యూపీలో నాలుగు రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ పర్యటన; గోరఖ్ పూర్ పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ఢిల్లీ ముఖ్యమంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఐదు రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నుండి ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. సోమవారం నుండి ఆయన తన నాలుగు రోజుల పర్యటనను ప్రారంభించారు. అరవింద్ కేజ్రివాల్ పర్యటనపై పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్ ప్రజల కోసం తన పార్టీ దార్శనికతను తెలియజేయడం కోసం ఉత్తర ప్రదేశ్ పర్యటనలో పాల్గొననున్నారని వెల్లడించారు.

అరవింద్ కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్ పర్యటన .. నాలుగు రోజుల పాటు ఎన్నికల ప్రచారం
ఎన్నికల పోటీలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా, ఆయన పర్యటన ప్రజల మద్దతును మరింత పెంచుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లో అరవింద్ కేజ్రీవాల్ పర్యటన గురించి తెలియజేస్తూ, పార్టీ అధికార ప్రతినిధి వైభవ్ మహేశ్వరి మాట్లాడుతూ, ఢిల్లీ ముఖ్యమంత్రి రాష్ట్ర రాజధాని ఖైసర్‌బాగ్ ప్రాంతంలో బహిరంగ సభతో తన పర్యటనను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

గోరఖ్ పూర్ లోనూ పర్యటించనున్న కేజ్రీవాల్
తరువాత బారాబంకి, ప్రయాగ్‌రాజ్ మరియు గోరఖ్‌పూర్‌తో సహా అనేక ఇతర ప్రాంతాలను సందర్శిస్తారని చెప్పారు. తన పర్యటన సందర్భంగా, అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీ యొక్క అనేక ఎన్నికల సంబంధిత కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నారని వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఆయన వెంట పార్టీ ఉత్తరప్రదేశ్ ఇన్‌ఛార్జ్ సంజయ్ సింగ్ మరియు ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ నుండి ముగ్గురు నుండి నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉంటారని సమాచారం.

గోరఖ్ పూర్ నుండి బరిలో యోగి.. కేజ్రీవాల్ పర్యటనపై ఆసక్తి
ముఖ్యంగా, గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుండి బిజెపి నాయకుడు మరియు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై ఆప్ విజయ్ కుమార్ శ్రీవాస్తవను పోటీకి దింపడంతో కేజ్రీవాల్ గోరఖ్‌పూర్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అక్కడ కేజ్రీవాల్ ఏం మాట్లాడతాడు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పంజాబ్ ఎన్నికల్లో బలమైన ప్రత్యర్ధిగా నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ యూపీ ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.

లక్నోలో, బారాబంకిలో ఎన్నికల బహిరంగ సభలో అరవింద్ కేజ్రీవాల్
ఆమ్ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పేర్కొన్నట్లుగా, కేజ్రీవాల్ సోమవారం లక్నోలో మధ్యాహ్నం ఒక బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. మరియు తరువాత సాయంత్రం 4 గంటలకు బారాబంకిలో మరో కార్యక్రమంలో ప్రసంగిస్తారు. కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్ పర్యటన నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మొత్తం 403 స్థానాల్లో పోటీ చేస్తోంది.

యూపీ ఎన్నికలపై ఆప్ ఫోకస్.. పలు హామీలు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల పై ఫోకస్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా ఉత్తర ప్రదేశ్లో బీజేపీ తో పాటుగా, సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ లను కూడా ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రజలను ప్రసన్నం చేసుకోవడానికి మేనిఫెస్టోలో అనేక అంశాలను వెల్లడించిన ఆమ్ ఆద్మీ పార్టీ 300 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతుల అన్ని రుణాల మాఫీ, గ్రామ, మొహల్లా క్లినిక్‌ల ఏర్పాటు, విధి నిర్వహణలో మరణించిన సాయుధ బలగాల బంధువులకు మరియు కోవిడ్-19 డ్యూటీలో మరణించిన వారికి పరిహారం ఇస్తామని ప్రకటించింది.

ఎన్నికల మ్యానిఫెస్టోలో పలు కీలక అంశాలు
రాష్ట్ర బడ్జెట్‌లో 25 శాతం విద్యకు కేటాయిస్తూ విద్యావ్యవస్థను మెరుగుపరుస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ హామీ ఇచ్చింది.రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు ప్రతి మహిళకు నెలకు రూ.1000 ఆర్థిక భరోసా ఇస్తామని పేర్కొంది . అలాగే నెలకు రూ. 5000 నిరుద్యోగ భృతి, ప్రతి సంవత్సరం 10 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరణ, అంతేకాకుండా, ఉత్తరప్రదేశ్‌లో 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలోని యువకులకు రిజర్వ్ చేయబడతాయని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పడిన ఒక నెలలోపు 97,000 ఉపాధ్యాయ పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేయబడుతుందని వెల్లడించింది.












Click it and Unblock the Notifications