Uttarakhand మహిళలకు కేజ్రీవాల్ వరాలు.. అధికారంలోకి వస్తే పుణ్యక్షేత్రాల సందర్శన ఉచితం..!!
ఉత్తరాఖండ్: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు వేడిని పెంచుతున్నాయి. జాతీయ స్థాయి నేతలంతా ఈ ఐదు రాష్ట్రాల్లోనే తిష్టవేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రచారం నిర్వహిస్తుండగా... మరికొందరు నేతలు నేరుగా ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఇక ఉత్తరాఖండ్‌లో ఎన్నికల వేడి పీక్ స్టేజెస్‌కు చేరుకుంది. ఉత్తరాఖండ్ బరిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇస్తుండటంతో అక్కడ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
తాజాగా ఉత్తరాఖండ్‌లో పర్యటించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్కడి ఓటర్లకు వరాలు కురిపించారు. అంతేకాదు అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్ స్వరూపాన్ని అన్ని రంగాల్లో మార్చి అభివృద్ది చేస్తామన్నారు. ఉత్తరాఖండ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వస్తే 18 ఏళ్లు పైబడిన ప్రతి మహిళకు వారి అవసరాల నిమిత్తం ప్రతి నెలా రూ.1000 ఇస్తామని చెప్పారు. ఈ డబ్బులు నేరుగా మహిళల ఖాతాలోకి బదిలీ అవుతాయని చెప్పారు. ఇక ఎన్నికల హామీల్లో భాగంగా ఉత్తరాఖండ్‌ను అంతర్జాతీయ ఆధ్యాత్మిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఓ గొప్ప పర్యాటక కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దితే ఇక్కడి యువతకు కూడా నిరుద్యోగ సమస్య ఉండదని చెప్పారు. వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.

ఒకవేళ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉత్తరాఖండ్ ప్రజలు అయోధ్య, అజ్మీర్ షరీఫ్ లాంటి పుణ్య క్షేత్రాలను దర్శించుకునేందుకు ఉచితంగా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఢిల్లీలో ఎలాగైతే ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన అనే పథకం ఉందో అలానే ఉత్తరాఖండ్‌లో కూడా ఈ పథకం తీసుకొస్తామని చెప్పారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి తీర్థయాత్ర యోజన పథకం కింద 40వేల మంది ఢిల్లీ వాసులు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారని గుర్తు చేశారు.
ఉత్తరాఖండ్‌లో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా... ఫిబ్రవరి 14వ తేదీన ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి. ఈసారి ఉత్తరాఖండ్ అసెంబ్లీ పోరు ముక్కోణపు పోరుగా మారనుంది. అధికారిక బీజేపీ, హరీష్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్, అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీలు బరిలోకి దిగుతుండటంతో ముక్కోణపు పోరు తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక బీజేపీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా పుష్కర్ సింగ్ ధామి బరిలో ఉండగా... ఆమ్ ఆద్మీ పార్టీ తమ సీఎం అభ్యర్థిగా కల్నల్ అజయ్ కొతియాను నిలబబెట్టింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57 స్థానాల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.












Click it and Unblock the Notifications