ధైర్యం చేసి ఎవరైనా మాతోశ్రీ వైపు వస్తే పాతేస్తాం: శివసేన
ముంబై: థాకరేలకు చెందిన మాతోశ్రీ వైపు ఎవరైనా ధైర్యం చేసి వస్తే వారిని క్షమించేది లేదని, పాతిపెడ్తామని శివసేన హెచ్చరించింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేపై శివసేన అభ్యర్థి గెలిచిన నేపథ్యంలో గురువారం శివసేన పై వ్యాఖ్యలు చేసింది.
బుధవారం వెలువడిన బాంద్రా(తూర్పు) ఉప ఎన్నికల ఫలితాల్లో 63ఏళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రాణేపై శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ గెలుపొందారు. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే సొంతగడ్డపై రాణేకు ఆరు నెలల్లో ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. రాణే మూడోసారి ఎన్నికల్లో పోటీ చేసినా భారీ మెజార్టీతో ఓడిపోవడం ఖాయమని శివసేన పేర్కొంది.
‘మాతోశ్రీ(థాకరే కుటుంబం నివాసం ఉండే ప్రాంతం)కి వచ్చి ఎవరు పోటీ చేసినా క్షమించడం జరగదని, పాతిపెట్టడం జరుగుతుందని ఈ ఎన్నికల ఫలితాలు మరోసారి తేల్చాయి. ఇక చూస్తాం మమ్మల్ని ఎవరు ఓడిస్తారో' అని శివసేన తన అధికార పత్రిక ‘సామ్నా'లో పేర్కొంది.

‘ఈ స్థానం శివసేన నాయకుడు బాలా సావంత్ మరణించడంతో ఖాళీ అయింది. పోటీ పెట్టకుంటే ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగేవి. కానీ, కాంగ్రెస్ నుంచి ఒక అహంబావి తమ మీద పోటీ చేసేందుకు ముందుకొచ్చారు' అని తెలిపింది.
కాగా, ఉప ఎన్నికల్లో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ 52,711 ఓట్లు సాధించగా, రాణేకు 33,703 ఓట్లు మాత్రమే వచ్చాయి. 19,008 ఓట్ల తేడాతో ఆయన ఓటమిపాలయ్యారు. ఏఐఎంఐఎం అభ్యర్థి రెబర్ ఖాన్‌కు 15,050 ఓట్లు వచ్చాయి.
‘2014లో జరిగిన ఎన్నికల్లో రాణే 10వేల ఓట్ల తేడాతో ఓటమిపాలవగా, ఈసారి ఆ సంఖ్య రెండు రేట్లు పెరిగింది. మరోసారి ఎన్నికలకు వెళితే మూడు రేట్ల మెజార్టీతో గెలుస్తామనే నమ్మకం మాకుంది' అని శివసేన పేర్కొంది. రాణే తరపున ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్ అతనికి అవసరం లేకున్నా ప్రచారం చేశాడని, ఇప్పుడు రాణే ఓటమి విషయం అతనికి తెలిసే ఉంటుందని ఎద్దేవా చేసింది.
ఎంఐఎంకు చెందిన అభ్యర్థికి తమ నియోజకవర్గంలోని ముస్లింలు కూడా ఓటు వేయలేదని, అతని డిపాజిట్ కూడా గల్లంతయ్యిందని తెలిపింది. ఏఐఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు విష సర్పాలని, వారి విషాన్ని ఇక్కడి ముస్లింలకు ఎక్కించాలని చూస్తున్నారని మండిపడింది. అయినా వారి ప్రయత్నం బెడిసికొట్టి, వారి అభ్యర్థికి డిపాజిట్లు కూడా రాలేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications