మాస్కులు ధరించడం తప్పనిసరి చేసిన కేంద్రం: ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా
న్యూఢిల్లీ: చైనాలో మళ్లీ ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. దాని తీవ్రత అనూహ్యంగా విస్తరిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాలు సైతం సంభవిస్తోన్నాయి. కోవిడ్ పేషెంట్లతో చైనాలోని పలు నగరాలు ఆంక్షల్లోకి వెళ్తోన్నాయి. ఆసుపత్రులు, క్లినిక్స్, స్పెషల్ వార్డులు భర్తీ అయ్యాయి. కొత్త పేషెంట్లకు బెడ్స్ దొరకని దుస్థితి ఏర్పడిందక్కడ. మృతదేహాలకు అంత్యక్రియలను నిర్వహించడానికి కూడా చోటు దొరకట్లేదు.

భారత్ హైఅలర్ట్..
చైనాకు మాత్రమే పరిమితం కాలేదు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు. పొరుగునే ఉన్న జపాన్, దక్షిణ కొరియాతో పాటు అమెరికా, బ్రెజిల్‌లల్లో కూడా కోవిడ్ తీవ్రత పెరిగింది. భారత్‌లోనూ ఈ మహమ్మారి ఉధృతి ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. కొత్త కేసులు వెలుగులోకి వస్తోన్నాయి. మహారాష్ట్రలో ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలు బయటపడుతున్నాయి. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యాన్ని వహించలేని పరిస్థితి దేశంలో నెలకొంది. సెకెండ్ వేవ్ తరహా దుర్భర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడానికి రాష్ట్రాలు సిద్ధపడుతున్నాయి.

సమీక్షించిన కేంద్రం..
ఈ పరిణామాలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ భాయ్ మాండవీయ ఇవ్వాళ సమీక్ష చేపట్టారు. ఈ ఉదయం 11:30 గంటలకు దేశ రాజధానిలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యాలయం ఈ సమీక్ష ఆరంభమైంది. ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఆయుష్, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ రాజీవ్ బెహల్, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఛైర్మన్ అరోరా, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

మాస్కుల ధారణ తప్పనిసరి..
ఈ సమావేశం ముగిసిన అనంతరం డాక్టర్ వీకే పాల్ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో చర్చకు వచ్చిన అంశాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ మాస్కులను ధరించాల్సి ఉంటుందని సూచించారు. గుంపులు గుంపులుగా ఉన్న ప్రదేశాలతో పాటు ఇండోర్, ఔట్ డోర్స్‌లల్లో మాస్కులను ధరించాలని చెప్పారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్న వారు, వయోధిక వృద్ధులు తప్పనిసరిగా మాస్కులను ధరించాలని డాక్టర్ వీకే పాల్ స్పష్టం చేశారు.

ప్రికాషన్ డోస్..
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 27 నుంచి 28 శాతం మంది మాత్రమే ప్రికాషన్ డోస్ తీసుకున్నారని వీకే పాల్ చెప్పారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఈ డోస్‌ను తీసుకునే విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. మిగిలిన వారు కూడా ఈ విషయంలో ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని అన్నారు. ప్రికాషన్ డోస్ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని పేర్కొన్నారు. విమాన ప్రయాణికులపై ఆంక్షలను విధించడంపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

ఎలాంటి పరిస్థితినైనా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ అన్నారు. కోవిడ్ ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదని స్పష్టం చేశారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోవిడ్ సర్వైలెన్స్ వ్యవస్థను పటిష్ట పర్చాలని సమీక్షా సమావేశంలో ఆదేశించినట్లు వివరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications