మంత్రులకు PMO నుంచి పిలుపు, కేబినెట్ ప్రక్షాళన - వారు అవుట్.. ఆ పార్టీలు ఇన్..!!
కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ ఈ నెల 18న కేంద్ర మంత్రులతో ప్రత్యేక భేటీ ఏర్పాటు చేసారు. ఈ నెలాఖరు లో కేబినెట్ ప్రక్షాళన పూర్తి చేయటం తో పాటుగా ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లు- డీ లిమిటేషన్ బిల్లు ఆమోదం దిశగా కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా మంత్రులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇక, ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో 12 మందిని తప్పించనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఎన్సీపీ కేంద్ర కేబినెట్ లో చేరటం ఖాయమని సమాచారం. మిత్రపక్షాలకు ప్రాధాన్యత పెరగనుంది.
ప్రధాని మోదీ కీలక నిర్ణయాలకు సిద్దమయ్యారు. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఈ నెల 18న కేంద్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులకు ప్రధాని కార్యాలయం నుంచి సమాచారం అందింది. సమావేశ ఎజెండా ఏమిటన్నది చెప్పలేదని.. కేవలం ప్రధాని మోదీతో విందు సమావేశమని మాత్రమే సమాచారం ఇచ్చారని తెలిసింది. ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మనీలాకు వెళ్లనున్నారు. అక్కడినుంచి 18న తిరిగి రాగానే మంత్రులతో భేటీ జరగనుంది. ఈ నెలాఖరులో పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. దానికంటే ముందే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీ కరణ చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం మంత్రివర్గంలో 29 మంది క్యాబినెట్ హోదా, ఐదుగురు స్వతంత్ర హోదా కలిగిన సహాయ మంత్రులు, 34 మంది సహాయ మంత్రులు కలిపి.. 68 మంది ఉన్నారు.

నెలాఖరులో కేబినెట్ ప్రక్షాళన.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశం
కాగా, ప్రస్తుత మంత్రుల్లో 12 మందిని తప్పించేందుకు రంగం సిద్దమైంది. అదే విధంగా క్యాబినెట్ హోదా మంత్రుల్లో 12 మంది ఒకటి కంటే ఎక్కువ శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీంతో.. అదనంగా ఉన్న శాఖలను వారి నుంచి తొలగించి, కొత్తవారికి ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా ఆప్, ఎన్సీపీ నుంచి కేంద్ర కేబినెట్ లో మంత్రులు కానున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలకు ప్రాధాన్యత పెరగనుంది. ఇక.. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసి దాదాపుగా 96 రోజులు అవుతున్నా ఇప్పటికీ ప్రోరోగ్ చేయలేదు. ఈనెల 20 తర్వాత మూడు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. తర్వాత 30వ తేదీ నుంచి శీతాకాల సమావేశాలు చేపట్టాలనే ప్రతిపాదన పైన మంత్రాంగం కొనసాగుతోంది. ఈ నెల 18న జరిగే మంత్రుల భేటీలో కేబినెట్ ప్రక్షాళన.. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల పైన పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications
