నా సత్తా ఏంటో చూపిస్తా, సీఎంకు చాలెంజ్, మన్నార్ గుడి మాఫియా కథ తేలిపోతుంది !
మదురై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి తన సత్తా ఏంటో చూపిస్తానని శశికళ సోదరి వనితామణి కుమారుడు టీటీవీ దినకరన్ అన్నారు. సోమవారం ఆయన మదురైలో మీడియాతో మాట్లాడుతూ శశికళ ఎంతో నమ్మకంతో పళనిసామిని సీఎం చేస్తే ఇప్పుడు ఆయన ఎదురుతిరుగుతున్నారని ఆరోపించారు.
అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) ఉప ప్రధాన కార్యదర్శి పదవిని నుంచి తప్పించాలని సీఎం పళనిసామి కుట్రలు పన్నారని, శశికళ తప్పా తనను ఎవ్వరూ పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం లేదని టీటీవీ దినకరన్ అన్నారు. తన సత్తా ఏంటో సోమవారం రాత్రి లోపు చూపిస్తానని సీఎంకు దినకరన్ సవాలు చేశారు.

మదురై జిల్లాలోని మేలూరులో సోమవారం రాత్రి దినకరన్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఈ బహిరంగ సభకు హాజరౌతున్నారు. ఇదే సందర్బంలో ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాలను దినకరన్ వర్గం నిర్వహిస్తోంది.
తనకు ఎమ్మెల్యేలు, కార్యకర్తల అండ ఉందని నిరూపించుకోవడానికి టీటీవీ దినకరన్ పలు ప్రయత్నాలు చేస్తున్నారు. జయలలిత, ఎంజీఆర్, శశికళ, టీటీవీ దినకరన్ ఫోటోలతో భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తారా ? రారా ? అనే విషయం కొన్ని గంటల్లో తేలిపోతుంది.












Click it and Unblock the Notifications