వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుమల: టీటీడీ ప్రత్యేక దర్శనం టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్‌కి ప్రయత్నిస్తే జియో‌మార్ట్ ఎందుకు ఓపెన్ అవుతోంది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

తిరుమల వెంకన్న దర్శనం కోసం ముందుగా టికెట్లు రిజర్వ్ చేసుకునే భక్తులనే కొండపైకి అనుమతిస్తున్నారు. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో గత ఏడాది జూన్ నుంచి దీనిని అమలు చేస్తున్నారు.

అలిపిరి వద్ద టికెట్లను చూపించిన వారికి మాత్రమే ముందుకెళ్లే అవకాశం వస్తోంది. సర్వదర్శనం కూడా పూర్తిగా ప్రారంభించకపోవడంతో నేటికీ ఎక్కువ మంది రూ. 300 దర్శనం టికెట్ల తీసుకుని దర్శనాలకు వస్తున్నారు.

ఈ టికెట్లను ఆన్‌లైన్‌లోనే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది.

శుక్ర, శనివారాల్లో ఆన్ లైన్ టికెట్ల బుకింగ్ ఉంటుందని టీటీడీ ప్రకటన చేసింది. దానికి తగ్గట్టుగా రాష్ట్రం నుంచే కాకుండా వివిధ రాష్ట్రాలకు చెందిన వారు కూడా దర్శనం టికెట్ల కోసం ఆన్ లైన్‌లో ప్రయత్నాలు చేశారు.

కానీ శుక్రవారం టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్ బుకింగ్‌కు ప్రయత్నించిన చాలామందికి నిరాశే ఎదురైంది. టీటీడీ ఆన్‌లైన్ టికెట్ల వెబ్‌సైట్ జియోమార్ట్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవుతోందని పలువురు భక్తులు చెప్పారు.

జియోమార్ట్ ఎందుకొచ్చింది..

టీటీడీ అధికారిక వెబ్ సైట్ క్లిక్ చేసి టికెట్ బుకింగ్ కోసం ప్రయత్నం చేయగానే స్పెషల్ ఎంట్రీ దర్శన్ కోసం ఇక్కడ క్లిక్ చేయమంటూ ఒక సూచిక వస్తోంది.

దాని కిందనే కోవిడ్ కి సంబంధించిన పలు జాగ్రత్తలు కనిపించాయి. ముఖ్యంగా దర్శనం కోసం వచ్చే భక్తులు కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నట్టు సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ వ్యాక్సినేషన్ జరగపోతే 72 గం.ల ముందు కోవిడ్ టెస్టులు చేయించుకుని నెగిటివ్ వచ్చిందనే సర్టిఫికెట్ దర్శనానికి వచ్చే సమయంలో చూపించాల్సి ఉంటుందని తెలియజేశారు. ఈ రెండు నిబంధనలు పాటించిన తర్వాత టికెట్ బుకింగ్ చేయాలని సూచించారు.

దానికి అనుగుణంగా టికెట్ బుక్ చేసుకునేందుకు ముందుకు వెళితే https://tirupatibalaji.jiomart.com/ అంటూ మరో సైట్‌కు అది దారితీస్తోంది.

అక్కడ టికెట్ బుక్ చేయాలనుకునే వారి మొబైల్ నెంబర్ సమర్పిస్తే ఆ తర్వాత ఇతర వివరాలు ఇవ్వాల్సి వస్తోంది.

అయితే టీటీడీ కి చెందిన ప్రభుత్వ వెబ్ సైట్ ఉండగా జియో మార్ట్ అంటూ దర్శనం కోసం వచ్చే వారి వివరాలు సేకరించే ప్రయత్నం జరగడం పలు సందేహాలకు తావిస్తోంది.

'ఎంత ప్రయత్నించినా జియోమార్టే ఓపెన్ అవుతోంది’

ఉదయం 9గం. ల నుంచి టికెట్లు బుక్ చేద్దామని ఆన్ లైన్లో చాలా ప్రయత్నం చేశాను. కానీ సైట్ ఓపెన్ కాలేదు. క్లిక్ హియర్ అనే దగ్గర నొక్కగానే జియోమార్ట్ సైట్ చూపించింది. అక్కడ కూడా బుకింగ్ అవ్వలేదు.

టెక్నికల్ రీజన్స్ తో సైట్ డౌన్ అయిపోయింది. గంట పాటు ప్రయత్నం చేసినా ఫలితం రాలేదు.

ప్రతీసారి జియో మార్ట్ అని సైట్ రావడం, అక్కడే ఆగిపోవడం జరిగింది. చివరకు నెట్ సెంటర్ కి వెళ్లాను. అక్కడ కూడా అదే పరిస్థితి. మా బాబుకి పుట్టి వెంట్రుకలు తీయించాల్సి ఉంది. దాంతో దర్శనానికి వెళ్లాలనుకున్నాం. తీరా చూస్తే దర్శనం టికెట్లు దొరికేలా కనిపించడం లేదు అంటూ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటకు చెందిన వి.లలితేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.

tirumala

సర్వదర్శనం టోకెన్ల సంగతేంటి

రూ. 300 దర్శనం టికెట్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే ఇక శనివారం ఉదయం సర్వదర్శనం టోకెన్లు కూడా ఆన్ లైన్‌లోనే విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. సెప్టెంబర్ 25 ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో సర్వ దర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 31 వరకు రోజుకు 8,000 మందికి అవకాశం కల్పిస్తూ సర్వ దర్శనం టోకెన్లు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.

సర్వదర్శనం టోకెన్లు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చిన తర్వాత, సెప్టెంబరు 26 నుంచి తిరుపతి లో ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తామని కూడా తెలిపారు.

తిరుపతితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం గుమికూడుతుండటం వల్ల కరోనా సంక్రమించే ప్రమాదం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విషయంలోనే భక్తులకు ఇలాంటి సమస్యలు ఎదురవుతుంటే ఇక సర్వదర్శనం కోసం మరింత మంది పోటీ పడే అవకాశం ఉంటుంది. అప్పుడు టీటీడీ ఆన్ లైన్ సైట్లు ఏమేరకు ఉపయోగపడతాయన్నది చాలామందిని వేధిస్తున్న ప్రశ్న.

శ్రీనివాసం వద్ద ఆందోళన చేస్తున్న భక్తులు

శ్రీనివాసం వద్ద భక్తుల ఆందోళన

సర్వదర్శనం టికెట్లు ఆన్ లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంచాలని టీటీడీ తీసుకున్న నిర్ణయం యాత్రికులకు అసౌకర్యంగా మారింది.

దూర ప్రాంతాల నుంచి వచ్చి తిరుపతిలో దర్శనం టికెట్ల కోసం వేచి చూస్తున్న వారికి నిరాశ ఎదురైంది. రేపటి నుంచి కేవలం ఆన్ లైన్లో మాత్రమే దర్శనం టికెట్లు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తుండగా తమ పరిస్థితి ఏమిటంటూ వారంతా ఆందోళనకు దిగారు.

శ్రీనివాసం సర్వదర్శనం టికెట్లు పంపిణీ చేసే కౌంటర్ల ముందు భైఠాయించారు.

శ్రీనివాసం వద్ద ఆందోళన చేస్తున్న భక్తులు

'సామాన్యులకు ఆన్ లైన్‌లో టికెట్లు తీసుకోవడం ఎలా సాధ్యం?’

''రైల్వే టికెట్‌లు ఆఫ్ లైన్లో కూడా ఇస్తున్నారు. కానీ టీటీడీ మాత్రం కేవలం ఆన్ లైన్ మాత్రమే అనడం సరికాదు. దానివల్ల అవగాహన లేని వారికి ఇబ్బందులు వస్తున్నాయి.

తిరుపతిలో టికెట్ దొరుకుతుంది కదా అని వచ్చేస్తే ఇక్కడ అందుకు భిన్నంగా అధికారులున్నారు. దానివల్ల సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ పునరాలోచన చేయాలి.

ఆన్ లైన్ టికెట్లతో పాటుగా ఆఫ్ లైన్లో కూడా టికెట్లు ఇచ్చేందుకు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించాలి. దానికి తగ్గ ఏర్పాట్లు చేయాల’’ని తిరుపతికి చెందిన ధర్మపరిషత్ సభ్యుడు ఎం.శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు.

టీటీడీ కేవలం రూ 300 ప్రత్యేక దర్శనం టోకెన్లకు ప్రాధాన్యమివ్వడం సామాన్యులను ఆలయానికి దూరం చేస్తుందని ఆయన బీబీసీతో అన్నారు.

tirumala

మూడు నెలలుగా ప్రయత్నిస్తున్నాం

''మూడు నెలల పాటు ప్రయత్నించాం. మేం మా మిత్రులు కలిసి తిరుమల వెళ్లాలని చాలాకాలంగా అనుకుంటున్నాం. నలుగురు వ్యక్తులం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రయత్నిస్తే చివరకు ఒక్కరికి ఈ రోజు కుదిరింది. తీరా సైట్లోకి వెళ్లి టికెట్ బుక్ చేద్దామనుకునే లోగా అది డౌన్ అయిపోయింది. దాంతో ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఆఫ్ లైన్ టికెట్లన్నీ నిలిపివేసిన తర్వాత ఆన్ లైన్ సామర్థ్యం పెంచాల్సి ఉంది.

కానీ ప్రస్తుతం దానికి భిన్నంగా ఉంది. దానివల్ల అనేక మంది సతమతమవుతున్నారు. టీటీడీ తగిన మార్పులు చేయాలి. మధ్యలో జియో మార్ట్ అంటూ సైట్ ఓపెన్ కావడం అనుమానంగా ఉంది. టీటీడీ టికెట్లను జియో వాళ్లు విక్రయిస్తున్నారా అనే అనుమానం వస్తోంది. స్పష్టతనిస్తే మంచిది’’ అని గుంటూరుకి చెందిన మోదుగుల రవీంద్ర రెడ్డి అభిప్రాయపడ్డారు.

దర్శనం టికెట్ల విషయమై ఏర్పడిన గందరగోళం, ఆన్ లైన్ లో సమస్యలు , జియో మార్ట్ సైట్ విషయమై టీటీడీ నుంచి అధికారిక వివరాల కోసం బీబీసీ ప్రయత్నించింది. అయితే స్పందించేందుకు చైర్మన్ సహా ఎవరూ అందుబాటులోకి రాలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Tirumala: Why is JioMart opening if you try to book TTD special darshan tickets online
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X