వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇద్దరు మహిళల యధార్ధ గాథ: ‘పోర్న్ చూస్తూ అసహజ సెక్స్ కోసం బలవంతం చేసేవాడు, కాదంటే శిక్షించేవాడు’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ప్రతీకాత్మక చిత్రం

మధ్యప్రదేశ్‌లో ఒక వ్యక్తి భార్యను సెక్స్ కోసం బలవంతం చేయడంతో అతని పురుషాంగాన్ని కత్తిరించినట్లు వార్తలొచ్చాయి. ఆమెకు ఇష్టం లేదని చెప్పినా బలత్కారానికి దిగడంతో ఆమె ఈ పని చేసినట్లు పోలీసులు వెల్లడించారని మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఇది విన్న కొంత మంది స్త్రీవాదులు ''ఆ మహిళ ఎంత వేదన అనుభవిస్తే అలా ప్రవర్తించిందో’’ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి భార్యకు ఇష్టం లేకుండా సెక్స్‌లో పాల్గొనమని బలవంతం చేయవచ్చా?

దురదృష్టవశాత్తూ భారతదేశంలో మ్యారిటల్ రేప్‌ను నేరంగా పరిగణించటం లేదని దిల్లీకి చెందిన న్యాయవాది సోనాలీ అన్నారు. వివాహం చేసుకున్న వారికే ఈ పరిస్థితి ఎదురైతే, సహజీవనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొనే వారికి ఎటువంటి న్యాయం లభిస్తుంది?

మూడు నెలల పాటు సహజీవనం సాగించి, లైంగిక వేధింపులు భరించలేక చివరకు పోలీసు కేసు నమోదు చేసిన ఒక మహిళతో బీబీసీ మాట్లాడింది.

ఇలస్ట్రేషన్

ఆమె సహజీవనంలోకి వెళ్లిన పరిస్థితులు ఏంటి?

(ఈ కథనంలో బాధితుల పేర్లను మార్చాం)

జ్యోతి హైదరాబాద్ కు చెందిన సైకాలజిస్ట్. ఆమె దగ్గరకు థెరపీ కోసం వచ్చిన వ్యక్తితో ప్రేమలో పడి అతనితోనే సహజీవనం సాగించినట్లు ఆమె బీబీసీకి చెప్పారు.

"ఆయన నా దగ్గరకు థెరపీ కోసం వచ్చారు. అంతకు ముందే వివాహం అయిందని, విడాకుల ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు".

"యూకే రిటర్న్డ్ అన్నారు. కెరీర్‌లో మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఆయన ఇంటికి తీసుకుని వెళ్లారు. కుటుంబాన్ని పరిచయం చేశారు. ఒక్కసారి కూడా అనుమానం రాలేదు".

"నాకు నమ్మకాన్ని, భరోసాను కలిగించారు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పారు. విడాకులు కాగానే పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకుని ఆయనతో సహజీవనానికి సిద్ధమయ్యాను. ఇదంతా ఈ ఏడాది ఆగస్టులోనే మొదలయింది".

"మొదటి రోజు నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఒకవైపు సంపాదన లేదు, అలా అని ఇంటి పనుల్లో సాయం లేదు. నా డబ్బును వాడటం మొదలుపెట్టారు".

"కానీ, రాత్రి, పగలూ, ఇంటా బయటా తేడా లేకుండా నరకాన్ని అనుభవించాను. అతనికి సాధారణ సెక్స్ పై ఆసక్తి లేదు. మొదట్లో నాకర్ధం కాలేదు".

"ల్యాప్ టాప్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ అతన్ని రకరకాలుగా ప్రేరేపించాలి. పోర్న్ వీడియోలలో ఉన్న అమ్మాయిల శరీర భాగాలను నేను పొగడాలి".

అతని చేష్టలు ఒక్క బెడ్ రూమ్‌కి మాత్రమే పరిమితం కాలేదు. కారులో బయటకు వెళ్ళినప్పుడు , స్విమ్మింగ్ పూల్ లోపల కూడా నన్ను నీటిలో ముంచి అతన్ని ప్రేరేపించమని అడుగుతాడు.

"ఇబ్బందిగా అనిపించింది. ఒక రోజు నా వల్ల కాదు అని కచ్చితంగా చెప్పాను. నువ్వు నన్ను సంతృప్తి పరచలేకపోతే బయట నుంచి ఎవరినైనా తీసుకుని రా. డేటింగ్ సైట్స్ లో వెతుకు అనే సలహా ఇచ్చాడు".

"ఇది నా సహనానికి పరీక్ష పెట్టింది. చాలా గొడవలు, వాగ్వాదాలు జరిగిన తర్వాత ఇక భరించలేక ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను".

ఆమె లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉండటంతో పోలీసులు ఆమె ఫిర్యాదును నమోదు చేసేందుకు వెంటనే అంగీకరించలేదని తెలిపారు.

"మీరూ మీరూ మాట్లాడుకుని పరిష్కరించుకోమని పోలీసులు సలహా ఇచ్చారు. దాంతో, నేను రెండు రోజుల పాటు తిరిగి లాయర్‌ను తీసుకుని వెళ్లగా, మూడవ రోజుకు ఫిర్యాదు నమోదు చేశారు".

ఈ ఫిర్యాదును సికంద్రాబాద్‌లోని తుకారాం గేట్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376 (2) కింద నమోదు చేసినట్లు తెలిపారు.

''కేసు పూర్వాపరాలు పరిశీలించి, బాధితులు పోలీసు స్టేషన్ కు వచ్చినప్పుడు కేసును కచ్చితంగా నమోదు చేస్తా’’ అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎం.రమేశ్ అన్నారు. కొన్ని సార్లు మాత్రం సదరు వ్యక్తులనే మాట్లాడుకుని పరిష్కరించుకోమని సూచనలిస్తామని ఆయన వెల్లడించారు.

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) లెక్కల ప్రకారం 2020లో గృహహింస చట్టం కింద 446 గృ‌హహింస కేసులు రిపోర్టయ్యాయి.

ఇలస్ట్రేషన్

సహజీవనంలో ఉన్న మహిళలకు ఎటువంటి హక్కులుంటాయి?

అయితే, సహజీవనంలో ఉన్న మహిళలకు కూడా భార్యకుండే హక్కులన్నీ ఉంటాయని దిల్లీకి చెందిన న్యాయవాది సోనాలీ చెప్పారు. ఇలాంటి కేసుల్లో గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేయవచ్చని తెలిపారు. భరణం, మెయింటెనెన్స్ పొందే హక్కులు కూడా బాధిత మహిళలకు ఉంటాయని వెల్లడించారు.

వివాహం అయినంత మాత్రాన, లేదా లైంగిక సంబంధానికి ఆమోదం తెలిపినంత మాత్రాన లైంగిక చర్యలో స్త్రీ శరీరాన్ని దోపిడీ చేసే అధికారం గాని, బలవంతంగా సెక్స్ చేయమని అడిగే అధికారం కానీ ఉండదని గతంలో బీబీసీ గతంలో ప్రచురించిన సెక్సువల్ అటానమీకి సంబంధిత కథనంలో హైదరాబాద్ కు చెందిన న్యాయవాది శ్రీకాంత్ చింతల చెప్పారు.

సెక్స్ జరిగే క్రమంలోసైతం - స్త్రీ తనకి 'నచ్చట్లేదు-వద్దు' అని చెప్తే... అది తన అంగీకారం విరమించుకున్నట్టే పరిగణించాలని చట్టం చెబుతుందని తెలిపారు.

సెక్స్‌కు అంగీకారం తెలిపిన తర్వాత కూడా ఆమెకు సెక్స్ మధ్యలో ఇబ్బంది కలిగిన పక్షంలో 'నో' అనే చెప్పే పూర్తి అధికారాలుంటాయి" అని వివరించారు.

శృంగారం,

లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఆమోదయోగ్యమేనా?

లివ్ ఇన్ రిలేషన్ షిప్స్ ఆమోదయోగ్యమేనని సుప్రీం కోర్టు తెలిపింది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 21 సహజీవన సంబంధాలు కొనసాగించేందుకు చట్టబద్ధత కల్పిస్తోంది. లివ్ ఇన్ సంబంధాలు నేరం కాదని పాయల్ శర్మ వర్సెస్ నారీ నికేతన్ కేసులో సుప్రీం కోర్టు పేర్కొంది.

ఇంద్ర శర్మ కేసులో గృహ హింస చట్టం 2005లో పొందుపరిచిన అంశాలన్నీ సహజీవనంలో ఉన్న మహిళకు కూడా వర్తిస్తాయని సుప్రీం కోర్టు చెప్పింది. కానీ, సమాజంలో మాత్రం సహజీవనాన్ని ఆమోదయోగ్యంగా పరిగణించటం లేదు. అదే చాలా సమస్యలకు కారణమని ఫెమినిస్ట్ రచయిత్రి కుప్పిలి పద్మ అంటారు.

జ్యోతి కథ పోలీసు ఫిర్యాదుతో ముగియలేదు. ఆమెకు బెదిరింపులు రావడంతో, అనుమానం వచ్చి ఆమె సహచరుడు గతంలో వివాహం చేసుకున్న భార్యను సంప్రదించారు.

ఆమె చెప్పిన వివరాలను విన్న జ్యోతి షాక్‌కు గురయ్యారు. ఆయన భార్యతో కూడా బీబీసీ మాట్లాడింది.

సుధ (పేరు మార్చాం) కూడా వివాహమైన మొదటి రోజు నుంచీ తీవ్రమైన లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు గురైనట్లు చెప్పారు. ఆమెకు అతనితో 2017లో వివాహం జరిగింది. ఆమె వైవాహిక బంధంలో ఉన్నది 5 నెలలు మాత్రమే.

ఆమెకు వివాహం అయిన తీరు గురించి వివరిస్తూ, భారీగా కట్న కానుకలు, కారు, బంగారం, వైభవంగా పెళ్లి చేయాలని డిమాండ్ చేశారు. పెళ్లి మరో మూడు రోజులుందనగా వారి డిమాండ్లు పెరిగిపోవడంతో కాదనలేకపోయినట్లు చెప్పారు.

ఫస్ట్ నైట్ నుంచే ఆమె కష్టాలు మొదలయ్యాయి. పుట్టింటి నుంచి మంచం పంపిస్తేనే ఫస్ట్ నైట్ జరుగుతుందనే అత్తింటి డిమాండ్ల నుంచి మొదలై, తొలి రాత్రి భయానకంగా ముగిసిందని ఆమె చెప్పారు.

"కనీసం ఒక ముద్దు, కౌగిలింత కూడా లేదు. నా దుస్తులు కూడా తొలగించలేదు. కానీ, లైంగికంగా జరిగే వేధింపులు ఎవరికీ చెప్పుకోలేనివి. సాధారణ సెక్స్ చేయడు. పోర్న్ చూస్తూ అతన్ని గంటల తరబడి ప్రేరేపించాలి. కాదంటే శిక్షిస్తాడు" అని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

వింత ప్రవర్తన

సుధ చెప్పిన మరికొన్ని వివరాలు మరింత వేదన కలిగేలా ఉన్నాయి.

"ప్రతీ రోజు నాలుగు గంటలకొకసారి అలారం పెట్టుకుని, గుర్తు చేసి మరీ అతనికి భావప్రాప్తి కలిగించాలి. లేదంటే గంటల తరబడి నిలబెట్టేస్తాడు. అలా నిలబడి నిలబడి కళ్లు తిరిగి పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి" అని బొంగురుపోయిన గొంతుతో చెప్పారు.

"నేను తెలివి వచ్చి లేచిన తర్వాత ఏడుస్తాడు. తాను ఏడ్చినందుకు నన్ను సారీ చెప్పమంటాడు. నాకేమి అర్ధమయ్యేది కాదు".

"ఇంతలో నాకు సెర్వికల్ స్పాండిలైటిస్ కూడా వచ్చింది. అతని ప్రవర్తన గురించి అత్తగారితో చెబితే, వాడికిష్టమైనట్లు నువ్వు చేయాల్సిందే అంటూ నన్ను మరింత న్యూనతకు గురి చేశారు".

"ఇక ఓపిక నశించి మా ఇంట్లో చెబితే, ఇంటికి వచ్చేయమని చెప్పారు. ఈ వేదన భరించలేక అర్ధరాత్రి ఆటో తీసుకుని నైటీలోనే పుట్టింటికి వెళ్ళిపోయాను".

ఒక సంవత్సరం వేచి చూసిన తర్వాత సుధ భర్త పై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారి విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతోంది.

ఇద్దరు మహిళలు కేసు పెట్టిన వ్యక్తి ప్రస్తుతం యాంటిసిపేటరీ బెయిల్ పై ఉన్నారు. ఆయనను అరెస్ట్ చేసే ప్రయత్నం పోలీసులు చేయలేదని జ్యోతి ఆరోపిస్తున్నారు.

అయితే, బాధితులు చెప్పిన విషయాల ఆధారంగా కేసు నమోదు చేయాలి. అదే సమయంలో ఆరోపణ ఎదుర్కొంటున్న వారి హక్కులను పూర్తిగా కాలరాయడానికి లేదని సోనాలీ అంటారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జర్నలిస్ట్ వరుణ్ హైర్‌మత్ పై పెట్టిన అత్యాచార కేసులో దిల్లీ హై కోర్టు యాంటిసిపేటరీ బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ , ఫిర్యాదుదారు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, హై కోర్టు తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకోమని సుప్రీం కోర్టు చెప్పింది.

జ్యోతి, సుధ మాత్రం తమకెటువంటి న్యాయం జరుగుతుందోనని వేచి చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Two women true story: Watching porn and used to demand for unnatural sex
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X