• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్విటర్‌: సోషల్ మీడియా దిగ్గజానికి ఇవి తుది ఘడియలా? ట్విటర్‌ను అంతం చేయగల మూడు కారణాలు ఇవీ...

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎలాన్ మస్క్

సోషల్ మీడియా దిగ్గజాల్లో ఒకటైన ట్విటర్‌కు ఇప్పుడు జనం ఇబ్బడి ముబ్బడిగా గుడ్‌బై చెప్తున్నారు.

ట్విటర్‌కు 'సంతాపం’ తెలుపుతూ "RIPTwitter" అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది. ట్విటర్ యూజర్లు చాలా మంది తమ డాటాను డౌన్‌లోడ్ చేసుకోవటానికి పోటీపడుతున్నారు.

కొందరు యూజర్లు తమను ప్రత్యామ్నాయ సోషల్ మీడియా వేదికల్లో కలుసుకోవచ్చని ఆ వివరాలు షేర్ చేస్తున్నారు.

ట్రెండ్‌ను ఎన్నడూ విస్మరించని ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్.. ట్విటర్ లోగో ఉన్న సమాధిని చూపే మీమ్‌ను షేర్ చేస్తూ ట్వీట్ చేశారు.

https://twitter.com/elonmusk/status/1593459801966538755

మరోవైపు సిబ్బంది కూడా గుంపులు గుంపులుగా ట్విటర్‌ను వీడిపోతున్నారు. ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన వారం రోజుల్లోనే చాలా మందిని ఉద్యోగాల్లో నుంచి తొలగించారు.

మిగిలిన ఉద్యోగులు ఎక్కువ గంటలు పనిచేయాలని, అందుకు ఆమోదం తెలపాలని మస్క్ ఈమెయిల్ పంపించారు. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు స్వచ్ఛందంగా వైదొలగుతున్నారు.

అలా వీడిపోతున్నవారిలో చాలా మంది ట్విటర్ పనిచేయటానికి కీలకమైన ఇంజనీర్లు, డెవలపర్లు, కోడర్లు ఉన్నట్లు ట్విటర్‌లోని వారి వివరాలను బట్టి తెలుస్తోంది.

ఈ పరిస్థితుల్లో.. నీలిపిట్ట ట్విటర్‌ను అమాంతంగా నేలకు కూల్చి సమాధి చేయగల మూడు పెద్ద కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

మొదటి కారణం: హ్యాక్ చేయటం

హ్యాకింగ్

ట్విటర్‌ కథ ముగించగల మొట్టమొదటి అంశం.. చావుదెబ్బతీసేలా హ్యాక్ చేయటం.

అన్ని పెద్ద వెబ్‌సైట్ల తరహాలోనే (ఈ బీబీసీ వెబ్‌సైట్ సహా) ట్విటర్ మీద కూడా సైబర్ ఆగంతకులు నిరంతరం దాడి చేస్తూ ఉంటారు. వాటిలో ప్రభుత్వాలు కూడా ఉంటాయి.

ప్రపంచ నాయకులు, రాజకీయవేత్తలు, ప్రజాదరణ గల ప్రముఖులు అందరికీ ట్విటర్‌లో వ్యక్తిగత అకౌంట్లు, వాటికి లక్షలు, కోట్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

హ్యాకర్లు తమ ఘన కార్యాన్ని ఎక్కువ మంది జనానికి ప్రదర్శించటానికి ఇలాంటి అకౌంట్లను సులవైన లక్ష్యాలుగా ఎంచుకుంటారు. ఇంతకుముందు ఇలాంటి ఖాతాలు చాలానే హ్యాక్ అయ్యాయి.

లేదంటే ట్విటర్‌ను మాయం చేయాలని వాళ్లు కోరుకోవచ్చు. దీంతో విపరీతమైన వెబ్ ట్రాఫిక్‌తో ట్విటర్‌ను ముంచెత్తుతారు. ఆ ట్రాఫిక్‌ను తట్టుకోలేక ట్విటర్ మూతపడుతుందని వారి వ్యూహం.

ఇలాంటి ప్రయత్నాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటాయి. ఇదొక నిరంతర పోరాటం.

ఇప్పుడు ఏ కంపెనీకి అయినా రోజు వారీ కార్యకలాపాల నిర్వహణలో సైబర్ సెక్యూరిటీ అనేది అత్యంత ముఖ్యమైన అంశం. ట్విటర్ సైబర్ భద్రత విభాగానికి అధిపతిగా ఉన్న లియా కిస్నర్ గత వారం ఆ కంపెనీని వీడివెళ్లారు. ఆమె స్థానంలో ఇంకెవరినైనా నియమించారా లేదా అన్నది తెలీదు.

ట్విటర్‌కు కమ్యూనికేషన్ టీమ్ కూడా లేదు. కాబట్టి వారిని అడగటానికి సులభమైన దారేదీ లేదు.

ట్విటర్ భద్రత చాలా బలంగానే ఉండే అవకాశముంది. ప్రతి నెలా 30 కోట్ల మంది ఉపయోగించే వెబ్‌సైట్‌ను అంత బలహీనంగా ఏమీ నడపరు.

కానీ ఆ బలమైన భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తూ బలోపేతం చేయాల్సి ఉంటుంది.

ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్త బలహీనతలు బయటపడుతూ ఉంటాయి. అప్పటివరకూ గుర్తించిన లోపాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. వాటిని సరి చేయాల్సి ఉంటుంది.

మన ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో ఆపరేటింగ్ సిస్టమ్ సహా అనేక సాఫ్ట్‌వేర్లకు తరచుగా సెక్యూరిటీ అప్‌డేట్లు ఇన్‌స్టాల్ చేసుకునేది ఇందుకే. ఈ పని చేయటానికి నిపుణులైన సైబర్ భద్రతా సిబ్బంది అవసరం.

రెండో కారణం: సర్వర్లకు ముప్పు

డాటా సెంటర్

ఇక ట్విటర్‌కు పొంచివున్న రెండో గండం.. దాని సర్వర్లు కుప్పకూలటం. కక్షకట్టిన వాళ్లెవరైనా కూల్చటమో, రోజువారీ పర్యవేక్షణలో పొరపాటు వల్లనో అవి కుప్పకూలే అవకాశం ఉంటుంది.

సర్వర్లు లేకపోతే ట్విటర్ ఉండదు. ఫేస్‌బుక్ అయినా, ఇన్‌స్టాగ్రామ్ అయినా.. మన డిజిటల్ ప్రపంచం మొత్తం ఈ సర్వర్ల మీదే ఆధారపడి ఉంటుంది. అవి కూలితే ఇవి ఉండవు.

సర్వర్లు అనేవి అత్యంత శక్తివంతమైన కంప్యూటర్లు. ఈ వెబ్‌సైట్లు, వేదికలకు శరీరాల వంటివని చెప్పవచ్చు. అవి డాటా సెంటర్లలో ఉంటాయి. డాటా సెంటర్లు అంటే.. మొత్తం కంప్యూటర్ సర్వర్లతో నిండిపోయిన పెద్ద పెద్ద గిడ్డంగులు. ఆన్‌లైన్ వ్యాపారాల లావాదేవీలకు ఇవే కేంద్ర బిందువులు. ప్రపంచం మొత్తం సర్వర్ల మీదే నడుస్తుంది.

ఈ యంత్రాలన్నీ చాలా వేడిని పుట్టిస్తాయి. కాబట్టి ఈ డాటా సెంటర్లను ఎప్పుడూ చల్లగా ఉండేలా చూడాలి. అందుకోసం నిరంతరం విద్యుత్ కావాలి.

అసలు సర్వర్లకు కూడా.. డాటా అటూ ఇటూ ప్రయాణిస్తూ ఉంటుంది కనుక క్రమం తప్పకుండా నిర్వహణ, పాత వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయటం అవసరమవుతుంది. దీనంతటిలో ఏదైనా పొరపాటు జరిగే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. ఒకవేళ హఠాత్తుగా అలాంటి పొరపాటు జరిగితే అది చాలా నాటకీయ ప్రభావం చూపుతంది.

ట్విటర్

మూడో కారణం: చాప చుట్టేయటం

ఎలాన్ మస్క్‌కి ఇదంతా తెలుసు. తెలీదని మనం అనుకోలేం. ఆయన తనకు తెలిసినా కూడా తెలివితక్కువ వాడిగా నటించవచ్చు.

ఇప్పుడు ఎవరు కాపలా కాస్తున్నారో మనకు తెలీదు.

కానీ నిన్న నాకు జరిగిన ఒక ఉదంతంతో.. మన అంచనా కన్నా ఎక్కువ మందే ట్విటర్ మీద కన్నేసి ఉన్నట్లు నాకు అనిపించింది.

ఆటోమేటెడ్ మోడరేషన్ టూల్స్ (సొంతంగా తనిఖీ చేసే యాంత్రిక పనిముట్లు) తప్పుగా వర్గీకరించటంతో.. ఒక వ్యోమగామి అకౌంట్ లాక్ అయిపోయిన ఉదంతం గురించి నేను చెప్పాను.

ట్విటర్ నుంచి కానీ, ఎలాన్ మస్క్‌కు చెందిన ఇతర కంపెనీల నుంచి కానీ ఏ ఒక్కరూ నాకు స్పందించలేదు. ఆమెను సంప్రదించనూ లేదు. కానీ ఆ రోజు కొంత సమయం తర్వాత ఆమె అకౌంట్ నిజంగానే పునరుద్ధరణ అయింది.

ట్విటర్ లోపల ఎక్కడో ఎవరో శ్రద్ధగా గమనిస్తూనే ఉన్నారు. బహుశా ఆ పని మాత్రమే చేయటానికి ఇంకా తగినంత మంది సిబ్బంది ఉన్నారేమో.

ఇక పై రెండు కారణాలూ కాకుండా మూడో కారణం ఉండనే ఉంది. ట్విటర్ దివాలా తీసిందని ఎలాన్ మస్క్ ప్రకటిస్తే.. ఈ నీలిపిట్ట చాప చుట్టేస్తుంది. కానీ ఇప్పటికైతే ఈ పిట్ట కూతల పెద్దగా తన హోదాను ఎలాన్ మస్క్ ఎంజాయ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Twitter: Are these the final hours for the social media giant? Here are three reasons to end Twitter...
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X