
అమెరికాలో తగ్గిన సగటు ఆయుర్ధాయం... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో ఇదే తొలిసారి...
అమెరికాలో సగటు మనిషి ఆయుర్దాయం 2020లో ఏడాదిన్నర మేర తగ్గినట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) వెల్లడించింది. కరోనా వైరసే దీనికి కారణమని తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో ఇంత భారీ స్థాయిలో సగటు ఆయుర్దాయం క్షీణించడం ఇదే తొలిసారి. 1942-1943లో 2.9 సంవత్సరాల మేర సగటు ఆయుర్ధాయం క్షీణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
సీడీసీ డేటా ప్రకారం... అమెరికాలో 2019లో 78.8 సంవత్సరాలుగా ఉన్న సగటు ఆయుర్దాయం 2020లో 77.3కి పడిపోయింది. ఆఫ్రికన్ అమెరికన్ల సగటు ఆయుర్ధాయం అంతకంటే ఎక్కువగా క్షీణించింది. 2019లో ఆఫ్రికన్ అమెరికన్ల సగటు ఆయుర్దాయం 74.7 సంవత్సరాలు కాగా 2020లో అది 71.8కి పడిపోయింది. కరోనా కారణంగా సంభవించిన మరణాలకు తోడు కరోనా చికిత్సలో డ్రగ్ ఓవర్ డోసు కారణంగా 93వేల పైచిలుకు మంది ప్రాణాలు కోల్పోవడం ఇందుకు కారణాలుగా చెబుతున్నారు. అలాగే డయాబెటీస్,కాలేయ సంబంధిత వ్యాధుల కారణంగా సంభవించిన మరణాలు కూడా సగటు ఆయుర్ధాయం క్షీణించడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి.

సాధారణంగా నాన్ హిస్పానిక్ బ్లాక్స్ కంటే ఎక్కువ ఆయుర్ధాయం కలిగి ఉండే యూఎస్ హిస్పానిక్స్ ఆయుర్ధాయం 2020లో భారీగా క్షీణించింది. 2019లో 81.8 సంవత్సరాలుగా ఉన్న వారి ఆయుర్ధాయం 2020లో 78.8కి పడిపోయింది. అంటే దాదాపు 3.7సంవత్సరాల మేర క్షీణత నమోదైంది. హిస్పానిక్స్‌లో ఆయుర్ధాయం తగ్గుదలకు 90శాతం కోవిడే కారణమని చెబుతున్నారు.
గత నెలలో బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రచురించిన కథనం ప్రకారం... ప్రపంచంలోని 16 సంపన్న దేశాలతో పోలిస్తే అమెరికాలో 2018-2020 మధ్య సగటు ఆయుర్ధాయం క్షీణత 8.5 రెట్లు ఎక్కువగా ఉంది. వర్జినియా కామన్‌వెల్త్ యూనివర్సిటీకీ చెందిన స్టీవెన్ వూల్ఫ్ మాట్లాడుతూ... రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ స్థాయిలో సగటు ఆయుర్ధాయం క్షీణించడం మునుపెన్నడూ జరగలేదన్నారు. ఇది అత్యంత భయానక పరిస్థితికి సంకేతమన్నారు.