విజయ్ మాల్యాకు మన్మోహన్ సింగ్ బ్యాంకు గ్యారెంటీ
ఉత్తరప్రదేశ్: వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో రుణం తీసుకుని, రుణాలు చెల్లించకుండా బ్యాంకు అధికారులను ముప్పుతిప్పలు పెట్టి హాయిగా బ్రిటన్ లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది.
ఆయన తీసుకున్న అప్పుల్లో బ్యాంకు గ్యారెంటీగా మన్మోహన్ సింగ్ ఉన్నాడని వెలుగు చూసింది. ఆ మన్మోహన్ సింగ్ మన మాజీ ప్రధాని మాత్రం కాదు. ఉత్తరప్రదేశ్ లోని ఓ మధ్య తరగతి రైతు పేరు మన్మోహన్ సింగ్. మాల్యా రుణం చెల్లించే వరకు మన్మోహన్ సింగ్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశామని బ్యాంకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్ లోని పిలిఖిత్ కు చెందిన మన్మోహన్ సింగ్ కు 8 ఎకరాల భూమి ఉంది. ఆయనకు బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులో రెండు ఖాతాలు ఉన్నాయి. ఈ ఖాతాల్లో దాదాపు రూ. నలుగు లక్షలు డిపాజిట్ చేశారు. మల్యాకు రైతు మన్మోహన్ సింగ్ గ్యారెంటీగా ఉన్నారని ముంబై హె డ్ ఆఫీస్ బ్యాంకు అధికారులు తెలుసుకున్నారు.

వెంటనే మన్మోహన్ సింగ్ ఖాతాలు సీజ్ చెయ్యాలని, ఆయనకు వస్తున్న అన్ని ప్రయోజనాలు నిలిపివేయాలని స్థానిక బ్రాంచ్ బ్యాంకు అధికారులకు ఆదేశాలు అందాయి. అంతే బ్యాంక్ ఖాతాలు సీజ్ చేశారు. మన్మోహన్ సింగ్ తన భూమిలో గోదుమ పంట వేశారు. గిట్టుబాటు ధర రావాలంటే బ్యాంకు ఖాతా ఉండాలి.
బ్యాంకు ఖాతాలు సీజ్ చెయ్యడంతో తాము ప్రయివేటు వ్యక్తులకు అతి తక్కువ ధరకు పంటను విక్కయించానని మన్మోహన్ సింగ్ వాపోతున్నారు. విజయ్ మాల్యా ఎవరో తనకు తెలియదని, ఆయన పేరు కూడా తనకు తెలీదని అంటున్నారు. ఇంత వరకు తాను ముంబై ముఖం చూడలేదని చెబుతున్నారు.
ఇదంతా ఎలా జరిగిందో తనకు తెలీదని లబోదిబో అంటున్నారు. గ్యాస్ సబ్సిడీ సైతం నిలిపి వేశారని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా స్థానిక బ్రాంచ్ బ్యాంకు అధికారులు తన గోడువిని స్పందించాలని, తనకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు. అయితే ముంబై హెడ్ ఆఫీస్ నుంచి వచ్చిన ఆదేశాలు తాము పాటించామని స్థానిక బ్రాంచ్ అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications