తెలంగాణ జనసేనలో భారీ ప్రక్షాళన
తెలంగాణలో పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో పటిష్టం చేసే దిశగా జనసేన అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కొనసాగుతున్న పాత కమిటీలు, వివిధ హోదాల్లోని నాయకుల బాధ్యతలన్నింటినీ రద్దు చేసింది. భారీ సంస్థాగత ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. జూన్ 2వ తేదీ కంటే ముందు నియమించిన అన్ని రకాల పదవులను తక్షణమే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది.
ఈ సంస్థాగత ప్రక్షాళన చర్యల్లో భాగంగా పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవులను జనసేన పూర్తిగా రద్దు చేసింది. వీటితో పాటు జీహెచ్‌ఎంసీ, వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఇన్ ఛార్జీల నియామకాలను కూడా ఉపసంహరించుకుంది. అదేవిధంగా విద్యార్థి, యువజన, వీరమహిళ విభాగాలకు చెందిన పాత కమిటీలతో పాటు గతంలో ఏర్పాటు చేసిన అడహక్ కమిటీలన్నింటినీ రద్దు చేస్తోన్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది.

జూన్ 2 తర్వాత ఏర్పాటైన జాయినింగ్ కమిటీతో పాటు అధికార ప్రతినిధుల పదవుల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. అవి యథాతథంగా కొనసాగుతాయని జనసేన వివరించింది. పాత కమిటీలను రద్దు చేసిన నేపథ్యంలో, తెలంగాణలో నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. కొత్తగా నియమించబోయే ఈ యంత్రాంగంలో నాయకత్వ లక్షణాలు ఉన్న యువత, మహిళలు, విద్యావంతులు, సమాజంలోని అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానం భావిస్తోంది.
భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికలను ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న జనసేన, క్షేత్రస్థాయి నుంచి పార్టీని ఒక బలమైన రాజకీయ శక్తిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే పార్టీ అగ్రనాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల కంటే ముందే రాబోయే జీహెచ్‌ఎంసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో సన్నద్ధం చేయాలని యోచిస్తోంది.
ప్రతి డివిజన్, వార్డు స్థాయిలో బలమైన కేడర్‌ను సిద్ధం చేసేందుకు కార్యాచరణ వేగవంతం చేసింది. స్థానిక సంస్థల పోరుతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ జనసేన తరఫున అభ్యర్థులను నిలబెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం చేపట్టిన పదవుల రద్దు ప్రక్రియ నాయకులు అందించిన సేవలకు ముగింపు కాదని, వారిని మరింత ప్రాధాన్యత ఉన్న బాధ్యతల్లోకి తీసుకెళ్లేందుకు ఒక మార్గమని జనసేన స్పష్టం చేసింది.













Click it and Unblock the Notifications
