
కంగనా రనౌత్ కు వై-ప్లస్ సెక్యూరిటీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందన
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి సెక్యూరిటీ అందించడంపై రకరకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివసేన పైన కంగనా విరుచుకు పడటానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కారణమని, అందుకే ఆమెకు వై ప్లస్ సెక్యూరిటీ కల్పించిందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అసలు ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత అవసరమా అని పలువురు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారు. దీనిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.
కంగనా వర్సెస్ ఉద్ధవ్: కూల్చిన భవనం పునర్నిర్మించనన్న కంగనా.. భగత్ సింగ్ ను తలపించావన్న విశాల్

కంగనా తండ్రి అభ్యర్ధన మేరకే వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ
కంగనా రనౌత్ కి సంబంధించి ఆమె భద్రత కోసం ఆమె తండ్రి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించిన తరువాత బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు వై-ప్లస్ సెక్యూరిటీ కవర్ అందించినట్లు కేంద్ర హోంమంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్రలో కొంతమందికి ఆగ్రహం తెప్పించే సామాజిక సమస్యలపై , సుశాంత్ సింగ్ రాజ్ పూత్ సూసైడ్ ,నెపోటిజం వంటి అంశాలపై కంగనా రనౌత్ స్పందిస్తోందని కంగనా తండ్రి తెలిపారు. తన కుమార్తెకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని కోరిన నేపధ్యంలో ఆమెకు వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించామని చెప్పారు .

హిమాచల్ ప్రదేశ్ సీఎం ను కలిసిన కంగనా తండ్రి , సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రం నిర్ణయం
తన కుమార్తె భద్రత గురించి కంగనా తండ్రి హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ కు ఒక లేఖ రాశారు. ఆయన నేరుగా సిఎంను కూడా కలుసుకుని తన కుమార్తెను వేధింపులకు గురిచేస్తున్నారని మెమోరాండం సమర్పించారు. ఆయన అభ్యర్థన ఆధారంగా హిమాచల్ ప్రదేశ్ సిఎం కంగనా రనౌత్ పరిస్థితి గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చారు.
ముంబై ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ ను ముంబైకి తిరిగి రాకూడదని పలువురు శివసేన నాయకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమెకు ప్రాణహాని ఉందని ఆమె కుటుంబ సభ్యులతో పాటుగా, ఆమెకు మద్దతు తెలిపిన వారంతా ఆందోళన వ్యక్తం చేశారు.

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ సూసైడ్ నుండి కొనసాగుతున్న కంగనా ఫైట్
ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి విజ్ఞప్తి మేరకు కంగనా రనౌత్ కు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించినట్లు గా తెలుస్తుంది. జూన్లో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య, ఆ తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో కంగనా రనౌత్ బాలీవుడ్ ప్రముఖుల పాత్ర పై, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. అప్పటినుండి ఇప్పటివరకు ఆమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో, మహారాష్ట్ర ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు.

రాజకీయ రంగు పులుముకున్న కంగనా వివాదం
కంగనా చేస్తున్న వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకుంటున్న మహాసర్కార్ ముంబైలోని ఆమె భవనంలో నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేశారని బీఎంసీ అధికారులతో కూల్చివేతకు దిగారు. కోర్టు స్టే ఇవ్వడంతో కూల్చివేతను నిలిపివేసినా, ఆ తర్వాత కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరింత రాజకీయ దుమారానికి కారణమయ్యాయి. కంగనా రనౌత్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న వర్గం ఆమెకు వై ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించడంపై విమర్శిస్తున్న సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించడానికి గల కారణాలను వివరించారు.