ఉత్తరాఖండ్‌లో జల విలయం: 23 మంది మృతి, కొట్టుకుపోయిన వంతెనలు, హైదరాబాదీలు సేఫ్
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అనేక నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదనీటితో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరద ఉధృతికి పలు చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి. మరికొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడి ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఉత్తరాఖండ్‌లో వర్ష బీభత్సం
ఇప్పటివరకు భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తినష్టం జరిగింది. ఇక నైనిటాల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నైనిటాల్ సరస్సు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో అనేక గ్రామాలు నీటమునిగిపోయాయి. దీంతో ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితులు నెలకొని ఇబ్బందులు పడుతున్నారు. రాంగఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది పర్యాటకులను రెస్క్యూ బృందాలు కాపాడాయి.
భారీ వర్షాలతో కొట్టుకుపోయిన వంతెనలు
వరద ఉధృతికి రోడ్లపై నిలిపి ఉంచిన వాహనాలు కొట్టుకుపోయాయి. హల్ద్వానీ ప్రాంతంలో గౌలా నది ఉప్పొంగడంతో ఆ నదిపై ఉన్న వంతెన కొంతమేర కొట్టుకుపోయింది. అదే సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వంతెన మీదకు రావడం గమనించిన స్థానికులు, అధికారులు అతడిని హెచ్చరించడంతో వెనుదిరిగాడు. దీంతో ప్రమాదం తప్పింది. చంపావత్ ప్రాంతంలో చల్తీ నదికి వరద పోటెత్తడంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కొట్టుకుపోయింది.
యాత్రల నిలిపివేత.. ప్రధాని మోడీ ఆరా
భారీ వర్షాలు, వరదల కారణంగా కేదారనాథ్, బధ్రీనాథ్ యాత్రలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఆ ఆలయాలకు వెళ్తూ మార్గమధ్యంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాతే యాత్రికులను, పర్యాటకులను అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఉత్తరాఖండ్ వర్షాలు, వదర పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర సింగ్ దామి, కేంద్రమంత్రి అజయ్ భట్ లతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.

హైదరాబాదీ యువతులు సేఫ్
మరోవైపుర, ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న హైదరాబాదీ యువతులను సహాయ బృందాలు కాపాడాయి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సఫారీ కోసం వెళ్లిన వరదల్లో చిక్కుకున్న సుష్మ అనే మహిళ, ఆమె స్నేహిుతురాళ్లు తమ పరిస్థితి గురించి తెలంగాణ సీఎంవో, కేంద్రమంత్రులకు ట్వీట్ చేయడంతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దీంతో ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడిన కేంద్రమంత్రి సహాయ చర్యలకు ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్న సుష్మ,ఆమె స్నేహితులను హాయ బృందాలు కాపాడాయి. దీంతో సుష్మ మిత్రబృందం తమ వాహనంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ మేరకు వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications