భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కు సెగ
దేశ రాజధాని వేదికగా ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభానికి ఒక్క రోజే మిగిలివుంది. శనివారం ఈ సమ్మిట్ ఆరంభం కానుంది. ఇందులో పాల్గొనడానికి బ్రిక్స్ సభ్య దేశాధినేతలు, ప్రధానమంత్రులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. చైనా, రష్యా, ఇరాన్, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, ఈజిప్ట్ అధ్యక్షులు, మలేషియా ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రౌన్ ప్రిన్స్ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. భారత్ మండప్ లో రేపు ఈ సమావేశం ప్రారంభం కానుంది.
ఇందులో పాల్గొనడానికి భారత్ కు వచ్చిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కు నిరసనల సెగ తాకింది. ఆయనకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలోని మజ్ను కా తిలా ప్రాంతంలో నివసిస్తున్న టిబెట్ శరణార్థులు పెద్ద ఎత్తున శాంతియుత నిరసన ప్రదర్శనలు చేపట్టారు. టిబెట్, ఇతర దేశాల పట్ల చైనా అనుసరిస్తూ వస్తోన్న నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్యానర్లను ప్రదర్శించారు.

ప్రత్యేకించి.. ఇటీవలి కాలంలో చైనా అమలులోకి తెచ్చిన వివాదాస్పద చట్టాలకు వ్యతిరేకంగా ఈ ప్రదర్శన సాగింది. ఈ ఏడాది జూలై 1 నుంచి అధికారికంగా అమలు చేస్తున్న నూతన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని టిబెటన్ కమ్యూనిటీ డిమాండ్ చేసింది. జాతీయ ఐక్యత పేరిట చైనా ప్రవేశపెట్టిన ఎథ్నిక్ యూనిటీ యాక్ట్.. టిబెట్ ప్రత్యేక సంస్కృతిని, అస్తిత్వాన్ని నాశనం చేసేలా ఉన్నాయని టిబెట్ కమ్యూనిటీ ప్రతినిధులు ఆరోపిస్తోన్నారు.
టిబెట్ ప్రవాస పార్లమెంట్ సభ్యుడు వాంగ్దూ దోర్జీ ఇందులో పాల్గొన్నారు. చైనా వైఖరిపై ధ్వజమెత్తారు. భారత్ కు వచ్చిన షీ జిన్‌పింగ్‌ను తాము ఎలాంటి స్వాగతం పలకట్లేదని స్పష్టం చేశారు. టిబెట్ స్వతంత్ర దేశంగా మారినప్పుడే భారత సరిహద్దులకు శాశ్వత రక్షణ, భద్రత ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ విషయంలో భారత్ కూడా తమకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు.
సెంట్రల్ టిబెటన్ అడ్మినిస్ట్రేషన్ అధినేత పెన్పా టెరింగ్ కూడా చైనా నూతన చట్టాలపై ఆందోళన వ్యక్తం చేశారు. చైనా తీసుకుంటోన్న ఈ వివాదాస్పద నిర్ణయాలు సొంత రాజ్యాంగ నిబంధనలు, చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. జాతీయ సమగ్రత పేరుతో స్థానిక సంస్కృతులు, విశిష్ట గుర్తింపును తుడిచిపెట్టడానికి చైనా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. టిబెటన్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన వివరించారు.
1950 నుంచీ టిబెట్ భూభాగంలో చైనా సాగిస్తోన్న ఆధిపత్య పోకడలను ఈ సందర్భంగా టికెటన్లు ఖండించారు. చైనా ముందు పలు డిమాండ్లను ఉంచారు. టిబెట్‌కు తక్షణమే పూర్తి స్వాతంత్ర్యం ప్రకటించాలని, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా ప్రతినిధులతో చైనా చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు చైనా జైళ్లలో బందీలుగా ఉన్న రాజకీయ ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని అన్నారు.
#WATCH | Delhi | Members of the Tibetan community at Majnu ka Tila protest against Chinese President Xi Jinping, who is visiting India for the 18th BRICS Summit pic.twitter.com/2JGcAMoDcl
— ANI (@ANI) September 11, 2026















Click it and Unblock the Notifications
