వెంకయ్యకు సెగ: ఎపి వదిలేసి కర్ణాటక గ్రామం దత్తత
బెంగళూరు: కేంద్రపట్టణాభివృద్ది శాఖ మంత్రి ఎం. వెంకయ్య నాయుడు కర్ణాటకలోని ఒక గ్రామ పంచాయితీని దత్తత తీసుకుని అభివృద్ది చెయ్యడానికి సిద్దమయ్యారు. బెంగళూరు గ్రామీణ జిల్లా కెంపేగౌడ అంతర్జాతీయ సమీపంలోని యలియూరు గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దేవనహళ్ళి తాలుకాలోని యలియూరు గ్రామ పంచాయితీలోని గ్రామాలలో శుక్రవారం వెంకయ్యనాయుడు పర్యటించారు. కర్ణాటక నుంచే వరుసగా ఆయన రాజ్యసభకు ఎంపికవుతున్నారు. దీంతో ఎపిలో గ్రామాన్ని దత్తతకు తీసుకోవాలనే వెంకయ్య నాయుడి ఆలోచనను కర్ణాటకవాసులు వ్యతిరేకించారు. దీంతో ఆయన కర్ణాటక గ్రామంవైపే మొగ్గు చూపారు.
గ్రామస్తులు, గ్రామ పెద్దలను పిలిపించి అక్కడ ఉన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. వెంటనే యలియూరు గ్రామ పంచాయితీ పరిధిలోని 8 గ్రామాలలో అన్ని సమస్యలు పరిష్కరించాలని వెంకయ్యనాయుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యలియూరుతో పాటు ఐదు గ్రామాలలో వెంకయ్యనాయుడు పర్యటించారు. గ్రామస్తులకు ఏమి అవసరం అని తెలుసుకున్నారు. యలియూరు గ్రామ పంచాయితీలోని అన్ని గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దుతానని వెంకటయ్య నాయుడు తెలిపారు.

యలియూరు గ్రామ పంచాయితీలోని అన్ని గ్రామాలలో తాగు నీటి సమస్య రాకుండ చూడాలని అధికారులకు సూచించారు. పట్టణాలు, గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ది చెయ్యాలని ప్రధాని నరేంద్ర మోది సూచించారని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. అందులో భాగంగా జనధన్, ఆదర్శ గ్రామ, స్మార్ట్ సిటి లాంటి పతకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. మోది ఆదేశాల మేరకు తాను యలియూరు గ్రామ పంచాయితీని దత్తత తీసుకున్నానని వెంకయ్య నాయుడు వివరించారు. వచ్చే సంవత్సరం ఉత్తర కర్ణాటకలోని కోప్పల జిల్లాలోని గ్రామాన్ని దత్తత తీసుకుంటానని వెంకయ్య నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో ఎలా దత్తత తీసుకుంటారు........ ?
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాన్ని దత్తత తీసుకుంటానని ఇటివల ప్రకటించారు. ఈ ప్రకటనతో సోంత పార్టీలో వెంకయ్య నాయుడి మీద నిరసన వ్యక్తం అయ్యింది. కర్ణాటక నుండి వరుసగా మిమ్మల్ని రాజ్యసభకు పంపిస్తున్నామని, ఎంపీ నిధులతో మీరు ఇక్కడ ఉన్న గ్రామాలను ఎందుకు అభివృద్ది చెయ్యరని నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్బంలో బీజేపీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు ప్లహ్లాద్ జోషి జోక్యం చేసుకుని ఎంపీలు, శాసన సభ్యులకు నచ్చ చెప్పారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కర్ణాటకలోని గ్రామాలనే దత్తత తీసుకుని అభివృద్ది చేస్తారని సర్ది చెప్పారు. తరువాత వెంకయ్య నాయుడు ఆయన మనస్సు మార్చుకుని దేవనహళ్ళి తాలుకాలోని యలియూరు గ్రామ పంచాయితీని దత్తత తీసుకున్నారు. ఎలాంటి ఎన్నికలలో పోటి చెయ్యని వెంకయ్య నాయుడు వరుసగా కర్ణాటక నుండి రాజ్యసభకు ఎన్నిక అవుతున్నారు.












Click it and Unblock the Notifications