Ambulance: అంబులెన్స్ కు అడ్డంగా బిజెపి నేత కారు.. చనిపోయిన రోగి.. పైగా బెదిరింపులు..
ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మన వాహనం వెనకాల అంబులెన్స్ వస్తే దానికి దారి ఇవ్వాలి. నిబంధనల ప్రకారం కాకున్నా.. కనీసం మానవత్వంతో అంబులెన్స్ కు దారి ఇవ్వాలి. కానీ ఉత్తర ప్రదేశ్ లో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ రాజకీయ నాయకుడు అంబులెన్స్ కు దారి ఇవ్వకుండా రోడ్డు పై కారు పార్క్ చేశాడు. దీంతో అంబులెన్స్ లో ఉన్న రోగి చనిపోయాడు. ఈ ఘటనలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పైగా సదరు నేత బాధితులను బెదిరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాకు చెందిన సురేష్ చంద్ర అనే వ్యక్తికి గత శనివారం ఛాతీ నొప్పి వచ్చింది. వెంటనే స్థానిక ఆస్పత్రికి వెళ్తే అక్కడి వైద్యుడు అతన్ని లక్నో ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీంతో వారు అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రి నుంచి బయలుదేరారు. దారిలో బీజేపీ నేత ఉమేష్ మిశ్రా రోడ్డుపై తన వ్యాగన్ఆర్ కారును నిలిపి వెళ్లిపోయాడు. దీంతో అంబులెన్స్ అక్కడి నుంచి ముందుకు కదలలేకపోయింది.

సుమారు 30 నిమిషాల పాటు అంబులెన్స్ నిలిచిపోవాల్సి వచ్చింది. మరోవైపు సురేష్ చంద్ర నొప్పితో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఎట్టకేలకు కారు వద్దకు వచ్చిన ఉమేష్ మిశ్రా బూతులు తిడుతూ కారు పక్కకు తీశాడు. అప్పుడు అంబలెన్స్ కదిలింది. కానీ అప్పటికే సురేష్ చంద్ర చనిపోయారు. దీనిపై ఉమేష్ మిశ్రాను ప్రశ్నించగా బెదిరింపులకు దిగాడని తెలిసింది. తాను బీజేపీ నాయకుడని, బ్లాక్ చీప్ రాంకింకర్ పాండే సోదరుడని చెప్పాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని లేకుంటే కేసుల్లో ఇరికిస్తానని బెదిరించాడు.
ఆ తర్వాత అతను కారులో పరారయ్యాడు. కాగా ఉమేష్ మిశ్రా బాధితులను బెదిరిస్తుండగా పోలీసులు అక్కడే ఉండడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఇందుకు సంబంధించి విచారణ చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications