సీఈసీకి మమతా బెనర్జీ షాకిస్తారా ? కీలక నిర్ణయం దిశగా..!
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే పశ్చిమ బెంగాల్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (SIR) కలకలం రేపుతోంది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఏకంగా 58 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించడంపై అక్కడి మమతా బెనర్జీ ప్రభుత్వం మండిపడుతోంది. దీనిపై ఈసీతో అమీతుమీ తేల్చుకునేందుకు నిన్న ఢిల్లీ వెళ్లిన ఆమెకు అక్కడా ఊరట దక్కలేదు. దీంతో సీఈసీ జ్ఞానేష్ కుమార్ తీరుపై మమత తీవ్రంగా మండిపడ్డారు. కోల్ కతా రాగానే దీనిపై చర్చించారు.
పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ పేరుతో 58 లక్షల ఓట్లు తొలగించడం, వాటిని పునఃపరిశీలించాలనే విజ్ఞప్తులు కూడా స్వీకరించకపోవడంపై మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ నేతలతో మమత కీలక భేటీ నిర్వహించారు. ఇందులో సీఈసీ జ్ఢానేష్ కుమార్ పై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వెల్లడించారు.

పశ్చిమ బెంగాల్ తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితా సవరణ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనిపై ఇతర పార్టీలతో చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బెంగాల్ పై ఈసీ వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. బెంగాల్లో ఎవరికీ ఓటు హక్కు లేకుండా ఈసీ చూస్తున్నట్లు ఉందని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. దీనికి నిరసనగానే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు.












Click it and Unblock the Notifications