• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు రెండేళ్లు: 'నాన్న ఎక్కడని అడిగితే, నా కూతురికి ఏమని చెప్పాలి"

By BBC News తెలుగు
|
బషీర్ అహ్మద్ భట్

బషీర్ అహ్మద్ భట్ సోదరుడి ఇంటి గోడల పై ఉన్న రక్తపు మరకలు, దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు ముగ్గురు మరణించిన నాటి సాయంత్రాన్ని పదే పదే గుర్తు చేస్తుంటాయి.

ఈ ఏడాది జూన్ 27న భట్ సోదరుడు ఫయాజ్ అహ్మద్ భట్ నిద్రకు ఉపక్రమిస్తుండగా, ఆయన ఇంటి తలుపును ఎవరో తట్టిన శబ్దం వినిపించింది. ఆ రాత్రి వేళ తలుపులు కొట్టడం అసాధారణమే అయినప్పటికీ, ఆయన భార్య, కూతురితో పాటు వెళ్లి తలుపు తీశారు.

ఆ మరుక్షణమే, మిలిటెంట్లుగా అనుమానించే ఇద్దరు వ్యక్తులు వారి ముగ్గురినీ కాల్చి చంపారు.

45 సంవత్సరాల ఫయాజ్ కశ్మీర్ పోలీస్ శాఖలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా పని చేసేవారు.

ఫయాజ్ ఇంట్లో తుపాకీ పేలుడు శబ్దాలను అక్కడకు దగ్గరలోనే ఉన్న ఆయన సోదరుడు బషీర్ విన్నారు.

ఆయన పరుగుతో సోదరుని ఇంటికి వెళ్ళేటప్పటికే దారుణం జరిగిపోయింది. ఆయన సోదరుని కుటుంబం రక్తపు మడుగులో పడి ఉంది.

"తోటలో ఉన్న పూలన్నిటినీ ఆ బుల్లెట్లు ఒక్క క్షణంలో విధ్వంసం చేసేశాయి" అని భట్ తన సోదరుని కుటుంబం గురించి చెబుతూ అన్నారు. "వారి తప్పేంటి? ఏమీ లేదు" అని అన్నారు.

ఫయాజ్ ను మిలిటెంట్లు కాల్చి చంపే సమయానికి ఆయన కొడుకు భారత సైన్యంలో సైనికునిగా పని చేస్తూ విధి నిర్వహణలో ఇంటికి దూరంగా ఉన్నారు.

కశ్మీర్‌లో ఆర్టికల్ 370 ను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టి రెండు సంవత్సరాలు కావస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ఈ చర్యను తీసుకున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు.

అయితే, అప్పటి నుంచి, భద్రతా దళాల కోసం పని చేస్తున్న పౌరులు, స్థానికులను స్థానిక మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకున్నారు.

"మిలిటెంట్లు వాళ్ళను, వారి కుటుంబాలను పోలీస్ ఇన్ఫార్మర్లు , లేదా సమన్వయ కర్తలుగా భావిస్తారు" అని దిల్లీ లోని ఇన్స్టిట్యూట్ ఫర్ కన్‌ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అజయ్ సాహ్ని చెప్పారు.

వాళ్లెప్పుడూ ముప్పుకు దగ్గరగా ఉండి మిలిటంట్ల లక్ష్యానికి ముందుగా గురవుతారని అన్నారు.

జూలై వరకు మిలిటెంట్ సంబంధిత ఘటనల్లో సుమారు 15 మంది భద్రతా సిబ్బంది, 19 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ 2019-2020లో సమర్పించిన వార్షిక నివేదిక ప్రకారం, 1990లో కశ్మీర్ లో వేర్పాటువాదం వ్యాప్తి చెందటం మొదలైనప్పటి నుంచీ డిసెంబరు 2019 వరకు సుమారు 14,054 మంది పౌరులు, 5294 మంది భద్రతా దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కానీ, మరణించిన వారి సంఖ్య అధికారిక అంచనాల కంటే చాలా ఎక్కువగానే ఉండవచ్చు అని అంటారు.

ఫయాజ్ అహ్మద్ భట్

ఈ ప్రాంతం గురించి భారత్ పాకిస్తాన్‌ల మధ్య ఎప్పుడూ వివాదం చెలరేగుతూనే ఉంటుంది. ఇరు దేశాల మధ్య చోటు చేసుకున్న మూడు యుద్ధాల్లో రెండు యుద్ధాలు ఈ ప్రాంతానికి సంబంధించినవే.

కశ్మీర్‌లో అశాంతికి పాకిస్తాన్ కారణమని దిల్లీ ఆరోపిస్తూ వస్తోంది. అయితే, ఈ ఆరోపణలను పాకిస్తాన్ ఖండిస్తోంది.

ఇరు దేశాల మధ్య సరిహద్దుల దగ్గర కాల్పుల విరమణ జరగడంతో, ప్రస్తుతం పాకిస్తాన్ నుంచి ఇక్కడకు పంపే మిలిటెంట్ల సంఖ్య తగ్గిపోయిందని కశ్మీర్ భద్రతా సంస్థలు చెబుతున్నాయి. కానీ, హింస మాత్రం ఆగలేదు.

"గత కొన్ని రోజులుగా, అమాయక పౌరులు లేదా సెలవులో ఉన్న పోలీసులను ప్రార్ధనల కోసం మసీదుకు వెళ్ళినప్పుడు వారిని లక్ష్యంగా చేసుకున్నారు. మిలిటెంట్లు ఈ ప్రాంతంలో భయాన్ని సృష్టించాలని అనుకుంటున్నారు. ఇక్కడ శాంతి, స్థిరత్వం ఏర్పడటం వారికిష్టం లేదు" అని కశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్ కుమార్ జూన్ లో నిర్వహించిన ఒక పత్రికా సమావేశంలో అన్నారు.

స్థానిక మిలిటెంట్లు

కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఈ ప్రాంతంలో స్థానిక మిలిటెంట్ల మరణాలు పెరిగాయని, గణాంకాలు సూచిస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా సైనిక దళాలు, మిలిటెంట్ల మధ్య తుపాకీ కాల్పులు పెరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి జమ్మూ కశ్మీర్ లోని వివిధ ప్రాంతాల్లో మిలిటెంట్లుగా భావిస్తున్న సుమారు 90 మంది వ్యక్తులు తుపాకీ కాల్పుల్లో మరణించారు.

మిలిటెంట్లుగా భావిస్తున్న వారిలో 82 మందిలో స్థానికులే ఉన్నారు. అందులో కొంత మంది 14 సంవత్సరాల వారు కూడా ఉన్నారు.

వివిధ వేర్పాటువాద సమూహాలతో చేరిన 3 రోజులకే కొంత మంది ఈ దాడుల్లో మరణించారు .

2020లో 203 మంది మిలిటెంట్లు మరణించినట్లు పిటీఐ వార్తా సంస్థ పేర్కొంది. అందులో 166 మంది స్థానిక మిలిటెంట్లు ఉన్నారు. 2019లో 152 మంది మిలిటెంట్లు మరణించగా, అందులో 120 మంది స్థానికులే.

కశ్మీర్‌లో 200 కు పైగా మిలిటెంట్లు ఉన్నారని ఒక సీనియర్ భద్రతాదళ అధికారి చెప్పారు. అందులో 80 మంది విదేశీయులు ఉండవచ్చని, మిగిలిన వారు స్థానికులు అని చెప్పారు.

అయితే, ఈ వివరాలు మీడియాకు వెల్లడి చేసే అధికారాలు ఆయనకు లేనందున ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు.

ఈ ఏడాది తీవ్రవాదుల జాబితాకు కొత్తగా విదేశీ మిలిటెంట్ల పేర్లు జత చేయలేదు. ప్రస్తుతం ఉన్న జాబితా గత సంవత్సరాలకు సంబంధించినదే. అయితే, స్థానికుల పేర్లు మాత్రం ఈ జాబితాకు ప్రతీ రోజూ జత అవుతున్నాయి.

ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్య కాలంలో సుమారు 76 మంది కశ్మీరీలు ఆయుధాలను పట్టారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అని ఆ అధికారి అన్నారు.

కశ్మీర్

గతంలో కంటే, కశ్మీర్‌లో ప్రస్తుతం తీవ్రవాదం తగ్గుముఖం పట్టిందని, భద్రతా సంస్థలు చెబుతున్నప్పటికీ, స్థానికులు తీవ్రవాద మార్గం పట్టడం పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం.

కశ్మీర్‌లో మిలిటెంట్లకు శిక్షణ పొందిన వ్యక్తులు, ఆయుధాల సరఫరా చేస్తూ సహాయం చేస్తోందని భారత్ ఆరోపిస్తూ వస్తోంది. అయితే, పాకిస్తాన్ ఈ ఆరోపణను ఖండిస్తోంది.

స్థానికులు ఎక్కువగా తీవ్రవాదం వైపు మళ్లడానికి కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల ఉన్న వ్యతిరేకతే కారణమని సాహ్ని చెప్పారు.

"జమ్మూ కశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కానీ, మొత్తం మీద ఈ ధోరణి తగ్గుతూ వస్తోంది. పాకిస్తాన్ ప్రస్తుతం ఈ ఉద్యమాన్ని స్థానిక ఉద్యమంగా చేయాలని భావించడం వల్లే స్థానికులు తీవ్రవాద మార్గం పట్టడానికి కారణం" అని అన్నారు.

కశ్మీర్

సరిహద్దుల దగ్గర శాంతి

నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్) దగ్గర మిలిటెంట్ దాడులు,తుపాకీ దాడులు కొనసాగుతూ ఉండేవి. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో నియంత్రణ రేఖ దగ్గర కాల్పుల విరమణ పాటించాలని భారత్ పాకిస్తాన్ లు అంగీకారానికి వచ్చినప్పటి నుంచీ, సరిహద్దుల దగ్గర శాంతియుత పరిస్థితులు నెలకొన్నాయి.

కాల్పుల విరమణ అమలులోకి వచ్చినప్పటి నుంచీ, ఒక్క ఉల్లంఘన కూడా జరగలేదని, శ్రీ నగర్ లో భారత సైనిక దళం అధికారి చెబుతున్నారు.

"మాకు తెలిసినంతవరకూ కశ్మీర్‌లో సరిహద్దులు దాటి అక్రమంగా ప్రవేశాలు కూడా జరగలేదు" అని శ్రీనగర్ లో ఉండే చినార్ కార్ప్స్ అధికారి దేవేంద్ర ప్రతాప్ పాండే చెప్పారు.

"ఈ కాల్పుల విరమణ కశ్మీర్‌లో తీవ్రవాద కార్యకలాపాల పై ప్రభావం చూపడం మాత్రమే కాకుండా, సరిహద్దుల చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో గత అయిదు నెలల నుంచీ శాంతిని కూడా నెలకొల్పింది. ఇంత ప్రశాంతత ఇక్కడ నెలకొనడం అరుదైన విషయం."

కశ్మీర్

లైన్ ఆఫ్ కంట్రోల్ చుట్టూ నివసించే ప్రజలు గతంలో భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది.

1998లో పాకిస్తాన్ నుంచి విసిరిన ఒక బాంబు ఇంటి పై పడినప్పుడు షాజియా మహమూద్ తల్లిని కోల్పోయారు.

నవంబరు 2020లో సరిహద్దు కాల్పుల్లో ఆమె భర్త మరణించారు.

"ఇరు వైపుల నుంచీ బాంబుల దాడి జరిగినప్పుడు ఒక రోజు 11 గంటలకు మహమూద్ పనిలో ఉన్న ఆమె భర్తను ఇంటికి పిలిచారు.

ఆయన మమ్మల్ని లోపల దాగి ఉండమని చెప్పి, ఆయన కోసం వేచి చూడమని చెప్పారు" అని మహమూద్ తెలిపారు.

కానీ, ఆయన వెనక్కి తిరిగి రాలేదు. తాహిర్ మహమూద్ మీర్ కు బాంబు తగిలి ప్రాణాలు కోల్పోయారు.

"ఆయన మరణించే నాటికి నా చిన్న కూతురుకి 12 సంవత్సరాలు. ఆ చిన్నారి నాన్నెక్కడని అడిగితే, నేనేమని సమాధానం చెబుతాను" అని మహమూద్ అన్నారు.

కశ్మీర్

సరిహద్దుల దగ్గర ప్రశాంతమైన పరిస్థితులు నెలకొన్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇరు దేశాలు 2003లో జరిగిన ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి కట్టుబడి ఉంటాయో లేదోననే అనుమానాలు మాత్రం ఉన్నాయి.

సరిహద్దులకు దూరంగా కశ్మీర్‌లో ఉన్న గ్రామాలు, పట్టణాలలో మాత్రం బషీర్ అహ్మద్ భట్ లాంటి వారికి శాంతి చెల్లాచెదురై, ఒక అంతు చిక్కని విషయంగానే మిగిలిపోయింది.

"పాకిస్తాన్, భారత పాలకులు ఇద్దరూ మా జీవితాలతో ఆడుకుంటున్నారు. వారి మధ్య చర్చలు జరగాలి. మానవత్వాన్ని కాపాడమని మాత్రమే చెప్పగలను. కశ్మీరీలు మరణించకుండా, మానవత్వాన్ని కాపాడేందుకు ఈ పోరాటానికి ఒక పరిష్కారం కావాలి" అని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Two years passed for Article 370: 'If I ask where my father is, what should I say to my daughter'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X