తెలంగాణపై కేంద్రం వరాలు-పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ, కృష్ణా ట్రైబ్యునల్-గ్యాస్ పై మరో వంద సబ్సిడీ..
అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణపై కేంద్ర కేబినెట్ ఇవాళ వరాల జల్లు కురిపించింది. నిజామాబాద్ లో నిన్న ప్రధాని మోడీ పర్యటనలో ఇచ్చిన వరాలకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అలాగే దేశవ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లకు తాజాగా ప్రకటించిన రూ.200 రాయితీకు తోడు మరో రూ.100 రాయితీగా ఇవ్వాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ఇవాళ ఢిల్లీ సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణకు పలు వరాలు ప్రకటించింది. ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పసుపు బోర్డుతో పాటు సమ్మక్క-సారలమ్మ కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ-తెలంగాణ మధ్య కృష్ణా జల వివాదాల నేపథ్యంలో కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చడంతో పాటు వివాదాల పరిష్కారానికి టైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రివర్గ భేటీ అనంతరం కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి కొత్తగా తమ వాటా తేల్చాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రస్తు, భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందన్నారు.
మరోవైపు ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లపై గతంలో రూ.200 తగ్గించిన కేంద్రం.. ఇవాళ మరో రూ.100 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్లపై మొత్తం రూ.300 తగ్గింపు లభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉజ్వల గ్యాస్ సిలెండర్ ధర రూ.903 నుంచి రూ.603కు తగ్గిపోయింది.












Click it and Unblock the Notifications