మోడీ-కేజ్రీవాల్-రాహుల్: ముగ్గురు ఖాన్‌లు, 3 పార్టీలు
న్యూఢిల్లీ: బాలీవుడ్‌కు చెందిన ముగ్గురు హీరోలు మూడు పార్టీలను వెనుకేసుకొస్తున్నట్లుగా కనిపిస్తోంది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమీర్ ఖాన్‌లకు బాలీవుడ్‌లో ఖాన్ త్రయంగా పేరుంది. షారుక్ ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి మద్దతుదారుగా, అమీర్ ఖాన్ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మద్దతుదారుగా, సల్మాన్ ఖాన్ బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతుదారుగా కనిపిస్తున్నారు.
షారూక్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి అభిమాని. గతంలో షారూక్ తన మై హూనా చిత్రాన్ని సోనియా కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా చూపించారు. 2006లో ఓ టివి ఇంటర్వ్యూలో సోనియా పైన పొగడ్తలు కురిపించారు. సోనియా శక్తివంతమైన మహిళ అని, ఆమెను ఎవరైనా ఆరాదిస్తారని అన్నారు. 2008లో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా, షారూక్, షారూక్ సతీమణి గౌరీలతో కలిసి కోల్‌కతాలో మ్యాచ్ చూశారు.

షారూక్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని. నాటి దక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వారంతా కలిసి హాజరయ్యారు. వారంతా పక్కపక్కనే కూర్చున్నారు. గాంధీ కుటుంబం, ప్రియాంక కింగ్ ఖాన్స్(షారుక్) గ్రూప్‌కు చెందిన వారిగా భావిస్తారు.
ఇక, అమీర్ ఖాన్ ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది. అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమానికి అమీర్ మద్దతు పలికారు. పలు సందర్భాల్లో తాను ఏ పార్టీకి మద్దతివ్వనని అమీర్ చెప్పారు. అయితే, గత వారం ఓ టివి ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కేజ్రీవాల్‌కు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుత రాజకీయాలపై మనం విశ్వాసం కోల్పోయామని అయితే, హఠాత్తుగా కొత్త వేవ్ వచ్చిందని, అందులో ప్రజలు భాగస్వామ్యులు కావాలని అభిప్రాయపడ్డారు.
మరోవైపు మంగళవారం సల్మాన్ ఖాన్ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో కలిసి పతంగులు ఎగురవేశారు. మోడీపై ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. గొప్ప వ్యక్తిగా, మంచి వ్యక్తిగా సల్మాన్ మోడీని అభివర్ణించారు. గుజరాత్ అభివృద్ధికి మురిసిపోయారు. మోడీ ప్రధాని కావాలని కూడా ఆశించారు. మోడీతో కలిసి సల్మాన్ లంచ్ చేశారు. సల్మాన్ ఖాన్‌తో జరిగిన సంభాషణలపై నరేంద్ర మోడీ నాలుగు ట్వీట్లు చేశారు. రెండు ఫొటోలను షేర్ చేశారు. దాదాపు మూడు గంటల పాటు మోడీతో సల్మాన్ ఖాన్ ఉన్నారు.
ఇద్దరు కలిసి ఉత్సవంలో పాల్గొనడంతో సల్మాన్ ఖాన్.. మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని బలపరుస్తారని భావిస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు మంచి అభ్యర్థికి ఓటేయాలని సల్మాన్ ఈ సందర్భంగా అన్నారు. భారత్, ఇండియాకు మంచి వ్యక్తి ప్రధాని కావాలని, మోడీ అందుకు తగినవారన్నారు. అయితే తాను మాత్రం శాసనసభకు బాబా సిద్ధిఖికి, పార్లమెంటుకు ప్రియాదత్‌కు ఓటేస్తానని సల్మాన్ ఖాన్ చెప్పారు. వారిద్దరు కాంగ్రెసువారు కావడం విశేషం.
ట్విట్టర్లో షారూక్‌కు ఆరు లక్షల మిలియన్లకు పైగా, సల్మాన్ ఖాన్‌కు దాదాపు ఆరు లక్షల మిలియన్లు, అమీర్ ఖాన్‌కు ఐదున్నర లక్షల మిలియన్ల ఫాలోయింగ్ ఉంది. మొత్తంగా చూస్తే కండల వీరుడు సల్మన్ ఖాన్‌ను అభిమానించే వారే ఎక్కువగా ఉంటారని చెబుతుంటారు.












Click it and Unblock the Notifications