• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరప్రదేశ్: ములాయం సింగ్, కాన్షీరాం ఒక్కటై కల్యాణ్ సింగ్‌ను చిత్తు చేశాక ఏం జరిగింది

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
ములాయం, కాన్షీరాం
Click here to see the BBC interactive

జయంత్ మల్హోత్రా ఒక పారిశ్రామికవేత్త. గుర్రపుస్వారీతో పాటూ ఆయనకు మరో కోరిక కూడా ఉండేది.

కలిసి కూచుంటారని ఎవరూ కలలో కూడా ఊహించని రాజకీయ పార్టీల నేతలందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడమనేది ఆయన చిరకాల కోరిక.

90వ దశకం ప్రారంభంలో రామజన్మభూమి ఉద్యమంతో బీజేపీ గాలి జోరుగా వీస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కల్యాణ్ సింగ్ పూర్తి ఆధిక్యంతో గెలిచారు. కానీ, అప్పుడే 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కొందరు కూల్చేయడంతో బీజేపీ తాను కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు అయ్యింది.

అది కూడా బాబ్రీ మసీదుకు ఎలాంటి నష్టం కలగకుండా చూసుకుంటామని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు భరోసా ఇచ్చిన సమయంలో జరిగింది.

ఫలితంగా కేంద్రం కల్యాణ్ సింగ్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయక ముందే, యూపీలోని బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. కల్యాణ్ సింగ్ స్వయంగా తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అశోక్ హోటల్లో కాన్షీరాం, ములాయం భేటీ

కొంతకాలం తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎలా అనే ప్రశ్నలు మొదలయ్యాయి.

అదే సమయంలో ములాయం సింగ్ యాదవ్, కాన్షీరాం మధ్య జయంత్ మల్హోత్రా ఒక సమావేశం జరిగేలా చేశారు. అది 1993 అక్టోబర్‌లో జయంత్ మల్హోత్రాకు చెందిన అశోక హోటల్ గదిలో జరిగింది.

కాన్షీరాం‌కు చెందిన బహుజన్ సమాజ్ పార్టీ మీద నమ్మకం పెట్టుకున్న మొదటి పారిశ్రామికవేత్త బహుశా జయంత్ మల్హోత్రానే.

అదే సమయంలో, సంజయ్ దాల్మియా అనే మరో పారిశ్రామికవేత్త కూడా ములాయం సింగ్ యాదవ్‌తో చాలా సన్నిహితంగా ఉండేవారు, రెండు పార్టీల మధ్య ఒప్పందానికి తుదిరూపం ఇవ్వడంలో కీలకపాత్ర పోషించారు.

ఈ ఇద్దరు పారిశ్రామికవేత్తలకూ కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి. వీరిద్దరూ ఒకరికొకరు బాగా తెలుసు.

మాయావతి జీవితచరిత్ర 'బహెన్ జీ: ద పొలిటికల్ బయోగ్రఫీ ఆఫ్ మాయావతి'లో రచయిత అజయ్ బోస్ ఆనాటి విషయాలు రాశారు.

"సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీని దగ్గర చేయడానికి ఆ పార్టీలతో జయంత్ మల్హోత్రా, సంజయ్ దాల్మియా సాన్నిహిత్యం కీలకమైంది. తమ ప్రయత్నాలకు వారికి తర్వాత బహుమతి కూడా లభించింది. 1994లో మల్హోత్రాకు బీఎస్పీ, దాల్మియాకు సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ టికెట్ ఇప్పించాయి" అన్నారు.

రుణం తీర్చుకున్న కాన్షీరాం

జయంత్ మల్హోత్రాకు రాజ్యసభకు పంపించిన కాన్షీరాం తన రుణం తీర్చుకున్నారు. కానీ, నిజానికి ఆయనకు రాజ్యసభ టికెట్ ఇస్తానని మాటిచ్చింది మాత్రం ములాయం సింగ్ యాదవ్.

అఖిలేష్ యాదవ్ జీవితచరిత్ర 'విండ్స్ ఆఫ్ చేంజ్‌'లో హిందుస్తాన్ టైమ్స్ లఖ్‌నవూ ఎడిషన్ ఎడిటర్ సునీతా ఆరోన్ ఆ విషయం రాశారు.

"రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైనప్పుడు, ములాయం సింగ్ యాదవ్ తన మాటపై వెనక్కు తగ్గారు. జయంత్ మల్హోత్రా ఆ విషయం కాన్షీరాం దగ్గర ప్రస్తావించడంతో, బీఎస్పీ కోటాలో మల్హోత్రాను రాజ్యసభకు పంపించాలని ఆయన తక్షణం నిర్ణయం తీసుకున్నారు." అని చెప్పారు.

తర్వాత, మాయావతి తన ఆత్మకథ 'మేరా సంఘర్ష్‌మయ్ జీవన్ ఔర్ బహుజన్ సమాజ్ మూవ్‌మెంట్‌ కా సఫర్నామా'లో ఆ విషయం రాశారు.

"నిజానికి ఒక ప్రత్యేక లక్ష్యంతో ఈ పొత్తు పెట్టుకున్నాం. ఒకటి బహుజన్ సమాజ్‌ను బహుజన్ సమాజ్‌లో పుట్టిన వ్యక్తి నాయకత్వంలో ఒక్కటి చేయడం, తర్వాత అధికారం చేజిక్కించుకోవడం. రెండోది మతతత్వ శక్తులను గద్దె దించడం.. ఎందుకంటే అయోధ్య ఘటన తర్వాత రాష్ట్రంలో బీజేపీ పవనాలు వీస్తున్నాయి" అన్నారు.

యూపీ సీఎంగా ములాయం

కాన్షీరాం, ములాయం సింగ్ పరస్పర సాయం

ఒకవిధంగా జయంత్ మల్హోత్రా, సంజయ్ దాల్మియా ప్రయత్నాలకు ముందు, 1994లో కాన్షీరాం ఎటావా నుంచి లోక్‌సభకు, ములాయం సింగ్ యాదవ్ జశ్వంత్ నగర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి పరస్పర సహకారంతో విజయం సాధించినప్పుడే రెండు పార్టీల పొత్తుకు పునాదులు వేసేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

"ములాయం సింగ్ యాదవ్, కాన్షీరాం మధ్య మౌనాంగీకారం ఫలితమే ఎటావా ఎన్నికల్లో విజయం. నిజానికి అది క్షేత్రస్థాయిలో హిందుత్వవాద శక్తులకు వ్యతిరేకంగా దళితులు, మిగతా వెనుకబడిన కులాలు, ముస్లింల కూటమిగా నిలిచింది" అని కేసీ దాస్ తన 'ఇండియన్ దళిత్స్ వాయిసెస్, విజన్ అండ్ పాలిటిక్స్‌లో రాశారు.

కాన్షీరాంను గెలిపించడానికి ములాయం సింగ్ యాదవ్ తన మొత్తం బలం ఉపయోగించారు. ఇటావా ఎన్నికల్లో యాదవుల ఓట్లు దళిత అభ్యర్థులకు వెళ్తాయని, దళితుల ఓట్లు యాదవ అభ్యర్థులకు పడేలా చేయవచ్చని ఇద్దరు నేతలు ఒక సందేశం కూడా ఇచ్చారు.

మాయావతిని ఒప్పందానికి దూరంగా ఉంచిన కాన్షీరాం

బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వకూడదని కోరుకుంటున్న ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు, కాంగ్రెస్ పార్టీ మద్దతు కూడా ఈ పొత్తుకు లభించింది.

"చాలా చురుకుగా ఉండే తన శిష్యురాలు ఈ చర్చలను ఎక్కడ జటిలం చేస్తుందోనని భయపడ్డ కాన్షీరాం కావాలనే మాయావతిని ఈ ఒప్పందానికి దూరంగా ఉంచారు. ఫలితంగా సమాజ్‌వాదీ పార్టీతో జరిగిన సీట్ల పంపకంలో కాన్షీరాం చాలా ఉదారంగా వ్యవహరించారు" అని అజయ్ బోస్ మాయావతి జీవితచరిత్రలో చెప్పారు.

బహుజన్ సమాజ్ పార్టీ ముఖ చిత్రం అయినప్పటికీ, ఎన్నికల ప్రచారంలో మాయావతి అంత హై-ప్రొఫైల్ పాత్ర ఏదీ పోషించలేదు. ఆమె తనను పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో తన ప్రభావం ఉన్న ప్రాంతానికే పరిమితం చేసుకున్నారు.

ఈ ఎన్నికల్లో తన పాత్రను పోషించకుండా మాయావతిని అడ్డుకోడానికి, ములాయం సింగ్, మాయావతి మధ్య పెరిగిన దూరం కూడా కారణం అయ్యుండచ్చు.

ఎస్పీ, బీఎస్పీ కలిసి 176 స్థానాల్లో గెలిచాయి

కానీ, ఇన్ని జరిగినా ములాయం సింగ్ యాదవ్-కాన్షీరాం కూటమి 1993 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోగలిగాయి.

అయితే, 177 స్థానాలతో బీజేపీ అప్పటికీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ, ఆ పార్టీకి సంపూర్ణ మెజారిటీ లభించలేదు.

సుమారు 260 స్థానాల్లో పోటీ చేసిన ఎస్పీ 109 సీట్లలో విజయం సాధించగా, బహుజన్ సమాజ్ పార్టీ 163 స్థానాల్లో పోటీ చేసి 67 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపింది.

దీంతో, కాంగ్రెస్, మిగతా చిన్న పార్టీలు, ఇండిపెండెంట్ల సహకారంతో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 27 మంది సభ్యుల మంత్రి మండలిలో ఆయన బీఎస్పీకి 11 మంత్రి పదవులు ఇచ్చారు.

అయితే, మాయావతి ఈ మంత్రిమండలిలో భాగం కాలేదు. కానీ ఆమెకు ఈ కూటమిని ముందుకు నడిపించే కీలక బాధ్యతలు అప్పగించారు.

బహుజన్ సమాజ్ పార్టీ ఆవిర్భవించిన దశాబ్దం లోపే ప్రభుత్వ విధానాల్లో, అది కూడా భారత్‌లో అత్యంత ముఖ్యమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకునే స్థితికి ఎదిగింది.

ఏ 'మాస్టర్ కీ' తన చేతిలో ఉండాలని కాన్షీరాం భావించేవారో, అది చాలా వరకూ మాయావతి చేతుల్లోకి వెళ్లిపోయింది.

కాన్షీరాం

వ్యక్తిత్వ విభేదాలు, సైద్ధాంతిక దూరంతో రెండు పార్టీల మధ్యా దూరం

ఈ కూటమి ప్రారంభం బాగానే ఉన్నా, మెల్లమెల్లగా పరిస్థితులు దిగజారడం మొదలైంది.

కాన్షీరాం జీవితచరిత్ర 'లీడర్ ఆఫ్ ద దళిత్స్‌'లో బద్రీ నారాయణ్ ఆనాటి పరిస్థితులు వివరించారు.

పొత్తు బెడిసికొట్టడం వెనుక ఎన్నో కారణాలున్నాయి. ఈ కూటమిని తనే నియంత్రించాలని మాయావతి పూర్తి ప్రయత్నాలు చేశారు. కానీ ములాయంకు అది అస్సలు నచ్చలేదు.

రెండు పార్టీల నేతల మధ్య సైద్ధాంతక దూరమే ప్రధాన అడ్డంకిగా మారింది. కూటమి మొదలైన రోజు నుంచీ ములాయం సింగ్ యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీని చీల్చి, ఆ పార్టీ ఎమ్మెల్యేలను తనవైపు లాక్కునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.

మరోవైపు ములాయం సింగ్ యాదవ్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికి కాన్షీరాం రహస్యంగా విపక్ష దళాల నేతలతో, ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్‌పేయితో టచ్‌లో ఉంటూ వచ్చారు.

కాన్షీరాం, మాయావతి మొదట్లో అసాధ్యమైన డిమాండ్లను తీర్చాలని ములాయం సింగ్‌ను డిమాండ్ చేసేవారని కొంతమంది సమాజ్ వాదీ పార్టీ నేతలు చెబుతారు.

ములాయం పాలనను నిశితంగా మానిటర్ చేయడంతోపాటూ, ఆయనను బహిరంగంగా విమర్శించడం కూడా మొదలెట్టారు.

పార్టీలకూ పరస్పరం నమ్మకం లేకుండాపోయింది

కాన్షీరాం, ములాయం సింగ్ యాదవ్ కలిసి అగ్ర వర్గాల రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేశారనేది ఈ కూటమి తొలి రోజుల్లోనే స్పష్టమైంది. కానీ, ఆ రెండు పార్టీల మద్దతుదారుల స్వభావం, మానసిక స్థితి మాత్రం చాలా భిన్నంగా ఉండేవి.

"సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కాన్షీరాం, ములాయం సింగ్ యాదవ్, మాయావతి వేరువేరుగా అర్థం చేసుకున్నారు. దళిత, వెనుకబడిన కులాలు, ముస్లింలను ఒక వేదికపైకి తీసుకొచ్చే దిశగా ఇది కాన్షీరాం వేసిన ఒక అతిపెద్ద అడుగు" అని అజయ్ బోస్ మాయావతి జీవితచరిత్రలో రాశారు.

చరణ్ సింగ్ దళితుల మేలు కోరుకోలేదన్నది బహిరంగ రహస్యం కావడంతో, ఆయనతో ఏదోఒక విధంగా బంధుత్వం ఉన్న ములాయం రాజకీయ వారసత్వం విషయంలో కాన్షీరాం అయోమయంలో పడ్డారు.

మరోవైపు, ములాయం సింగ్ కూడా తనను చరణ్ సింగ్ వారసుడిగా భావించేవారు. కాన్షీరాం సైద్ధాంతిక ఆలోచనలతో ఆయనకు ఎలాంటి సంబంధం ఉండేదికాదు. ఆయన బహుజన్ సమాజ్ పార్టీతో ఒక వ్యూహాత్మక ఒప్పందం చేసుకున్నారు. దాని సాయంతో సంఘ్ పరివార్‌ను అడ్డుకోవడం చాలా కష్టమని భావిస్తున్న సమయంలో అందరినీ ఆశ్చర్యపరుస్తూ అధికారంలోకి వచ్చారు.

చరణ్ సింగ్‌లాగే దళితులకు రాజకీయ నేతృత్వం అందుకునే సామర్థ్యం లేదని ములాయం సింగ్ యాదవ్ కూడా భావించేరు. ఎప్పుడో ఒకప్పుడు బీఎస్పీ ఎమ్మెల్యేలను తమవైపుకు లాక్కోగలమని ఆయన విశ్వాసంతో ఉండేవారు.

మాయావతి, ములాయం

మాయావతి తీరు ములాయంకు నచ్చలేదు

మరోవైపు, మాయావతి తన రాజకీయ ఆకాంక్షలు నెరవేర్చుకునేలా కొత్త ప్రభుత్వం అన్ని తలుపులూ తెరిచేసింది. కూటమి సమన్వయ బాధ్యతలు అందుకున్న సమయానికి 40 ఏళ్లు కూడా లేని మాయావతి, దానిని తన రాజకీయ ప్రతిష్ఠను పెంచుకోడానికి ఒక చక్కటి అవకాశంగా భావించారు.

ఉత్తరప్రదేశ్‌కు దూరంగా ఉండాలనే కాన్షీరాం నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే అందరూ తనను 'సూపర్ చీఫ్ మినిస్టర్' అని పిలుస్తుంటే మాయావతి లోలోపలే సంతోషపడిపోయేవారు.

ఆమె అలా రాష్ట్ర రాజకీయాల్లో చురుకుగా ఉండడం ములాయంకు నచ్చలేదు.

అక్కడి నుంచే వారి దారులు వేరవడం మొదలయ్యింది. ఫలితంగా సంకీర్ణ ప్రభుత్వానికి బహుజన్ సమాజ్ పార్టీ మద్దతు ఉపసంహరించడం, బీజేపీ సహకారంతో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిపోయింది.

ISWOTY Footer

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Uttar Pradesh: What happened when Mulayam Singh and Kanshi Ram together tore down Kalyan Singh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X