జగన్, జయ: ఎపి, తమిళనాడు కాంగ్రెస్‌ను ముంచేనా?
న్యూఢిల్లీ: ఓ వైపు ఉత్తర భారత దేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ హవా కొనసాగుతుండగా... కాంగ్రెసు పార్టీకి దక్షిణ భారత దేశంలోను చుక్కెదరవుతోంది. మొదటి నుండి ఉత్తర భారతంలో బిజెపి హవా కాంగ్రెసుకు ధీటుగా కొనసాగుతోంది. ఇప్పుడు అక్కడ మోడీ ప్రభావంతో కాంగ్రెసు పార్టీ తుడిచి పెట్టుకు పోయే అవకాశాలు కనిపిస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి.
దక్షిణాది పైన కూడా కాంగ్రెసు పెద్దగా ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని సర్వేలు చెబుతున్నాయి. దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్, తమిళనాడులు పెద్ద రాష్ట్రాలు. ఎపిలో 42, తమిళనాడులో 40 లోకసభ స్థానాలు ఉన్నాయి. 2004లో, 2009లలో దక్షిణాది నుండి వచ్చిన మద్దతు, ఆంధ్రప్రదేశ్ నుండి ఎన్నికైన అత్యధిక ఎంపీ స్థానాల వల్లనే కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈసారి ఆ అవకాశం లేకుండా పోతోందట.

ఎపిలో జగన్, కెసిఆర్
ఎపిలో కాంగ్రెసు పార్టీ వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలతో పాటు రెండు ప్రాంతాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని ఢీకొట్టే పరిస్థితి కనిపించడం లేదట. విభజనతో సీమాంధ్రలో జగన్, తెలంగాణలో కెసిఆర్ కలిసి వస్తారనుకుంటే కాంగ్రెసు పార్టీకి వారిద్దరు షాకిచ్చారు. దీంతో ఇరు ప్రాంతాల్లో ఆ పార్టీకి నష్టమే అంటున్నారు. మరోవైపు తమిళనాడులో కరుణానిధి... మోడీపై పొగడ్తలు కురిపించడం చర్చనీయాంశమైంది. జయలలిత థర్డ్ ఫ్రంట్ వైపు వెళ్లారు. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీకి దక్షిణాదిన దాదాపు ఒంటరి అయిందంటున్నారు.
సిఎన్ఎన్-ఐబిఎన్ సర్వే ప్రకారం.. తమిళనాడులో ఏఐఏడిఎంకె-లెఫ్ట్ అలయన్స్ 14-20 సీట్ల వరకు, డిఎంకె 10-14 సీట్ల వరకు గెలిచే అవకాశాలున్నాయి. కాంగ్రెసు మాత్రం 0 - 4 సీట్ల వరకు మాత్రమే గెలిచే అవకాశాలున్నాయట. 2009లో కాంగ్రెసు పార్టీకి తమిళ పార్టీ డిఎంకె మద్దతు పలికింది. ఇప్పుడు ఆ అవకాశం కనిపించడం లేదు.
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే... 2009లో కాంగ్రెసు 33 స్థానాలలో విజయం సాధించింది. ఈసారి ఆ సంఖ్య 6-12కు దిగజారనుందట. తెలంగాణలో తెరాస 12 స్థానాల వరకు, సీమాంధ్రలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 11 నుండి 17 స్థానాల వరకు, టిడిపి 10 నుండి 16 స్థానాల వరకు గెలిచే అవకాశాలున్నాయట.












Click it and Unblock the Notifications