ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం కోటా: యూపీ వుమెన్స్ మేనిఫెస్టో అంటూ ప్రియాంక గాంధీ హామీలు
లక్నో: వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహిళల కోసం అధిక ప్రాధాన్యతను ఇస్తామంటూ ప్రకటనలు చేసిన ఆమె.. తాజాగా, మహిళల కోసం మేనిఫెస్టోను ప్రకటించారు.
ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీ(కాంగ్రెస్) గెలిస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం కోటా కల్పిస్తామని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం హామీ ఇచ్చారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేశారు. కాంగ్రెస్ యూపీ వ్యవహారాల ఇంచార్జ్ ప్రియాంక మాట్లాడుతూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఈ మేనిఫెస్టో ఒక రోడ్‌మ్యాప్ అని అన్నారు.
ఎన్నికల పత్రంలో మహిళలపై ప్రత్యేక దృష్టి సారించి వారికి సాధికారత కల్పించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు 40 శాతం టిక్కెట్ ఇస్తుందని ఆమె పునరుద్ఘాటించారు.

'మేము 'మహిళా మేనిఫెస్టో'ని తయారు చేశాము, అక్కడ మేము వారికి సాధికారత కల్పించాలనుకుంటున్నాము. వారి అభిప్రాయంతో సంకెళ్ళు తెంచుకునే వాతావరణాన్ని మేము సృష్టించాలి, ఇక్కడ వారు రాజకీయాలలో, దోపిడీని అంతం చేసే సమాజంలో భాగస్వామ్యం పొందుతారు' అని ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 25 నగరాల్లో హాస్టళ్లను నిర్మిస్తుందని, బాలికల కోసం సాయంత్రం పాఠశాలలను తెరుస్తుందని ప్రియాంక అన్నారు. గ్రాడ్యుయేట్ బాలికలకు స్కూటీలు, 12వ తరగతి పాసైన బాలికలకు స్మార్ట్‌ఫోన్లు అందజేస్తామని ఆమె తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్‌ఎన్‌ఇఆర్‌జిఎలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని కాంగ్రెస్ నేత ప్రియాంక స్పష్టం చేశారు.
కాగా, వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రియాంక గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్న పార్టీ తమదేనని చెబుతున్నారు. ఈసారి సమాజ్ వాదీ పార్టీతో పొత్తు లేకుండానే ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications