జగన్ దెబ్బకు కదిలిన మోదీ: వ్యాక్సిన్ల పంపిణీపై కేంద్రం కీలక సవరణలు -ప్రైవేట్ ఆస్పత్రులకు భారీ షాక్
దేశంలో కరోనా మహమ్మారి రెండో వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టినప్పటికీ, కొత్త వేరియంట్ల విలయం, మూడో వేవ్ తప్పదనే భయాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. సాధ్యమైనంత తొందరగా ఎక్కువ మందికి వ్యాక్సిన్లు అందించడం ద్వారా మాత్రమే రాబోయే పెను ముప్పును అడ్డుకోగలమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, దేశంలో ఉత్పత్తి అవుతోన్న టీకాల్లో అన్నిటికి అన్నీ ప్రజలకు చేరకపోవడం, ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన టీకాల్లో మెజార్టీ డోసులు వినియోగానికి నోచుకోకపోవడం ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన కీలక సూచనలను ప్రధాని నరేంద్ర మోదీ అమలులోకి తీసుకొచ్చారు. వ్యాక్సిన్ల పంపిణీ, ప్రైవేటు ఆస్పత్రులకు డోసుల కేటాయింపుపై బుధవారం నాడు కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది..

జగన్ ఏమడిగారంటే..
ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిగా వాడటంలేదని, ఆ కోటా వ్యాక్సిన్లను కూడా ప్రభుత్వానికే సరఫరా చేయాలంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మంగళవారం నాడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. కేంద్రం ప్రస్తుతం అవలంభిస్తోన్న వ్యాక్సినేషన్ పాలసీ ప్రకారం.. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం టీకాల్లో 25 శాతం డోసులకు కచ్చితంగా ప్రైవేటు ఆస్పత్రులకు కేటాయిస్తున్నారు. అయితే, కొన్ని ఆస్పత్రులు మినహా ప్రైవేటుకు కేటాయించిన వ్యాక్సిన్లలో చాలా వరకు నిరుపయోగంగా మిగిలిపోతున్నాయి. ప్రైవేటులో మిగిలిపోయిన వ్యాక్సిన్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసేలా విధానం రూపొందించాలని జగన్ కేంద్రాన్ని కోరారు. జులై నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 1771580 డోసులు కేటాయించారని.. ఇంత పెద్ద మొత్తంలో వ్యాక్సిన్లను ప్రైవేటు ఆస్పత్రులు వినియోగించుకునే అవకాశం లేదని కూడా ఏపీ సీఎం తన లేఖలో అభిప్రాయపడ్డారు. జగన్ లేఖ రాసిన 24 గంటల్లోపే సదరు అంశాలపై కేంద్రం వడివడిగా అడుగులు వేసింది..

ఇకపై కొవిన్ ద్వారానే ఆర్డర్స్
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తొలి నుంచీ కొవిన్ పోర్టల్ ద్వారానే జరుగుతున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు ఆస్పత్రులకు భారీ మొత్తంలో జరిపే కేటాయింపులు మాత్రం కొవిన్ కు విడిగా చేపడుతున్నారు. అలా 75 శాతం వ్యాక్సిన్లు పొందిన రాష్ట్రాలు వాటిని ప్రజలకు చేరవేస్తున్నప్పటికీ, 25 శాతం డోసులు పొందిన ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం పూర్తి స్థాయిలో వాటిని పంపిణీ చేయకపోతున్నాయి. ఈ వేస్టేజీని అరికట్టే దిశగా, ఇకపై ప్రైవేటు ఆస్పత్రులు కూడా కొవిన్ పోర్టల్ ద్వారానే వ్యాక్సిన్ల కోసం ఆర్డర్లు పెట్టుకోవాల్సి ఉంటుందని కేంద్రం స్పష్టంచేసింది. దీనికి సంబంధించి బుధవారం కొత్త మార్దర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

ప్రైవేట్ ఆస్పత్రులకు పరిమితంగానే..
నిజానికి మన దేశంలో ఇప్పటిదాకా సాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియలన్నీ కేంద్రమే స్వయంగా నిర్వహించింది. కొవిడ్ విషయంలో మాత్రమే ప్రస్తుత మోదీ సర్కారు ప్రైవేటు ఆస్పత్రులకూ అవకాశమిచ్చింది. అదికాస్తా సరిగా సాగకపోయేసరికి ఇప్పుడా విధానాలనూ ప్రభుత్వం సవరించుకుంటున్నది. కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ప్రైవేటు ఆస్పత్రులన్నీ కోవిన్ ద్వారానే వ్యాక్సిన్లకు ఆర్దర్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఉత్పత్తిదారుల నుంచి నేరుగా కొనుగోలు చేయరాదు. అంతేకాదు, ఒక నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు అందించే డోసులపైనా కేంద్రం పరిమితిని విధించింది. ఇప్పటిదాకా పంపిణీ అయిన లెక్కలను బట్టి ఆయా ఆస్పత్రులకు వ్యాక్సిన్ డోసులపై పరిమితిని విధిస్తారు. టీకామందు వృధా కాకుండా ఉండేందుకే ఈ విధానాలను సవరించామన్న కేంద్రం.. జులై 1 నుంచే ఈ సవరణలు అమలులోకి వస్తాయని పేర్కొంది.

టీకాలపై పరిమితి నిర్ధారణ ఇలా..
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఏ 7 రోజుల పీరియడ్ లో నైనా సగటున రోజువారీ వ్యాక్సిన్ వినియోగాన్ని రెట్టింపు చేయడానికి అవసరమైన ఫార్ములా కూడా వీటిలో ఉంది. తద్వారా ఒక హాస్పిటల్ కి గరిష్ట నెలవారీ పరిమితిని లెక్క కట్టడానికి వీలవుతుంది. ఉదాహరణకు ఓ ఆసుపత్రి జులై నెలకు ఆర్డర్ చేయదలిస్తే..అది ఏడు రోజుల పీరియడ్ గా 10-16 ను ఎంచుకోవచ్చు..ఈ 7 రోజుల్లో ఈ ఆసుపత్రి 700 డోసుల వ్యాక్సిన్ ని వినియోగించుకుంటే సగటున రోజువారీ వినియోగం 100 డోసులవుతుందని ప్రభుత్వం లెక్క కట్టింది. ఇప్పటిదాకా బెడ్స్ లభ్యత ఆధారంగా టీకాలను పంపిణీ చేయగా, ఇప్పుడు కోవిన్ డేటా బేస్ ఆధారంగానే ప్రైవేటుకు టీకాలు అందజేయనున్నారు. ప్రైవేటుకు పరిమితి విధించడం ద్వారా మిగలిన టీకాలను జగన్ కోరినట్లే ప్రభుత్వ వ్యాక్సినేషన్లకు వాడనున్నారు.












Click it and Unblock the Notifications