Today in Parliament: హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిల వేతనాలు, సర్వీస్ కండిషన్లపై కీలక బిల్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు తొలి రోజు రసాభాసగా ముగిశాయి. ఎలాంటి చర్చలు లేకుండానే లోక్‌సభ, రాజ్యసభ ఇవ్వాళ్టికి వాయిదా పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన, అదే స్థాయిలో వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ఉద్దేశించిన బిల్లు ఉభయ సభల ఆమోదం పొందింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్.. ఈ రెండు సభల్లో బిల్లును ప్రవేశపెట్టారు. ఎలాంటి చర్చ లేకుండానే దీన్ని ఆమోదించారు.
ఇది సరికొత్త వివాదాన్ని సృష్టించినట్టయింది. చర్చలు జరపకుండా బిల్లులను ఆమోదించడం పట్ల కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ భాగస్వామ్య పక్షాలు మండిపడుతున్నాయి. రెండో రోజు సభను అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పక్ష నేతలు అధిర్ రంజన్ చౌదరి, మల్లికార్జున ఖర్గె ఇవ్వాళ ఉభయ సభలను స్తంభింపజేయాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇస్తే గానీ సభా కార్యకలాపాలను సాగనివ్వబోమని హెచ్చరించారు.
కాగా- రెండో రోజు కూడా కొన్ని కీలకమైన బిల్లులు ఉభయ సభల సమక్షానికి రానున్నాయి. తొలుత- దాద్రా నగర్ హవేలీ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నికలో గెలుపొందిన దేల్కర్ కళాబెన్ మోహన్ భాయ్ ఇవ్వాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. కేంద్రం హోం శాఖ సహాయ మంత్రులు నిత్యానంద రాయ్, అజయ్ కుమార్, వ్యవసాయ శాఖ సహాయ మంత్రులు శోభా కరంద్లాజె, కైలాష్ చౌదరి, సామాజిక న్యాయ శాఖ సహాయమంత్రి ప్రతిమా భౌమిక్, యువజన సర్వీసుల శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రామాణిక్.. తమ డాక్యుమెంట్లను సమర్పిస్తారు.

అనంతరం- హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వేతనాలు, సర్వీసు కండీషన్లకు సంబంధించిన బిల్లును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లోక్‌సభలో ప్రవేశపెడతారు. 1958లో అమల్లోకి వచ్చిన బిల్లు ఇది. ఇందులో కొన్ని సవరణలను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. సవరణలతో కూడిన కొత్త బిల్లును ఆయన సభ సమక్షానికి తీసుకొస్తారు. దీన్ని ఆమోదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బిల్లు కూడా ఎలాంటి చర్చ లేకుండానే సభ ఆమోదం పొందవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.
Recommended Video
ది అసిస్టెడ్ రీప్రొడక్టివిటీ టెక్నాలజీ (రెగ్యులేషన్ బిల్లు)-2020ను డాక్టర్ మన్‌సుఖ్ భాయ్ మాండవీయ సభ ముందుకు తీసుకొస్తారు. దీనిపై చర్చ కొనసాగుతుంది. దీనితోపాటు- క్రిప్టోకరెన్సీ వ్యవహారాలను నిషేధిస్తూ రూపొందించిన బిల్లు టేబుల్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ కార్యకలాపాలను నిషేధించడం, దాని స్థానంలో డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీన్ని రూపొందించింది. దీనిపై సమగ్రమైన చర్చ సాగాలని ప్రభుత్వం కోరుకుంటోంది.












Click it and Unblock the Notifications