Tripura Elections : ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే బీజేపీ గెలిచినట్లే-సీఎం మాణిక్ సాహా..
ఈశాన్యభారత రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఉదయం పోలింగ్ ప్రారంభం కాగానే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు బారులు తీరారు. రాజధాని అగర్తలలో సీఎం మాణిక్ సాహా ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీజేపీ, లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి, తిప్రా మోథా కూటమి మధ్య త్రిముఖ పోరు సాగుతున్న ఈ ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని సీఎం మానిక్ సాహా చెప్తున్నారు.
రాజధాని అగర్తలకు పొరుగున ఉన్న టౌన్ బర్దోవాలి స్దానం నుంచి పోటీ చేస్తున్న సీఎం మానిక్ సాహా.. ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉదయం దేవుడిని దర్శించుకున్నానని, ఎన్నికలు ప్రశాంతంగా సాగాలని, ఓటర్లు శాంతియుతంగా ఓటేయాలని తాను కోరుకున్నట్లు త్రిపుర సీఎం మానిక్ సాహా తెలిపారు. లెఫ్ట్-కాంగ్రెస్ కూటమి హింసకు పాల్పడవచ్చనే సంకేతాలు ఉన్నాయని, అయితే ఇప్పటివరకూ పోలింగ్ ప్రశాంతంగానే సాగుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.

అగర్తలాలో ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం మాణిక్ సాహా.. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా చూడడం అధికారులు, ఎన్నికల కమిషన్‌కు సవాలుగా మారిందన్నారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగితే చాలు బీజేపీ గెలిచినట్లేనన్న అభిప్రాయం ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు త్రిపుర వ్యాప్తంగా పోలింగ్ సజావుగా సాగుతోందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటర్లలో ఉత్సాహానికి ఇది నిదర్శమని ట్వీట్ చేసింది. ఓటర్లలో విశ్వాసాన్ని నింపేందుకు తగిన భద్రతా బలగాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది.













Click it and Unblock the Notifications