కోజికోడ్‌లో మోడీ ఉద్వేగం: అష్ట సూత్రాలివే
తిరువనంతపురం: రాజకీయ నేతల జీవితాల్లో విలువలు పడిపోయానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశంలో చివరి రోజున ప్రధాని మోడీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'కాలికట్.. కోజికోడ్ అయింది. భారతీయ జన సంఘ్ నుంచి మేము భారతీయ జనతా పార్టీగా మారాం. అధికారం కోసమే ప్రయత్నం చేసి ఉంటే.. రాజకీయ యాత్రలో మేమూ రాజీ పడేవాళ్లం. ఏళ్ల తరబడి విపక్షంలో ఉండాల్సిన అవసరం ఉండేది కాదు' అని అన్నారు.
'స్వాతంత్ర్య పోరాట సమయంలో నేతల జీవితాలు ఆదర్శంగా ఉండేవి. అయితే, స్వాతంత్ర్యం తర్వాత రాజకీయ నేతల జీవితాల్లో మార్పు వచ్చింది. రాజకీయ నేతల జీవితాల్లో విలువలు పడిపోయాయి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి వేడుకలు జరుపుకుంటున్న సమయంలో రాజకీయ నేతల పట్ల ప్రజలు చూస్తున్న వైఖరిలో మార్పు తీసుకురాలేమా? రాజకీయ నాయకుల్లో ఇప్పటికీ మంచివారు ఉన్నారు. ముస్లింలను ఓటు బ్యాంకుగా చూడొద్దని 50 ఏళ్ల క్రితమే పండిట్ దీన్ దయాళ్ చెప్పారు' అని అన్నారు.

వారి స్ఫూర్తితోనే పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నా
భారతదేశాన్ని 21వ శతాబ్దంలో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయిలో నిలిపేందుకు తమ ప్రభుత్వం 8 సూత్రాలను నిర్దేశించుకొందని మోడీ పేర్కొన్నారు. అభివృద్ధి భారతావనిని ఆవిష్కరించేందుకు అవే మార్గదర్శకాలన్నారు. 20వ శతాబ్దంలో ముగ్గురు దార్శనికులు.. మహాత్మా గాంధీ, దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, రామ్ మనోహర్ లోహియా భారత రాజకీయాలపై తమదైన ముద్ర వేశారని ఆయన కొనియాడారు. తాను ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారి స్ఫూర్తితోనే పేదల సంక్షేమానికి కృషిచేస్తున్నానన్నారు. తాను నిర్దేశించుకొన్న 8 విజన్‌లను ఆయన వివరించారు.

ఈ ఏడాదిని ‘పేదల సంక్షేమ వత్సరం'గా జరుపుకోవాలి
ఈ ఎనిమిది విజన్‌లతో 21వ శతాబ్దంలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని మోడీ పునరుద్ఘాటించారు. దీన్‌దయాళ్ శత జయంతి సందర్భంగా ఆదివారం ఆయనకు మోడీ ఘన నివాళి అర్పించారు. ఈ ఏడాదిని ‘పేదల సంక్షేమ వత్సరం'గా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమమే బీజేపీ నినాదమని, ఆ విషయంలో రాజీ పడబోమని చెప్పారు. సమకాలీన రాజకీయాలపై రాజకీయ పార్టీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్న ప్రధాని, ప్రస్తుతం దేశభక్తిని కూడా విమర్శించే పరిస్థితులను మన దేశంలో సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు.

' తమ ప్రభుత్వ నినాదం కేవలం రాజకీయ నినాదం కాదు
తాను అధికారం చేపట్టిన వెంటనే దేశంలోని పేదలకు సేవ చేయాలని సంకల్పించామని, అన్ని విధానాలు, అన్ని పథకాలు దానిని దృష్టిలో ఉంచుకునే తీసుకున్నామని, దేశంలోని చివరి వ్యక్తిని కూడా సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకు రావడానికి కట్టుబడి ఉన్నామని మోడీ చెప్పారు. ‘సబ్‌కా సాత.. సబ్‌కా వికాస్' అన్న తమ ప్రభుత్వ నినాదం కేవలం రాజకీయ నినాదం కాదని, సమాజంలో అట్టడుగునున్న వ్యక్తికీ సంక్షేమ ఫలాలు అందించాలన్నదే దాని లక్ష్యమన్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు రెండో తేదీన పర్యావరణ సంరక్షణకు ఉద్దేశించిన పారిస్(కాప్-21) ఒప్పందంపై భారత సంతకం చేస్తుందని చెప్పారు. భూతాపం గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నామని, కానీ, మన వనరులను మనం కాపాడుకోవాలని దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఎప్పుడో చెప్పారన్నారు. జాతికి ‘సర్వజన హితాయ, సర్వజన సుఖాయ' అనే నినాదం ఆయనే ఇచ్చారని మోడీ కొనియాడారు.

ఫొటోలు, వీడియోలను మోడీ యాప్‌కు పంపించండి
‘‘గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేదీన స్వచ్ఛ భారత ప్రారంభించాం. రెండేళ్లు పూర్తయ్యాయి. ఈసారి అక్టోబరు రెండో తేదీన పరిశుభ్రత కార్యక్రమం ఉంటుంది. అందులో మీరంతా పాల్గొనాలి. 2 నుంచి 4 గంటలు కేటాయించాలి'' అని దేశ ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నరేంద్ర మోడీ యాప్‌కు పంపించాలని సూచించారు. గత రెండేళ్లలో స్వచ్ఛ భారత అద్భుత విజయం సాధించిందన్నారు.

భారతను బహిరంగ మల విసర్జన దేశం గా తీర్చిదిద్దాం
భారతను బహిరంగ మల విసర్జన దేశం గా తీర్చిదిద్దడంలో భాగంగా ఇప్పటి వరకూ 2.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని, ఈ ఏడాదిలో మరో 1.5 కోట్ల మరుగుదొడ్లను నిర్మించనున్నామని తెలిపారు. ‘స్వచ్ఛ భారత' కోసం ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను ప్రధాని ప్రారంభించారు. ‘1969' నెంబరుకు డయల్ చేసి ఈ కార్యక్రమ పురోగతిని తెలుసుకోవచ్చన్నారు. ‘స్వచ్ఛ గంగ' సందేశాన్ని ప్రచారం చేయడానికి వింగ్ కమాండర్ పరమ్‌వీర్‌సింగ్ దేవ్ ప్రయాగ నుంచి గంగా సాగర్ వరకూ 2800 కిలోమీటర్లు ఈత కొట్టారని వివరించారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఖాదీ వస్త్రాలను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ప్రధాని మోడీ అష్ట సూత్రాలివే
* గరీబీసే ముక్త్.. సమృద్ధిసే యుక్త్ (పేదరికం నుంచి సంపద )
* భేదభావ్‌సే ముక్త్.. సమానతాసే యుక్త్ (అసమానతల నుంచి సమానత్వం )
* అన్యాయ్‌సే ముక్త్.. న్యాయ్‌సే యుక్త్ (అన్యాయం నుంచి న్యాయం)
* భ్రష్టాచార్‌సే ముక్త్.. పారదర్శితాసే యుక్త్ (అవినీతి నుంచి పారదర్శకత )
* గంధగీసే ముక్త్.. స్వచ్ఛతాసే యుక్త్ (అపరిశుభ్రత నుంచి పరిశుభ్రత)
* బే రోజ్‌గారీసే ముక్త్.. రోజ్‌గారీసే యుక్త్ (నిరుద్యోగం నుంచి ఉపాధి)
* మహిళా ఉత్పీడన్‌సే ముక్త్.. సమ్మాన్‌సే యుక్త్ (మహిళలపై హింస నుంచి గౌరవం.)
* నిరాశాసే ముక్త్.. ఆశాసే యుక్త్ (నిరాశ, నిస్పృహల నుంచి ఆశ)

యూరీ సెక్టార్ ఉగ్రదాడిపై అమిత్ షా
భారత్‌ను బలవంతంగా దీర్ఘకాలిక యుద్ధంలోకి దింపింది
పాకిస్తాన్.. భారత్‌ను బలవంతంగా దీర్ఘకాలిక యుద్ధంలోకి దింపిందని, ఈ యుద్ధంలో ఇటీవల యూరీ సెక్టార్‌లో మన సైనిక స్థావరంపై జరిగిన ఉగ్రవాద దాడి ఒక భాగం మాత్రమేనని, అదే చివరి అంకం కాదని, ఈ యుద్ధంలో అంతిమ విజయం మనదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. పాకిస్తాన్ వైపునుంచి భారత భూభాగంలోకి చొరబడటానికి గత ఎనిమిది నెలల కాలంలో ఉగ్రవాదులు 17సార్లు చేసిన ప్రయత్నాలను భారత భద్రతా బలగాలు భగ్నం చేశాయని ఆయన పేర్కొన్నారు. దీంతో వారు నిరాశా నిస్పృహలకు గురయి ఉరీ సెక్టార్‌లో దొంగచాటుగా దాడికి దిగారని విమర్శించారు. అయితే ఈ దాడే చివరిది కాదని, అంతిమ విజయం భారత్‌దేనని అన్నారు.

బీజేపీ జాతీయ మండలి సమావేశంలో అమిత్ షా
కోజికోడ్‌లో జరిగిన బీజేపీ జాతీయ మండలి సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన అమిత్ షా ఉగ్రవాద దాడికి బాధ్యులయిన వారిని శిక్షించి తీరుతామని చెప్పారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గట్టిబుద్ధి చెప్పడానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ‘యూరీ సెక్టార్‌లో దాడి వెనుక ఉన్న సూత్రధారులపై దేశ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నట్టు బిజెపి భావిస్తున్నది. ఉగ్రవాదం విషయంలో ఏమాత్రం ఉపేక్ష వహించరాదనే వైఖరిని బిజెపి, కేంద్ర ప్రభుత్వం మొదటినుంచీ అనుసరిస్తున్నాయి. ఉగ్రవాదులను ఓడించడానికి గట్టిగా సమాధానం ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక, పటిష్ఠమైన పోరాటాన్ని ప్రారంభించడంతో ఇటీవలి కాలంలో అత్యధికంగా గత 8 నెలల కాలంలో 117 మంది ఉగ్రవాదులను హతం చేయడం జరిగింది' అని అమిత్ షా అన్నారు.












Click it and Unblock the Notifications