చంద్రబాబు లడ్డూ ఆరోపణల వెనుక.. !!
Tirumala Laddu row: పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం.. చిలికి చిలికి గాలీవానగా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. ఆరోపణలు- ప్రత్యారోపణలకు కారణమైంది.
కలియుగ వైకుంఠంలా అలరారుతున్న, సాక్షాత్ శ్రీమహావిష్ణువే కొలువుదీరిన తిరుమలపై, అక్కడి పవిత్రతపై, స్వామివారి లడ్డూ ప్రసాదంపై వివాదం చెలరేగడం అటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కోట్లాదిమంది హిందువులు, శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల అటు జాతీయ మీడియా సైతం దీనికి అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చింది.

తిరుమల లడ్డూ ప్రసాదాన్ని నాసిరకంగా తయారు చేస్తోన్నారని, నాణ్యత రహితమైన వస్తువులను వినియోగిస్తోన్నారంటూ చంద్రబాబు రెండు రోజుల కిందట ఆరోపించిన విషయం తెలిసిందే. నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ.. గత వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఘాటు ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు- సరికొత్త వివాదానికి తెర తీసినట్టయింది.
ఈ ఆరోపణలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిప్పికొట్టారు. చంద్రబాబు అనుసరిస్తోన్న డైవర్షన్ పాలిటిక్స్‌గా అభివర్ణించారు. సూపర్ 6 పథకాల అమలు, విజయవాడ వరదల్లో బాధితులను ఆదుకోవడంలో ఘోర వైఫల్యం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ వివాదం సృష్టించారంటూ ఎదురుదాడికి దిగారు.
ఈ పరిణామాల మధ్య తాజాగా తృణమూల్ కాంగ్రెస్ తెరమీదికి వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది.
రాజకీయ ప్రయోజాల కోసమే చంద్రబాబు.. తిరుమల లడ్డూపై ఆరోపణలు చేశారని, దీనికోసం బీజేపీ సహకారాన్ని సైతం తీసుకున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే విమర్శించారు. నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును తిరుమల లడ్డూ తయారీలో వినియోగించారంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చంద్రబాబు, ఆయన భార్య భువనేశ్వరికి సొంతంగా నెయ్యిని తయారు చేసే సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ ఉందని సాకేత్ గోఖలే ప్రత్యేకంగా ప్రస్తావించారు. తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో హెరిటేజ్ ఫుడ్స్ అనేది అత్యంత ఆసక్తికరమైన అంశమని ఆయన గుర్తు చేశారు.
మొన్నటి లోక్‌సభ ఎన్నికల సమయంలో నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఇదే హెరిటేజ్ సంస్థ షేర్లు 1,200 కోట్ల రూపాయలకు పైగా లాభాల్లోకి వెళ్లాయని సాకేత్ గోఖలే పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీ- స్టాక్ మార్కెట్‌ను మానిప్యులేట్ చేయడం వల్లే ఇది సాధ్యపడిందని చెప్పారు.
ఎవరి కుటుంబమైతే నెయ్యి- పాల ఉత్పత్తి రంగాన్ని శాసిస్తోందో.. అదే కుటుంబానికి చెందిన వ్యక్తి ఇప్పుడు తిరుమల లడ్డూల విషయంలో కూడా గుజరాత్‌కు చెందిన ఓ ప్రైవేట్ ల్యాబొరేటరీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని ఆరోపణలు చేశారని సాకేత్ గోఖలే పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications