సునంద కేసులో కొత్త ట్విస్ట్, విదేశీయులకోసం గాలింపు!
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నేత శశిథరూర్ భార్య సునంద పుష్కర్ హత్య కేసు మరో కొత్త మలుపు తిరిగింది. గుర్తు తెలియని ముగ్గురు విదేశీయులకు ఈ హత్యతో సంబంధం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ముగ్గరూ నకిలీ పాస్‌పోర్టులతో సునంద పుష్కర్ హత్య జరిగిన జనవరి 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో ఉన్నట్టు దర్యాప్తులో తేలింది.
దీని పైన మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు ముగ్గురు పోలీసు అధికారులను దుబాయ్ పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు దుబాయ్, పాకిస్థాన్‌ల నుండి వచ్చి వెళ్లిన వ్యక్తుల వివరాల కోసం కూడా ఢిల్లీ పోలీసులు ఇంటలిజెన్స్ బ్యూరో అధికారులను సంప్రదించారు.
ముగ్గురు వ్యక్తులు జనవరి 13 నుంచి 18 వరకు సునంద పుష్కర్ ఉన్న లీలా ప్యాలెస్ హోటల్‌లో బస చేసినట్టు తేలింది. వారు హోటల్‌లో ఐదు రోజుల పాటు ఉన్నారని దర్యాఫ్తులో తెలిసింది.

మరోవైపు ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు తమ రెండో నివేదికలో రేడియో ధార్మిక శక్తిని వెదజల్లే ఏదో విషపూరిత ఐసోటోప్ కలిపిన ఆహారం సేవించడం వలన సునంద పుష్కర్ చనిపోయినట్టు తేల్చారు. ఆ ఐసోటోప్ ఏంటనే విషయాన్ని నిర్ధారించేందుకు సునంద పొట్టలోని అవయవ భాగాలను అమెరికాకు పంపించనున్నారు.
జనవరి 17వ తేదీన సునంద పుష్కర్ లీలా ప్యాలెస్‌లోని తాను బస చేసిన హోటల్లో విగత జీవిగా కనిపించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసుకు సంబంధించి శశిథరూర్‌ను ప్రశ్నించే విషయమై ఢిల్లీ పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. భవిష్యత్తు గురించి తాము అప్పుడే చెప్పలేమని, కేసుకు ఏది అవసరం అనుకుంటే చేస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications