• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐరాస జనరల్ అసెంబ్లీ: చైనా, పాకిస్తాన్‌ల పేరెత్తకుండానే విమర్శలు చేసిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ఎస్ జైశంకర్

భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ న్యూ యార్క్ లో జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో శనివారం ప్రసంగించారు.

ఈ సమావేశంలో ఆయన రష్యా-యుక్రెయిన్ యుద్ధం నుంచి మొదలుకొని ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ, ఐక్యరాజ్య సమితిలో భారత్ పోషించాలనుకుంటున్న బాధ్యతాయుతమైన పాత్ర వరకు మాట్లాడారు. పాకిస్తాన్, చైనా దేశాల పేర్లను నేరుగా ప్రస్తావించకుండానే, వాటి గురించి మాట్లాడాల్సిన విషయాలను మాట్లాడారు.

75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకున్న భారతదేశం గురించి ప్రస్తావిస్తూ, తమ దౌత్య విధానం పట్ల అనేక సంకేతాలను అందించారు. భారతదేశం భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోరుకుంటున్నట్లు పరోక్షంగా చెప్పారు.

భారత్ చేసిన ప్రతిపాదనకు రష్యా విదేశాంగ శాఖ మంత్రి కూడా తన ప్రసంగంలో మద్దతు పలికారు.

https://twitter.com/DrSJaishankar/status/1573741060517687297

రష్యా -యుక్రెయిన్ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పై భారం పడుతోందని అంటూ, దీని వల్ల ఇంధనం, ఎరువులు, ఆహార లభ్యత పై ప్రభావం పడి ధరలు పెరుగుతున్నాయని అన్నారు. ఈ యుద్ధం వల్ల చాలా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయని అంటూ ఇది వాణిజ్యపరమైన సమస్యలను కూడా కొనితెస్తుందని అన్నారు.

" ఐక్యరాజ్యసమితి సభ్యులకు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ యుద్ధానికి అతి త్వరగా ముగింపు పలకాలి" అని కోరారు.

ఈ ప్రసంగంలో ఆయన చైనా - తైవాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతలు, తీవ్రవాదం, దేశాలెదుర్కొంటున్న రుణభారం గురించి ప్రస్తావించారు.

జైశంకర్

"యుక్రెయిన్ యుద్ధంలో భారత్ ఎవరి పక్షాన నిలుస్తుందని చాలాసార్లు ప్రశ్నించారు. భారత్ శాంతియుతమైన పక్షం వహిస్తుందని చాలాసార్లు స్పష్టం చేశాం. ఐక్యరాజ్య సమితి చార్టర్, వ్యవస్థాపక నియమాలకు కట్టుబడి ఉండేవారి పక్షాన నిలుస్తామని నిజాయితీగా చెప్పాం. చర్చలు, దౌత్యపరమైన విధానాల ద్వారా పరిష్కారం గురించి మాట్లాడే వారి తరుపున నిలబడతాం. నిత్యావసరాల కోసం ఇబ్బంది పడుతున్న వారి తరుపున నిలబడతాం" అని స్పష్టం చేశారు.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో సుస్థిరత, శాంతి స్థాపన విషయంలో భారత్ ఆందోళన చెందుతోందని అన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత ఆర్ధిక వ్యవస్థ పై తీవ్రమైన భారం పడిందని అన్నారు. శ్రీలంక ఆర్ధిక పరిస్థితి గురించి నేరుగా ప్రస్తావించనప్పటికీ, అభివృద్ధి చెందుతున్న దేశాల రుణ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు.

"భారత్ ప్రపంచాభివృద్ధికి తోడ్పడుతోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఆర్ధిక మందగమనాన్ని భారత్ గుర్తిస్తోంది.

ప్రపంచం ఇప్పటికే ఆర్ధిక పునరుద్ధరణకు సంబంధించి అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది" అని అన్నారు.

ఈ ప్రసంగంలో భారత్ భద్రతా మండలిలో సభ్యత్వం గురించి ఎప్పటి నుంచో చేస్తున్న డిమాండును మరోసారి లేవనెత్తారు. అయితే, దీని గురించి ఆయన నేరుగా మాట్లాడలేదు.

భారత్ ను బాధ్యతాయుతమైన దేశమని అంటూ భారత్ మరింత పెద్ద బాధ్యతలను మోసేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రపంచంలో దక్షిణాసియా దేశాలకు జరుగుతున్న అన్యాయాలను ప్రపంచం సరైన దృష్టితో చూసేందుకు భారత్ ప్రయత్నిస్తుందని అన్నారు.

ముఖ్యమైన అంశాల పై చర్చ నిజాయితీగా కొనసాగాలని అంటూ, ఐక్యరాజ్య సమితి విధాన వ్యూహాచరణ నుంచి అభివృద్ధి చెందిన దేశాలను మినహాయించకూడదని కోరారు.

ఐక్యరాజ్యసమితి చేపట్టే చర్యలకు ఆటంకం కలిగించే దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు.

ఈ చర్యలను వ్యతిరేకించేవారు అంతర్జాతీయ చర్చల ప్రక్రియను ఎప్పటికీ తేల్చకుండా ఉంచడం భావ్యం కాదని అన్నారు.

భద్రతా మండలిలో భారత్ తాత్కాలిక సభ్యత్వం త్వరలో ముగుస్తుందని అంటూ, భారత్ తన పదవీ కాలంలో "కౌన్సిల్ లో ఉన్న కొన్ని తీవ్రమైన అంశాల పరిష్కారానికి భారత్ ఒక వారధిలా వ్యవహరించింది" అని అన్నారు. సముద్రజలాల పరిరక్షణ, శాంతిస్థాపన, తీవ్రవాద వ్యతిరేక చర్యల గురించి భారత్ పాత్ర పోషించినట్లు చెప్పారు.

రష్యా, భారత్ విదేశాంగ మంత్రులు

భారత్ సభ్యత్వాన్ని సమర్ధించిన రష్యా

భారత్ కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని రష్యా నేరుగా మద్దతు పలికింది. భారత్‌తో పాటు బ్రెజిల్ పేరును కూడా రష్యా ప్రతిపాదించింది.

"కొన్ని దేశాలు భద్రతా మండలి అధికారాలను అణచివేస్తున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తున్న విషయం. భద్రతా మండలి, ఐక్యరాజ్య సమితి ఆధునిక కాలానికి తగినట్లుగా మారాలనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికన్ దేశాలకు కూడా ప్రాతినిధ్యం లభించేలా సమితి కార్యకలాపాలను ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలి" అని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ పిలుపునిచ్చారు.

https://twitter.com/sidhant/status/1573738188145037313

భారత్, బ్రెజిల్ అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషించగలవని అంటూ, ఈ దేశాలకు కౌన్సిల్ లో శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని కోరారు.

ఐక్యరాజ్యసమితి శాశ్వత సభ్యులను పెంచాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా అన్నారు.

బైడెన్

ఆధునిక ప్రపంచ అవసరాలు తీర్చే విధంగా భద్రతా మండలి రూపొందాల్సిన సమయం వచ్చిందని బైడెన్ అన్నారు.

భద్రతా మండలి సభ్యులు యూఎన్ చార్టర్ లో నియమాలకు కట్టుబడుతూ తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే వీటో అధికారాన్ని వాడాలని పిలుపునిచ్చారు. ఇలా ఉండటం వల్ల మాత్రమే కౌన్సిల్ సమర్ధవంతంగా నిలుస్తుందని అన్నారు.

అయితే, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం ఆయన ఏ దేశాల పేర్లనూ ప్రత్యేకంగా ప్రస్తావించలేదు.

భారత్ విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జై శంకర్ చేసిన ప్రసంగం సాహసోపేతంగా ఉందని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఇందులో సాహసం ఏముందని ప్రశ్నిస్తున్నారు.

"భారత్ ఎట్టకేలకు రష్యా చేస్తున్న దాడులను ఖండిస్తూ, శాంతికి, ఐక్యరాజ్యసమితి చార్టర్ కు కట్టుబడి ఉంటామని ప్రకటించింది. దీనిని సాహసోపేతమైన ప్రకటన అని అనలేం" అని అంతర్జాతీయ థింక్ ట్యాంక్ యూరోపియన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ కో చైర్ కార్ల్ బిల్ట్ అన్నారు.

https://twitter.com/carlbildt/status/1573754787065081856

చైనా, పాకిస్తాన్ దేశాల పై పరోక్ష దాడి

ఎస్.జైశంకర్ తన ప్రసంగంలో ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించలేదు. కానీ, పొరుగు దేశాలను ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడారు.

కొన్ని దశాబ్దాలుగా సీమాంతర తీవ్రవాదాన్ని భరించిన భారత్ తీవ్రవాదాన్ని అణచివేసే విధానాలను బలంగా సమర్థిస్తుందని అన్నారు.

"ఐక్యరాజ్యసమితి తీవ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలు, కుట్రలో భాగమైన వారి పై ఆంక్షలు విధిస్తుంది. కొన్ని దేశాలు తీవ్రవాదుల తరుపున నిలబడి ఐక్యరాజ్యసమితి 1267 ఆంక్షల విధానాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నాయి. దీని వల్ల ఆ దేశాలకు ఎటువంటి ప్రయోజనం ఉండకపోగా, వారి ప్రతిష్టను ఏ మాత్రం పెంచదు" అని అన్నారు.

జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్, చైనాను ఉద్దేశించి చేశారు.

ఇటీవల పాకిస్తాన్‌లో ఉన్న తీవ్రవాదులకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి జారీ చేసిన తీర్మానాలను నిరోధించేందుకు చైనా తన అధికారాలను వినియోగించుకుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
UN General Assembly: Indian Foreign Minister Jaishankar criticizes China and Pakistan without mentioning them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X