Twitterకు చెక్: సోషల్ మీడియా హోదా రద్దు: కత్తి నూరుతోన్న కేంద్రం: బీజేపీ పెద్దల ప్రమేయం
న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశంలో వివాదాలకు కేంద్రబిందువు అవుతూ వస్తోన్న టాప్ మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌కు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియా హోదాను కోల్పోనుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలకు కేంద్ర ప్రభుత్వం కల్పించే రక్షణపరమైన చర్యలన్నింటినీ ట్విట్టర్ కోల్పోనుంది. కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రూపొందించిన మార్గదర్శకాలు, విధివిధానాలకు లోబడి పనిచేయకపోవడం వల్లే ట్విట్టర్ యాజమాన్యానికి కేంద్రం ఈ షాక్ ఇచ్చిందని అంటున్నారు.
దేశంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మార్గదర్శకాలన్నీ కిందటి నెల 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వాట్సప్, ఫేస్‌బుక్ వాటిని అనుసరిస్తోన్నాయి. కొత్త మార్గదర్శకాలకు లోబడి కార్యకలాపాలను కొనసాగిస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ మాత్రం దీనితో విభేదించింది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ రూపొందించిన కొత్త మార్గదర్శకాలను అనుసరించడానికి మొండికేసింది. యధాతథంగా తన కార్యకలాపాలను దేశంలో కొనసాగిస్తోంది. దేశంలో అందుబాటులో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లల్లో ట్విట్టర్ మాత్రమే కేంద్రంతో విభేదించింది.

కేంద్రం మార్గదర్శకాల ప్రకారం.. ట్విట్టర్ యాజమాన్యం తన కార్యకలాపాలు, లీగల్ వ్యవహారాలు, ఫిర్యాదులను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించాల్సి ఉంటుంది. చీఫ్ కంప్లయన్సెస్ అధికారి, నోడల్ అధికారి, ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేకంగా మరో గ్రీవెన్స్ అధికారిని వేర్వేరుగా నియమించాల్సి ఉంటుంది. దీనికి ట్విట్టర్ అంగీకరించలేదు. కొంత గడువు కావాలని కోరితే.
దీని కేంద్రం ఇప్పటికే తుది నోటీసులను కూడా జారీ చేసింది. దీనిపై ట్విట్టర్ యాజమాన్యం ఈ మూడు పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ సైతం ఇచ్చింది.
నిర్ణీత గడువులోగా దాన్ని భర్తీ చేయకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగినట్టు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 79 కింద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు కల్పించాల్సిన రక్షణ చర్యలన్నింటినీ ఎత్తేయడానికి కేంద్రం సమాయాత్తమైనట్లు సమాచారం. సోషల్ మీడియా గుర్తింపును కోల్పోతే.. ట్విట్టర్ యాజమాన్యం మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. వాటి సేవలకు దాదాపు బ్రేక్ పడినట్టే అవుతుందని అంటున్నారు.
సోషల్ మీడియా వేదికగా తప్పుడు సమాచారం వ్యాప్తి అవుతోందనే కారణంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రానికి ఫిర్యాదులు చేశారు. దీనికి అవసరమైన కొన్ని సాక్ష్యాధారాలను వారు అందజేసినట్లు ఐటీ మంత్రిత్వ శాఖ చెబుతోంది. థర్డ్ పార్టీ ద్వారా వాటిపై పరిశీలన జరిపించడంతో- అవి నిజమేనంటూ తేలడంతో కేంద్రం కొత్తగా ఈ మార్గదర్శకాలను రూపొందించింది. ఫేస్‌బుక్, వాట్సప్ వంటి ప్లాట్‌ఫామ్స్ వాటికి లోబడి పని చేస్తామని ప్రకటించాయి. ట్విట్టర్ కొంత గడువు కోరింది.












Click it and Unblock the Notifications