పీఎఫ్ఐ మద్దతుదారుల్ని తరిమికొట్టండి-కన్నడ ఓటర్లకు యోగీ పిలుపు...
కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఇవాళ్టితో శుభంకార్డు పడబోతోంది. ఇప్పటికే ఎన్నికల్లో గెలుపు కోసం సర్వశక్తులొడుతున్న ప్రధాన పార్టీలు, వాటి స్టార్ క్యాంపెయినర్లు మరింత స్పీడు పెంచారు. ఎన్నికల్లో గెలుపు కోసం పనికొచ్చే ఏ చిన్న విషయాన్నీ వదలడం లేదు. తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా బజరంగ్ దళ్, పీఎఫ్ఐలపై చేసిన ప్రకటనను తప్పుబడుతూ బీజేపీ నేతలు ఓటర్లలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదే క్రమంలో కర్నాటక ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ గా వచ్చిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. తమకు అధికారమిస్తే బజరంగ్ దళ్ ను, పీఎఫ్ఐని నిషేధిస్తామని కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఘాటు కౌంటర్ ఇచ్చారు. జాతీయవాదులంతా ఏకం కావాలని పిలుపునిస్తున్నారు. జాతీయవాదులు ఏకమై పీఎఫ్ఐ మద్దతుదారుల్ని తరిమి కొట్టాలని యోగీ ఓటర్లకు పిలుపునిచ్చారు.

కర్ణాటకలో జరగనున్న ఎన్నికల్లో నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) మద్దతుదారులను ఏకం చేసి దుమ్ము దులపాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జాతీయవాదులను కోరారు. గత కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాలపై యోగీ విమర్శలు ఎక్కుపెట్టారు. ఒక వైపు వారు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లడానికి పిఎఫ్‌ఐ వంటి భారత వ్యతిరేక సంస్థను ఎంచుకున్నారని, మరోవైపు భజరంగ్ దళ్ వంటి జాతీయ, సామాజిక సేవకు అంకితమైన, హనుమంతుడికి అంకితమైన సంస్థపై నిషేధం విధించాలనుకుంటున్నారని విమర్శించారు. ఇది హిందూ విశ్వాసాన్ని అగౌరవపరచడమేనని, దీనిని ఏ జాతీయవాది సహించరన్నారు.
కర్నాటకలోని కొప్ప (చిక్కమగళూరు), పుత్తూరు (దక్షిణ కన్నడ), హొన్నవర (ఉత్తర కన్నడ)లో ఆయా బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతూ మారథాన్ ఎన్నికల ర్యాలీలు నిర్వహించిన యోగీ ఆదిత్యనాథ్.. పుత్తూరు (దక్షిణ కన్నడ), కర్కల (ఉడిపి), బంట్వాల్ (దక్షిణ కన్నడ)లలో కూడా భారీ రోడ్‌షోలు నిర్వహించారు. కర్నాటక, దేశాభివృద్ధికి కాంగ్రెస్, జేడీఎస్ అడ్డుగోడలుగా మారాయని ప్రధాని మోదీ నేతృత్వంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అభివృద్ధి పనులను శరవేగంగా చేపడుతోందని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందని యోగీ తెలిపారు.












Click it and Unblock the Notifications