UP polls: ప్రశాంతంగా ముగిసిన ఐదో దశ పోలింగ్, 53.93 శాతం ఓటింగ్ నమోదు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆదివారం ఐదో దశ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. అవధ్, పూర్వాంచల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 12 జిల్లాల్లోని 61 నియోజకవర్గాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి.
మొత్తం 692 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ప్రయాగ్‌రాజ్, అమేథీ, రాయ్ బరేలీ, అయోధ్య వంటి కీలక జిల్లాల్లో ఈ దఫా పోలింగ్ జరిగింది. అత్యధికంగా చిత్రకూట్ జిల్లాలో 59.64 శాతం ఓటింగ్ నమోదైంది. 58.01 శాతంతో ఆ తర్వాతి స్థానంలో అయోధ్య నిలిచింది. ప్రతాప్ గఢ్ జిల్లాలో అత్యల్పంగా 50.25 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సిరతు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న యూపీ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. ప్రయాగ్ రాజ్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. మరోవైపు, అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కుందా స్థానంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి గు్లషన్ యాదవ్ కాన్వాయ్ పై కొందరు దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో గుల్షన్ యాదవ్ తప్పించుకున్నారు. ఈ దాడిలో కాన్వాయ్ లోని ఓ వాహనం ధ్వంసమైంది.
కాగా, యూపీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ కూడా విస్తృతంగానే ప్రచారం చేస్తోంది. అయితే, యూపీలో బీజేపీ, ఎస్పీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. తమదే అధికారం అంటూ బీజేపీ, ఎస్పీ నేతలు ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజుతో ఐదు దశలు ముగిశాయి. మార్చి 3, 7 తేదీల్లో ఆరు, ఏడో దశ పోలింగ్ జరగనుంది. మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications