శ్రీనగర్ లో ఇద్దరు అమెరికన్ల అరెస్టు-శాటిలైట్ ఫోన్లతో దొరికిన వైనం..!
ఇవాళ జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ (Srinagar) లో కలకలం రేగింది. ఇద్దరు అమెరికా పౌరులు (US Nationals) శ్రీనగర్ ఎయిర్ పోర్టులో పోలీసుల తనిఖీల సందర్భంగా శాటిలైట్ ఫోన్లు తీసుకెళ్తూ దొరికారు. దీంతో పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. విమానాశ్రయ భద్రతా సిబ్బంది వారిని ప్రశ్నించి, తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు. దీంతో ఈ వ్యవహారం భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరిని మోంటానాకు చెందిన జెఫ్రీ స్కాట్‌గా గుర్తించారు. అతని సామాను నుండి శాటిలైట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా భారత్ లో శాటిలైట్ ఫోన్‌ల వాడకంపై నిషేధం ఉంది. తురయా, ఇరిడియం ఫోన్‌ల వంటి పరికరాలు కఠినమైన నియంత్రణ పరిధిలోకి వస్తాయి. అనధికారికంగా వాటిని కలిగి ఉండటం భారత టెలిగ్రాఫ్ చట్టం, ఇతర భద్రతా నిబంధనల ప్రకారం నిర్బంధం, అరెస్టు, స్వాధీనానికి దారి తీస్తుంది.

మన దేశంలో భద్రతా కారణాలతో కేంద్రం కఠినమైన టెలికాం ఆంక్షలను అమలు చేస్తుంది. గతంలో కూడా విదేశీయులు, భారత పౌరులు ఇద్దరూ ఇలాంటి కేసులలో చర్యలను ఎదుర్కొన్నారు. గత మే నెలలో, అమెరికాకు చెందిన ఒక నేత్ర వైద్యురాలి వద్ద ఇరిడియం శాటిలైట్ ఫోన్ దొరకడంతో ఆమెను పుదుచ్చేరి విమానాశ్రయంలో అడ్డుకున్నారు. ఆమెను హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కకుండా ఆపి, పోలీసు విచారణను ప్రారంభించారు.అలాగే దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, హోటళ్లలో అనధికారిక ఉపగ్రహ పరికరాలను కలిగి ఉన్నందుకు ఒక చైనా పౌరుడు, ఒక బ్రిటిష్ ఎగ్జిక్యూటివ్‌తో సహా విదేశీ జాతీయులను గతంలో కూడా అదుపులోకి తీసుకున్నారు.














Click it and Unblock the Notifications