కరోనా సెకండ్ వేవ్: మరోసారి భారత ఆర్థిక వ్యవస్థకు దెబ్బ, పెరగనున్న నిరుద్యోగిత రేటు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో మరోసారి కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. దీంతో మరోసారి పలువురు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత సంవత్సరం కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడిన విషయంతెలిసిందే.
ముంబైకి చెందిన థింక్ ట్యాంక్ సంస్థ దేశంలో మరోసారి నిరుద్యోగిత రేటు మరింతగా పెరుగనుందని పేర్కొంది. ఈ మేరకు వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ విడుదల చేసింది. సీఎంఐఈ డేటా ప్రకారం వారం క్రితం 6.7 శాతంగా ఉన్న నిరుద్యోగితా రేటు.. ఏప్రిల్ 11తో ముగిసిన వారానికి 8.6 శాతానికి చేరుకుంది.

వలస కార్మికులు గత కొద్ది రోజులుగా తమ స్వస్థలాలకు చేరుకుంటున్న క్రమంలో పట్టణ నిరుద్యోగిత కూడా భారీగా పెరగనుంది. ఇది సుమారు 10 శాతానికి చేరుతోంది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. అక్కడ మరోసారి లాక్ డౌన్ విధించే పరిస్థితులు కూడా ఉన్నాయి.
ఈ వారం రోజుల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విషయంపై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు కర్ఫ్యూలు, ఆంక్షలను విధిస్తున్న విషయం తెలిసిందే. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతున్నాయి.
భారతదేశంలో సోమవారం ఒక్కరోజే 1.6 లక్షల కేసులు నమోదు కావడంతో ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులున్న జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌ను మనదేవం వెనక్కి నెట్టి ఆ స్థానంలో చేరిపోయింది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం వ్యాపార, వాణిజ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీంతో ఉద్యోగాలు భారీ ఎత్తున కోల్పోయే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.
గత సంవత్సరం కరోనా కట్టడికి విధించిన లాక్ డౌన్ కారణంగా పరిశ్రమలు, వ్యాపార రంగం భారీగా దెబ్బతింది. అనేక మంది ఉద్యోగాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వలస కూలీల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయని అంటున్నారు నిపుణులు.












Click it and Unblock the Notifications