సిఎం అభ్యర్థి రాజ్‌నాథ్?: బిజెపికి మరో "మహా" ముప్పు

యుపి సిఎం అభ్యర్థిగా రాజ్‌నాథ్ సింగ్‌ను బిజెపి ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో బిజెపికి మరో మహా కూటమి ముప్పుగా పరిణమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సిఎం అభ్యర్థిని ప్రకటించకుండానే ముందుకు సాగాలని తలపోసిన బిజెపి నాయకత్వం అంతర్మథనంలో పడింది. అధికార సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) కుమ్ములాటల్లో సిఎం అఖిలేశ్ యాదవ్ గ్రూపునే అసలుసిసలైన ఎస్‌పిగా గుర్తించడంతోపాటు సైకిల్ గుర్తును కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు కేటాయించడంతో ఏం చేయాలో కమలనాథులకు తోచడం లేదు.

దీనికి తోడు ప్రధాని నరేంద్రమోడీ సారథ్యంలోని బిజెపిని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, అజిత్ సింగ్ ఆధ్వర్యంలోని రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డి), శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)లతో కూడిన కూటమి ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నారు యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్. ఇదే బిజెపి నాయకత్వాన్ని కలవర పెడుతున్నది. బీహార్‌లో సిఎం నితీశ్‌కుమార్ సారథ్యంలోని యునైటెడ్ జనతాదళ్, మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ నేత్రుత్వంలోని రాష్ట్రీయ జనతా పార్టీ (ఆర్‌జెడి), కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో మహా కూటమి చేతిలో కమలనాథులు ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

అన్ని విధాల ఇబ్బందులను అధిగమిస్తూ పార్టీని తన ఆధీనంలోకి తీసుకున్న యుపి సిఎం అఖిలేశ్ యాదవ్.. అమర్ సింగ్, తన బాబాయి శివ్‌పాల్ సింగ్ యాదవ్ తన చేతులు కట్టేశారన్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. ప్రతి ప్రభుత్వంపైనా మాదిరిగానే అఖిలేశ్ పాలన మీద కూడా ప్రభుత్వ వ్యతిరేకత సహజమేనంటూ తాను చేపట్టిన అభివ్రుద్ధి కార్యక్రమాల ప్రాతిపదికన ప్రజాతీర్పు కోరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు యుపిలో శాంతిభద్రతలు, అన్ని రంగాల్లో అఖిలేశ్ సర్కార్ వైఫల్యం అనే ప్రచారాస్త్రాలతో ముందుకు సాగాలని తలపోస్తున్న బిజెపికి తాజా పరిస్థితులు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.

UP Election 2017: Why The BJP Should Worry About SP-Cong-RLD Alliance

అఖిలేశ్ క్లీన్ ఇమేజ్

పార్టీ ఎన్నికల గుర్తు 'సైకిల్' గెలుచుకోవడంతో అఖిలేశ్ పరిశుద్ధ రాజకీయాలకు శ్రీకారం చుట్టారని కమలనాథులు సైతం ప్రైవేట్ చర్చల్లో అంగీకరిస్తున్నారు. యూపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడమే ప్రధాన సమస్యగా మారిందంటున్న కమలనాథులు.. ఇప్పటికే చాలా ఆలస్యమైందని పేర్కొంటున్నారు. పార్టీలోని అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిగా ప్రస్తుత హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు మాత్రమేని చెప్తున్నారు. కానీ ఆయన మాత్రం తనకు ఆసక్తి లేదని పదేపదే తేల్చి చెప్పారు.

పట్టణ, కుల, వర్గాల ఓటు కొల్లగొట్టనున్న మహా కూటమి?

సమాజ్‌వాదీ, కాంగ్రెస్, ఆర్‌ఎల్‌డి, ఎన్‌సిపిలతో కూడిన మహా కూటమి ఏర్పాటుతో పట్టణ ప్రాంత ఓటర్లతోపాటు కులాల వారీగా, వర్గాల వారీ ఓటు బ్యాంక్ ను తిప్పుకునే దిశగా యత్నిస్తున్న అఖిలేశ్ వ్యూహం కూడా బిజెపిని కలవరపెడుతున్నది. ఇంకో గమ్మత్తైన అంశమేమిటంటే గత నెల 29న అఖిలేశ్ యాదవ్ 235 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతోపాటు పలు పట్టణ ప్రాంత అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ నేతల కోసం వదిలేశారని సమాజ్‌వాదీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

రాజ్‌నాథ్ పై కాంగ్రెస్ పార్టీకి రెండోస్థానం

2014 లోక్‌సభ ఎన్నికల్లో 71 స్థానాల్లో బిజెపి విజయం సాధిస్తే.. పలు పట్టణ ప్రాంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలువడం గమనార్హం. హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రీటా బహుగుణ జోషి (ప్రస్తుతం ఆమె బిజెపిలో చేరారు. అది వేరే సంగతి.) 27 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలువడం గమనార్హం.

ఎంఎంజోషిపై జైస్వాల్ సెకండ్ ప్లేస్

బిజెపి సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ఎన్నికైన కాన్పూర్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ ప్రకాశ్ జైస్వాల్ 2.51 లక్షల ఓట్లతో రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుత యుపి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పోటీచేసిన ఘజియాబాద్‌లోనూ, షహరాన్‌పూర్‌లో బిజెపి నేత రాఘవ్ లఖన్ పాల్‌పై ఇమ్రాన్ మసూద్ పై స్వల్ప మెజారిటీతో ఓటమి పాలయ్యారు.

మథురలో జయంత్ చౌదరికి రెండోస్థానం

మథుర స్థానం నుంచి పోటీచేసిన కాంగ్రెస్ మిత్రపక్షం ఆర్ఎల్డీ అభ్యర్థి జయంత్ చౌదరి రెండోస్థానంలో నిలిచారు. ఈ స్థానంలో బీజేపీ నుంచి పోటీ చేసిన బాలీవుడ్ కథా నాయిక హేమమాలిని విజయం సాధించారు. మథుర అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత ప్రదీప్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బారాబంకిలోనూ కాంగ్రెస్ ప్రముఖ నేత పిఎల్ పునియా.. ఖుషీనగర్ స్థానంలో ఆర్పీఎన్ సింగ్ 30% ఓట్లతో రెండోస్థానంతో సరిపెట్టుకున్నారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 28 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ.. వాటిల్లో 13 సెగ్మెంట్లు పట్టణ ప్రాంతాల్లోనివే. షమ్లీ, హపూర్, ఖుర్జా, మథుర, లక్నో కంటోన్మెంట్, అలహాబాద్ నార్త్ వాటిల్లో ముఖ్యమైనవి.

2016 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బిజెపికి మూడోస్థానం

దేవ్‌బండ్ అసెంబ్లీ స్థానానికి జరిగిన 2016 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేత మావియా అలీ విజయం సాధించారు. రెండోస్థానంలో ఎస్పీ అభ్యర్థి మీనా రాణా నిలిస్తే, మూడో స్థానంతో బిజెపి సంత్రుప్తి పడింది.

ముస్లిం ఓటింగ్ పై కమలనాథుల్లో ఆందోళన

ముస్లింలు అత్యధికంగా ఓటర్లుగా ఉన్న పట్టణాలు, నగర ప్రాంతాల్లో కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పీ పార్టీలు ముస్లింలను పోటీలో పెడితే ఎదుర్కోవడం ఎలా? అన్నది కమలనాథుల్లో ఆందోళన నెలకొన్నది. ఇప్పటివరకు మహా కూటమి ఏర్పాటు కాకపోతే ముస్లింల ఓట్లు చీలిపోతాయని, తద్వారా తాము లబ్ధి పొందొచ్చనని బిజెపి, కమలనాథులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. సహరాన్ పూర్ సిటీలో 46 శాతం ముస్లింల జనాభా ఉన్నా బిజెపి 2012లో విజయం సాధించగలిగింది. కానీ ముస్లింల ఓటు చీలకుంటే ఎలా అన్న భయం బిజెపికి పట్టుకున్నది.

నోట్ల రద్దు తర్వాత బనియాల్లో మార్పు

సంప్రదాయంగా బిజెపికి పట్టణాల్లోని వ్యాపార వర్గాలు, వాటి కుటుంబాలు బాసటగా నిలిచేవి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత పెద్ద నగరాల పరిధిలో మూడో వంతు జనాభా వ్యాపార వర్గాలదే. నోట్ల రద్దు తర్వాత తాము ఎదుర్కొన్న ఇబ్బందుల నేపథ్యంలో బనియాలు మహా కూటమి వైపు మళ్లుతారా? అన్న సందేహాలు కమలనాథుల్లో వ్యక్తమవుతున్నాయి. ఇంతకుముందు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై వ్యాపార వర్గాలు ఎస్పీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించేవారు.

'కమలానికి' బనియాలు, బ్రాహ్మణులు దూరం అవుతారా?

పేదల అభ్యున్నతి కోసం నరేంద్రమోదీ సర్కార్ అమలుచేస్తున్న విధానాలు బ్రాహ్మిణ్, బనియా సామాజిక వర్గాన్ని బిజెపికి దూరం చేశాయన్న విమర్శ కూడా ఉన్నది. పేదల సంక్షేమ పథకాల అమలు పేరుతో బ్రాహ్మణులు, బనియాలు, ఇతర వ్యాపార వర్గాలపై ఆధారపడకుండా ఓటుబ్యాంక్ పెంచుకోవాలని ప్రధాని మోడీ, అధికార బిజెపి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడతాయని భావిస్తున్నారు. గతంలో ఇందిరాగాంధీ 'గరీబీ హఠావో' నినాదం తర్వాత కులాల వారీగా ఓటర్లు చీలిపోయారు. తిరిగి 1980వ దశకంలో మండల్ రాజకీయాలు రంగ ప్రవేశం చేసిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. 1985లో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 269 స్థానాలతో మొదటి స్థానంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీ, మండల్ రాజకీయాల తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో 94 స్థానాలకు పడిపోయింది. ప్రస్తుత సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ సారథ్యంలో జనతాదళ్ పార్టీ 208 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. తొలిసారి ములాయం సింగ్ యాదవ్ సిఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+