సీఎంతో సహా 52 మందికి ప్రాణహాని? ఎన్నికలకు ముందే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. రాజకీయం రణరంగంగా మారక ముందే హోంశాఖ, భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రాబోయే ఎన్నికల్లో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో, రాష్ట్రంలోని అత్యంత కీలకమైన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల అగ్రనేతల భద్రతపై నిఘా వర్గాలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని 52 మంది ప్రముఖ నాయకులకు అత్యంత ఆధునికమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అందించాలని భద్రతా విభాగం నిర్ణయించింది.
బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల జాబితాలో ఎవరెవరు?
ఈ ప్రత్యేక రక్షణ కవచాలు అందుకుంటున్న వారిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి వంటి అగ్రనేతలు ఉన్నారు. వీరితో పాటు ప్రభుత్వం లో కీలక పాత్ర పోషిస్తున్న 11 మంది మంత్రులు ఉన్నారు. ఈ జాబితాలో సంజయ్ నిషాద్, నంద్ గోపాల్ గుప్తా నంది, ఓం ప్రకాశ్ రాజ్ భర్లతో పాటు బీజేపీ నేత అపర్ణా యాదవ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు విడతల్లో రూ. 5.2 కోట్ల భద్రతా పరికరాలు
అత్యంత నాణ్యమైన ఈ ఒక్కో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విలువ సుమారు 10 లక్షల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. భద్రతా ప్రాధాన్యతలను బట్టి వీటిని రెండు విడతల్లో నేతలకు పంపిణీ చేశారు. తొలి విడతలో ఎనిమిది మంది కీలక నేతలకు అందించగా, రెండో విడతలో మరో 44 మందికి వీటిని అందజేశారు. స్వతంత్ర దేవ్ సింగ్, జైవీర్ సింగ్, మహేంద్ర సింగ్ వంటి పలువురు సీనియర్ నాయకులకు కూడా ప్రత్యేక కవచాలతో పాటు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 98 మంది ముఖ్య నేతలకు వివిధ కేటగిరీల కింద భద్రతను పెంచారు.
ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్న కమలదళం
ఒకవైపు భద్రతా చర్యలు వేగవంతమవుతుంటే, మరోవైపు అధికార బీజేపీ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతోంది. ఎన్నికల ఇన్‌ఛార్జీగా అనుభవజ్ఞుడైన వినోద్ తావ్డేను, సహ ఇన్‌ఛార్జీగా జగదీష్ ఈశ్వర్‌భాయ్ పటేల్‌ను బరిలోకి దింపింది. సామాజిక సమీకరణాలను సమతుల్యం చేస్తూ.. బీసీ, మైనారిటీ వర్గాల నేతలకు పార్టీ పదవుల్లో ప్రాధాన్యం పెంచుతోంది. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు, అభ్యర్థుల బలాబలాలు తెలుసుకునేందుకు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా అంతర్గత సర్వేలను కూడా ప్రారంభించింది.














Click it and Unblock the Notifications