అహ్మదాబాద్ వరుస పేలుళ్లతో సమాజ్‌వాదీ పార్టీ నేతలకు సంబంధాలు: అనురాగ్ ఠాకూర్ సంచలనం
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)పై సంచలన ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉగ్రవాదంపై సహనం లేని విధానాన్ని కలిగి ఉందని, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన వరుస పేలుళ్లకు ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ నాయకులకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం ఆరోపించారు.
'ఉగ్రవాదం విషయానికి వస్తే, బీజేపీ వైఖరి, ఆలోచన ఎప్పుడూ సహనం లేనిది. ఎస్పీ తీవ్రవాదంపై పూర్తి రక్షణ వైఖరిని అవలంభిస్తుంది' అని ఠాకూర్ అన్నారు. 'నేను అహ్మదాబాద్ వరుస పేలుళ్ల గురించి మాట్లాడితే.. ప్రజలు మరణించారు, గాయపడ్డారు, కానీ, అది యూపీలోని ఎస్పీ నాయకులతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉంది' అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

2008 అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో 38 మందికి మరణశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని ఠాకూర్ స్వాగతించారు. '56 మంది మరణించారు, అనేక మంది ఇతరులు గాయపడ్డారు. కోర్టు ఇటీవలి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము, బిజెపి దానిని స్వాగతించింది' అని ఠాకూర్ వ్యాఖ్యానించారు.
అహ్మదాబాద్‌లో వరుస పేలుళ్లు జరిగినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని కేంద్రమంత్రి ప్రశంసించారు.
'సిట్ ఏర్పడింది. కేవలం 19 రోజుల్లోనే ఉగ్రవాదులపై చర్యలు తీసుకున్నారు. సాక్ష్యాలను అందించడం నుంచి ఉగ్రవాదులను పట్టుకోవడం వరకు, ఆ సమయంలో మోడీ ప్రభుత్వం బాగా పనిచేసింది. నేటికీ ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉంది' అని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో మూడో దశ పోలింగ్‌కు ఒకరోజు ముందు సమాజ్‌వాదీ పార్టీకి వ్యతిరేకంగా కేంద్రమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అంతకుముందు జూలై 26, 2008న, వరుస పేలుళ్లలో అహ్మదాబాద్ నగరంలో 56 మంది మరణించారు, 200 మందికి పైగా గాయపడ్డారు.
Recommended Video
ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ హర్కత్-ఉల్-జిహాద్-అల్-ఇస్లామీ ఈ దాడికి బాధ్యత వహించింది. 70 నిమిషాల వ్యవధిలో నగరంలో 21 బాంబు పేలుళ్లు జరిగాయి. అహ్మదాబాద్‌లోని సివిల్ ఆస్పత్రిలోని ట్రామా సెంటర్‌ను కూడా ఈ పేలుళ్లలో లక్ష్యంగా చేసుకున్నారు. 2002లో గుజరాత్‌లోని గోద్రాలో జరిగిన అల్లర్లకు ప్రతీకారంగా ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.












Click it and Unblock the Notifications