కారు డోర్ లాకవడంతో ఇద్దరు చిన్నారుల మృతి
గుర్గావ్: హర్యానా రాష్ట్రంలోని గుర్గావ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. కారు డోర్ లాకవడంతో అందులో ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. చిన్నారుల మరణంతో వారి కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి సమీపంలోని గుర్గావ్ పట్టణంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్లు, రెండేళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులు హిమాన్షి, పింకీలు ఆటలో భాగంగా కారులోకి ఎక్కారు.

వారికి తెలియకుండానే డోర్ లాక్ చేసుకున్నారు. అలా ఎక్కువ సమయం కారులో ఉండటంతో ఊపిరాడక దయనీయ స్థితిలో చిన్నారుల ప్రాణాలు కోల్పోయారు. ఎక్కువసేపు వారిని ఎవరూ గమనించకపోవడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
కాగా, పిల్లల కోసం తీవ్రంగా వెతికిన వారి తండ్రి, చివరకు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. కారు దగ్గరికి వెళ్లేసరికి అందులో చిన్నారులు నిర్జీవంగా ఉన్నారు. ఆందోళనకు గురైన తండ్రి వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
అప్పటికే ఆ చిన్నారులు మృతి చెందారని వైద్యులు నిర్ధారించడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications