాలం తర్వాత ఇలా కలుసుకున్నాం' అంటూ కేంద్ర మంత్రి చేసిన ఆ పోస్టు చూసి.. మీరిద్దరూ కలిసి ఉండటం లేదా అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు. అయితే తాము ఇంట్లో కలిసే ఉంటున్నామని.. పార్లమెంట్‌లో మాత్రం ఉండట్లేదని సుష్మ జవాబిచ్చారు.












Click it and Unblock the Notifications