యూపీలో స్మార్ట్ స్కూల్-స్మార్ట్ బ్లాక్ కార్యక్రమం-ప్రాథమిక విద్యలో భారీమార్పుగా యోగీ అభివర్ణన..
యూపీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన యోగీ ఆదిత్యనాథ్ సర్కార్.. అభివృద్ధితో పాటు విద్యాసంస్కరణలకు కూడా పెద్దపీట వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో విద్యాసంస్కరణల్ని అమలు చేసేందుకు యోగీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు క్రమంగా ఫలితాలు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా తన నియోజకవర్గం గోరఖ్ పూర్ లో స్మార్ట్ స్కూల్-స్మార్ట్ బ్లాక్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
యూపీ గత ఆరేళ్లలో ప్రాథమిక విద్యలో శిఖరాగ్రానికి దూసుకుపోయిందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. మూసివేత అంచున ఉన్న అనేక పాఠశాలలు తన ప్రభుత్వ హయాంలో తిరిగి ప్రాణం పోసుకున్నాయన్నారు. గోరఖ్ పూర్ లోని యోగిరాజ్ బాబా గంభీర్‌నాథ్ ఆడిటోరియంలో ప్రాథమిక విద్యాశాఖ, సంపర్క్ ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన 'సంపర్క్ స్మార్ట్‌శాల-స్మార్ట్ బ్లాక్' కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

స్కిల్ ఇండియా మిషన్‌కు తమప్రభుత్వం పెద్దపీట వస్తోందని ఆదిత్యనాథ్ తెలిపారు. స్కిల్ ఇండియా మిషన్ గొప్ప ఫలితాలను ఇస్తోందని, సాంకేతికతను సద్వినియోగం చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో విద్యా నాణ్యతను మెరుగుపరుస్తోందని ఆదిత్యనాథ్ అన్నారు. 'సంపర్క్ స్మార్ట్‌శాల-స్మార్ట్ బ్లాక్' కార్యక్రమం కింద, నగరంలోని ప్రాథమిక విద్యా మండలి పరిధిలోని 58 పాఠశాలలు, చార్గవాన్ బ్లాక్‌లోని 68 సంస్థలకు ఎల్‌ఈడీ టీవీలు, స్మార్ట్ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ లెర్నింగ్ కిట్‌లు అందిస్తామని యోగీ తెలిపారు.

2017కు ముందు రాష్ట్రంలో పాఠశాలల్లో కనీసం టాయిలెట్లు కూడా సరిగ్గా ఉండేవి కావని, తాగునీరు ఉండేది కాదని, తగినంత మంది టీచర్లు కూడా ఉండేవారు కాదని యోగీ ఆదిత్యనాథ్ గుర్తుచేశారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం అవసరాన్ని యోగీ వివరించారు. కోవిడ్ కారణంగా విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడిందని, అయినా ప్రధాని మోడీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా మిషన్ కారణంగా విద్యార్ధులు ఆ సమస్యల్ని అధిగమించారని యోగీ ప్రశంసించారు.












Click it and Unblock the Notifications