లారీ ఆపాడని.. ట్రాఫిక్ పోలీస్ కిడ్నాప్: ఛేజ్ చేసి పట్టుకున్నారు
న్యూఢిల్లీ: లారీని ఆపినందుకు ఓ దుండగుడు ఏకంగా ట్రాఫిక్ పోలీసునే కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో శంకర్ రోడ్డు సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఇసుక మాఫియాకు చెందిన ఓ డంపర్ వెళ్తుండగా ఆపాడు ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్.
అనంతరం వాహనానికి సంబంధించిన కాగితాలు చూపించమని అడిగాడు. దీంతో డంపర్ డ్రైవర్ సదరు కానిస్టేబుల్‌ను బలవంతంగా డంపర్ ఎక్కించుకుని తీసుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అర డజనుకు పైగా వాహనాల్లో డంపర్‌ను వెంటాడి పట్టుకున్నారు.

సినిమా తరహాలో ఛేజ్ చేస్తూ డంపర్ టైర్లపై కాల్పులు కూడా జరిపారు. సుమారు 10 కిలోమీటర్లు ఛేజ్ చేసిన అనంతరం జంధేవ్‌లాన్ సమీపంలో డంపర్‌ను పట్టుకున్నారు. డంపర్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు, ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను విడిపించారు.
డంపర్‌ను సీజ్ చేశారు. డంపర్ డ్రైవర్ ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications