భారత్ కు ట్రంప్ బిగ్ రిలీఫ్..! భారీగా తగ్గబోతున్న సుంకాలు ?
రష్యా చమురు కొంటున్నామనే కారణంతో భారత్ పై గత కొంతకాలంగా సుంకాల మోత మోగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతించారు. భారత్ తో వాణిజ్య చర్చలు ప్రారంభించిన తర్వాత వేగంగా మారుతున్న పరిణామాల్లో భాగంగా సుంకాల తగ్గింపు, రద్దుకు తాజా ప్రతిపాదనలు చేశారు. దీంతో భారత్ కు భారీ ఊరట లభించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్ధిక సలహాదారు అనంత నాగేశ్వరన్ కీలక విషయాలు వెల్లడించారు.
భారత వస్తువులపై విధించిన జరిమానా సుంకాలను అమెరికా త్వరలో ఉపసంహరించుకుంటుందని, రాబోయే వారాల్లో ప్రతీకార సుంకాలను కూడా సడలిస్తుందని కేంద్ర ముఖ్య ఆర్ధిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీంతో అధిక సుంకాల వల్ల దెబ్బతిన్న ఎగుమతిదారులకు ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టులో అమెరికా విధించిన 25శాతం జరిమానా సుంకాన్ని నవంబర్ చివరి నాటికి ఉపసంహరించుకోవచ్చని తెలిపారు.

నవంబర్ 30 తర్వాత జరిమానా సుంకాలు ఉండవని తాను అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. జరిమానా సుంకం , ప్రతీకార సుంకంపై రాబోయే రెండు నెలల్లో ఒక పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నట్లు నాగేశ్వరన్ తెలిపారు. ప్రస్తుతం 25శాతంగా ఉన్న ప్రతీకార సుంకాన్ని 10-15 శాతానికి తగ్గించవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇలా మొత్తం సుంకాల వివాదం రాబోయే 8-10 వారాల్లో పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అంచనా అని, అధికారిక హామీ ఆధారంగా కాదన్నారు. భారతదేశ ప్రధాన వాణిజ్య సంధానకర్త, వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్, దక్షిణ,మధ్య ఆసియాకు అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్‌ను ఢిల్లీలో కలిసిన నేపథ్యంలో ఈ ప్రకటన రావడం విశేషం.

ట్రంప్ విధించిన రెట్టింపు పన్నుల వల్ల కొన్ని భారతీయ ఉత్పత్తులు 50 శాతం వరకు సుంకాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, కొన్ని ఆహార ఉత్పత్తులు వంటి శ్రమతో కూడిన రంగాలలో ఎగుమతిదారులకు మార్జిన్‌లను తగ్గించింది. ఇప్పుడు ట్రంప్ పాక్షికంగా అయినా వెనక్కి తగ్గడం వల్ల ఖర్చు ఒత్తిళ్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అలాగేభారత్ చర్చల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, అమెరికా దేశీయ రాజకీయ లెక్కలు కూడా ఫలితంలో కీలకంగా మారాయని అధికారులు అంగీకరిస్తున్నారు.












Click it and Unblock the Notifications