మందుబాబుల భుజాల మీద ఆర్థికరంగాన్ని గట్టెక్కించే బాధ్యత: మద్యం రేట్లను భారీగా పెంచిన మరో రాష్ట్రం..!
లక్నో: కరోనా వైరస్ ప్రభావాన్ని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తోన్న వేళ..దిగజారిన ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే బాధ్యతను మందుబాబుల భుజాల మీద మోపుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఒకటో, రెండో కాదు.. వరుసగా ఆరు రాష్ట్రాలు మద్యం రేట్లను అమాంతంగా పెంచేశాయి. మద్యం విక్రయాలకు గేట్లెత్తేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన ఈ మూడురోజుల వ్యవధిలోనే ఆయా రాష్ట్రాలన్నీ లిక్కర్ రేట్లను పెంచేయడం..ఆర్థికరంగంలో దానికి ఉన్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలిచింది. క్షీణించిన ఆర్థిక రంగాన్ని గట్టెక్కించడానికి మందుబాబులు ఆలియాస్ ట్యాక్స్ పేయర్లే దిక్కు అయ్యారు.
ఉలిక్కిపడ్డ విజయనగరం జిల్లా: తొలి కరోనా కేసు నమోదు? డయాలసిస్ కోసం విశాఖకు వచ్చిన మహిళకు

ఏపీతో బోణీ..
మూడోదశ లాక్‌డౌన్‌తో పాటు కొన్ని సడలింపులను కూడా కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చింది. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చింది. గ్రీన్‌జోన్లు, నాన్ కంటైన్‌మెంట్ క్లస్టర్లలో మద్యం విక్రయించుకునే వెసలుబాటును రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా మద్యం రేట్లను పెంచిన రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్. మద్యం అమ్మకాలపై 25 శాతం రేట్లను పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.

ఆ మరుసటి రోజే ఢిల్లీ..
ఆ మరుసటి రోజే ఢిల్లీ కూడా అదే బాట పట్టింది. దేశ రాజధానిలో మద్యం అమ్మకాలపై ఏకంగా 70 శాతం మేర పన్నులను వడ్డించింది అక్కడి కేజ్రీవాల్ సర్కార్. ఇప్పటిదాకా కొనసాగిన మద్యంపై సగానికి పైగా పన్నులను పెంచింది. ఆ వెంటనే ఏపీ సర్కార్ మరోసారి మద్యం రేట్లను సవరించింది. ఢిల్లీతో పోటీ పడింది. మద్యం రేట్లను 25 శాతానికి పెంచిన మరుసటి రోజే అదనంగా మరో 50 శాతాన్ని జోడించింది. ఫలితంగా వాటి రేట్లు 75 శాతానికి చేరుకున్నాయి. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మద్యం రేట్లను 30 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది.

ఒకేరోజు తెలంగాణ.. కర్ణాటక
తామేమీ తక్కువ తినలేదని నిరూపించుకునే పనిలో పడ్డాయి తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు. మద్యంపై రేట్లను అమాంతం పెంచాయి. భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యంపై తెలంగాణ ప్రభుత్వం 16 శాతం అదనపు వడ్డింపులు జోడించింది. చీప్ లిక్కర్ రేటును 11 శాతానికి పెంచింది. కర్ణాటక ప్రభుత్వం కూడా భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యంపై 17 శాతం అదనపు భారాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించింది. అన్ని రకాల బ్రాండ్లపైనా ఈ పెంపు వర్తిస్తుంది.

అదే బాటలో యోగి ప్రభుత్వం..
తాజాగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే బాట పట్టింది. రాష్ట్రంలో మద్యం అమ్మకాల రేట్లను భారీగా పెంచింది. ఒక్కో బాటిల్‌పై 5 రూపాయల నుంచి 30 రూపాయల వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. మనదేశంలో తయారైన లిక్కర్ బాటిల్‌పై అయిదు రూపాయలను పెంచింది. భారత్‌లో తయారయ్యే విదేశీ మద్యం ఎకానమీ బ్రాండ్లపై 180 మిల్లీ లీటర్ల వరకు 10 రూపాయలు. 180 నుంచి 500 మిల్లీ లీటర్లపై 20 రూపాయలు, 500 మిల్లీ లీటర్లకు పైనున్న మద్యం బాటిళ్లపై 30 రూపాయలను పెంచినట్లు ఉత్తర ప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి సురేష్ ఖన్నా తెలిపారు.

పెట్రో ఉత్పత్తులపైనా వడ్డింపు..
పెట్రో ఉత్పత్తులపైన కూడా రేట్లను పెంచుతున్నట్లు సురేష్ ఖన్నా వెల్లడించారు. డీజిల్ లీటర్ ఒక్కింటికి ఒక రూపాయి, పెట్రోలు లీటర్ ఒక్కింటికి రెండు రూపాయలను అదనంగా వసూలు చేయబోతున్నట్లు చెప్పారు. బుధవారం నుంచే ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని తెలిపారు. కరోనా వైరస్ వల్ల అమలు చేస్తోన్న లాక్‌డౌన్ వల్ల ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదని స్పష్టం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని వాటి రేట్లను పెంచినట్లు సురేష్ ఖన్నా చెప్పారు.