సెబీ కొత్త ఛైర్మన్‌గా తుహిన్ కాంత పాండే.. ఈయన ఎవరంటే?
న్యూఢిల్లీ: కేపిటల్ మార్కెటింగ్ రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEB) నూతన అధిపతిగా తుహిన్ కాంత పాండే (Tuhin Kanta Pandey)నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు సెబీ బాధ్యతలు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రానున్న మూడేళ్లపాటు పాండే ఆ పదవిలో కొనసాగనున్నారు.
ప్రస్తుతం సెబీ ఛైర్ పర్సన్‌గా మాధబి పురి బుచ్ ఉన్నారు. ఆమె స్థానంలోనే తుహిన్ కాంత పాండే సెబీ బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా, సెబీ చైర్‌పర్సన్ మాధబి పూరి బుచ్ పదవీకాలం మార్చి 1న ముగుస్తుంది. రెగ్యులేటర్‌కు నాయకత్వం వహించిన మొదటి మహిళగా ఆమె మార్చి 2, 2022న పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు ముందు, అజయ్ త్యాగి మార్చి 2017 నుంచి ఫిబ్రవరి 2022 వరకు పనిచేశారు.

గతంలో పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం (DPE), సిబ్బంది, శిక్షణ విభాగం, పెట్టుబడి, ప్రజా ఆస్తి నిర్వహణ విభాగం (DIPAM)లలో కార్యదర్శిగా పనిచేశారు తుహిన్ పాంే. DIPAM, DPE రెండూ కూడా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నాయి.
సెప్టెంబర్ 2024లో భారత ఆర్థిక కార్యదర్శి కావడానికి ముందు, తుహిన్ పాండే బహుళ విభాగాలలో కీలక పాత్రలు నిర్వహించారు. జనవరి 2025లో ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
తుహిన్ కాంత పాండే ఆర్థిక కార్యదర్శిగా ఉన్న కాలంలో భారతదేశ ఆర్థిక, ఆర్థిక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కీలకమైన విధాన విషయాలపై ఆర్థిక మంత్రికి సలహాదారుగా.. మంత్రిత్వ శాఖ కార్యకలాపాలను నిర్వహించారు. పార్లమెంటు పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి ప్రాతినిధ్యం వహించారు.
పాండే చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ, యుకె నుంచి ఎంబీఏ పట్టా పొందారు. ఆయన ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన పరిపాలనా పాత్రలను పోషించారు. తాజాగా, మరో కీలక బాధ్యతను చేపట్టనున్నారు. సెబీ కొత్త అధిపతిగా తుహిన్ పాండే మూడేళ్లపాటు కొనసాగనున్నారు.












Click it and Unblock the Notifications